ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఏప్రిల్ 2వరకూ వీరిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు. ఇందులో భాగంగా భుజంగరావు, తిరుపతన్నలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే డిఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ కాగా, వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ ను, ఎస్ఐబీలో ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన గట్టుమల్లును గురువారం అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో భుజంగరావు, తిరుపతన్నలను విచారించేటప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. కస్టడీ ముగిసిన అనంతరం నిందితులతోపాటు ఈ రికార్డులను కూడా కోర్టుకు అప్పగించవలసి ఉంటుంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న ఉన్నతాధికారులతోపాటు రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.