Tuesday, February 4, 2025

ఢిల్లీ సిఎం ఆతిశీపై పోలీసుల ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి)ని ఉల్లంఘించారని, విధి నిర్వహణలోని ప్రభుత్వోద్యోగులను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి, కల్కాజి నియోజకవర్గం ఆప్ అభ్యర్థి ఆతిశీపై ఢిల్లీ పోలీసులు మంగళవారం ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. ఫతే సింగ్ మార్గ్‌లో డ్యూటీలో ఉన్న ఒక అధికారిని అడ్డుకున్న ఆప్ మద్దతుదారులతో ఆతిశీ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు ఆప్ సభ్యులు ఒక పోలీస్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేశారని వారు ఆరోపించారు. ‘కల్కాజి ఆప్ అభ్యర్థిపై వివిధ సెక్షన్ల కింద గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. మరింత దర్యాప్తు సాగుతోంది’ అని పోలీస్ అధికారి తెలిపారు. ఆప్ అభ్యర్థి 5070 మంది మద్దతుదారులు, 10 వాహనాలతో ఫతే సింగ్ మార్గ్‌లో కనిపించినందున ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు.

ఎంసిసి మార్గదర్శకసూత్రాల ప్రకారం ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవలసిందిగా వారిని పోలీసులు ఆదేశించినట్లు, కానీ వారు విధి నిర్వహణలో ఉన్న ఒక అధికారికి ఆటంకం కలిగించినట్లు ఆయన తెలిపారు. ‘మంగళవారం మధ్యాహ్నం 12.59 గంటలకు గోవిండ్‌పురి బాబా ఫతే సింగ్ మార్గ్‌లో ఒక గుంపు చేరినట్లు సమాచారం అందింది. హెడ్ కానిస్టేబుల్ కౌశల్ పాల్ స్పందించి, వీడియోగ్రఫీ ప్రారంభించారు. ఆప్ సభ్యులు అశ్మిత్, సాగర్ మెహతా అడ్డుకుని, ఆయనపై దౌర్జన్యం చేశారు’ అని డిసిపి (ఆగ్నేయం) అధికారిక ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. కాగా, తనపై పోలీస్ కేసు నమోదు చేసినందుకు ఎన్నికల కమిషన్‌ను ఆతిశీ ‘ఎక్స్’లో విమర్శించారు. కల్కాజి బిజెపి అభ్యర్థి రమేష్ బిధూరి, ఆయన కుటుంబ సభ్యులు ‘గూండాయిజానికి’ పాల్పడుతున్నారని, అయితే, వారిపై ఎటువంటి చర్యా తీసుకోలేదని, కానీ తనపై కేసు దాఖలు చేశారని ఆతిశీ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News