Saturday, November 23, 2024

ప్రధాన సూత్రధారికి పోలీస్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ అలజడి

స్పోర్ట్ షూ సోల్‌ను తొలగించి గ్యాస్ క్యానిస్టర్లను దాచిన దుండగులు

పార్లమెంట్‌లో అలజడికి కారకుడు లలిత్ ఝాకు 7 రోజుల పోలీసు కస్టడీ

ఎఫ్‌ఐఆర్‌లో ఆసక్తికర అంశాలు

న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో ప్రధా న సూత్రధారి లలిత్ ఝాను ఢిల్లీ స్థానిక కోర్టు శుక్రవారం 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. డిసెంబర్ 13న పార్లమెంట్‌లో అలజడి ఘటన అనంతరం పారిపోయిన లలిత్ ఝా గురువారం రాత్రి న్యూఢిల్లీ జిల్లాలోని పోలీ సు స్టేషన్‌లో తనకు తానుగా లొంగిపోయాడు. శుక్రవా రం అతడిని కోర్టులో హాజరుపరచగా 15 రోజుల కస్ట డీ కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. యావత్ కుట్రను వెలికితీసేందుకు లలిత్ ఝాను 15 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూర్ అభ్యర్థించగా అతడికి 7 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ ప్రత్యేక జడ్జి హర్దీప్ కౌర్ ఉత్తర్వులు జారీచేశారు.

బీహార్‌కు చెందిన లలిత్ ఝా కోల్‌కతాలో టీచర్‌గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. అతను చాలా నెమ్మదస్తుడని కోల్‌కతాలోని అతని ఇంటి పక్కన నివసించే వారు తెలిపినట్లు వారు చెప్పారు. కొన్నేళ్ల క్రితం కోల్‌కతాలోని బుర్రబజార్ ప్రాంతానికి చేరుకున్న ఝా హఠాత్తుగా రెండేళ్ల క్రితం వెళ్లిపోయాడని అతని నివాసం సమీపంలోని టీషా పు యజమాని తెలిపినట్లు ఒక వార్తాసంస్థ తెలిపింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ నుంచి లలిత్ ఝా స్ఫూర్తి పొందినట్ల్లు పోలీసులు తెలిపారు. పార్లమెంట్ వెలుపల అమోల్ షిండే, నీలం దేవి స్మోక్ బాంబులు ప్రయోగిస్తుండగా లలిత్ ఝా వీడియో తీసి తాను పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు నీలాక్ష అయిచ్‌కు పంపాడని, ఈ వీడియోలను మీడియాకు అందచేయాలని కోరాడని పోలీసులు తెలిపారు.
స్మోక్ బాంబులు లోపలకు ఎలా వెళ్లాయంటే..
ఇదిలా ఉండగా లోక్‌సభలో స్మోక్ బాంబులను ప్రయోగించిన ఇద్దరు నిందితులు వాటిని లోపలకు ఎలా తీసుకువచ్చారో ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో తెలియచేశారు. తమ స్పోర్ట్ షూస్‌లోపలి ఎడమ వైపు సోల్‌ను కట్ చేసి నిందితులు అందులో స్మోక్ బాంబులు దాచారని, వాటిపైన దలసరి రబ్బర్ పొరలను అమర్చారని వారు చెప్పారు. నిందితులు మనోరంజన్ డి, సాగర్ శర్మ లోపలకు తెచ్చిన కరపత్రాలలో త్రివర్ణ పతాకం నేపథ్యంలో పిడికిలి బిగించిన చేతి బొమ్మ ఉందని, మణిపూర్ హింసాకాండకు సంబంధించి హిందీ, ఇంగ్లీష్‌లో నినా దం ఉందని పోలీసులు తెలిపారు. లోక్‌సభలో ఇద్దరు నిందితులు అలజడి సృష్టిస్తున్న సమయంలోనే పార్లమెంట్ వెలుపల అమోల్ షిండే, నీలమ్ దేవి అనే మరో ఇద్దరు వ్యక్తులు స్మోక్ బాంబును ప్రయోగించి తానాషాహి నహీ చలేగీ(నియంతృత్వం ఇక సాగదు) అంటూ నినాదాలు చేశారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి యుఎపిఎ కింద కేసు నమోదు చేశారు. లోక్‌సభలో ప్రయోగించిన స్మోక్ బాంబులపైన కళ్లజోడు, గ్లవ్స్ ధరించి ఉపయోగించాలని హెచ్చరికలు రాసి ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఒకరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా..ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝా పారిపోవడంలో సహకరించారన్న అనుమానంతో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఒకరు రాజస్థాన్ వాసి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News