Monday, December 23, 2024

టైమర్ సెట్ చేసిన బాంబులు.. పాక్ కుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

Police defuse three IEDs dropped in Jammu

 

జమ్ము : డ్రోన్ల ద్వారా దేశం లోకి అక్రమంగా పేలుడు పదార్ధాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్ ముష్కరులు చేస్తోన్న ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్‌ను గుర్తించి కాల్పులు జరిపారు. డ్రోన్ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆఖ్నూర్ సెక్టార్ లోని భారత్‌పాక్ సరిహద్దు ప్రాంతంలో సోమవారం రాత్రి ఓ డ్రోన్ సంచరిస్తున్నట్టు భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపారు. ఆ తరువాత పోలీస్ పార్టీ అక్కడ మోహరించి యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగం లోకి దించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కనచక్‌లో మరోసారి డ్రోన్ కన్పించింది. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

ఈ క్రమం లోనే డ్రోన్‌లో ఉన్న పేలోడ్ కిందపడగా, డ్రోన్ మాత్రం తప్పించుకున్నట్టు జమ్ము అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. డ్రోన్ నుంచి జారి పడిన పేలోడ్‌లో టిఫిన్ బాక్సుల్లో ఉన్న మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీలను పోలీసులు గుర్తించారు. వాటికి టైమర్ కూడా సెట్ చేసి ఉంచినట్టు తెలిపారు. బాంబులను నిర్వీర్యం చేసి , ఘటనపై కేసు నమోదు చేశామని ముకేశ్ సింగ్ చెప్పారు. అమర్‌నాధ్ యాత్రే లక్షంగా విధ్వంసం సృష్టించాలని పాక్ గత కొంతకాలంగా చేస్తోన్న కుట్రలను పోలీసులు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు. గత నెలాఖరులోనూ కధువా లోని తాల్లీ హరియాచాక్ గ్రామం వద్ద ఓ క్వాట్ కాప్టర్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు కూల్చి వేశారు. అందులో ఏడు మ్యాగ్నెటిక్ బాంబులు, ఏడు యూజీబీఎల్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News