Monday, November 18, 2024

మాజీ నక్సలైట్ చర్యలను భగ్నం చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ములుగు: స్వార్ధ ప్రయోజనాల కోసం ఇద్దరు యువకులను మావోయిస్టు పార్టీలో చేరేలా ప్రేరేపించిన మాజీ నక్సలైట్ ను ఇద్దరు యువకులను చాకచక్యంగా పట్టుకున్నట్లు ములుగు ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ.. ఇద్దరు యువకులు మావోయిస్టు దళంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వెంటనే ఓఎస్డీ గౌస్ ఆలంకు తెలియపరచడంతో అప్రమత్తమై స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులతో పాటు ప్రేరేపించిన మాజీ నక్సలైట్ బొట్ల అశోక్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

మల్లంపల్లి గ్రామానికి చెందిన బాలుగు గణేష్, జాకారం గ్రామానికి చెందిన పుల్యాల నవీన్ ల వద్ద నుంచి విప్లవ సాహిత్యం, సెల్ ఫోన్లు స్వాధీన పర్చుకున్నారు. బొట్ల అశోక్ అనే వ్యక్తి తన వ్యక్తిగత స్వార్ధాలతో యువకులను తప్పుదోవ పట్టించాడని, గతంలో అతనిపై 4 కేసులు ఉన్నాయని అన్నారు. మావోయిస్టులలో కలిసేలా యువకులను ప్రోత్సహించింది అశోక్ అని విచారణలో తేలిందని తెలిపారు. అశోక్ వద్ద నుండి విప్లవ సాహిత్యాన్ని స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు. స్వార్ధ ప్రయోజనాలకోసం ఇలాంటి వ్యక్తులు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని వారి అసత్య ప్రచారాలకు బలి కావద్దని, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించవద్దని అన్నారు. ఎవరైనా వ్యక్తులు మావోయిస్టుల భావజాలానికి అనుకూలంగా ఏమైనా ప్రచారాలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు సిఐ మేకల రంజిత్ కుమార్, ఎస్సైలు బొంకూరి ఓంకార్ యాదవ్, లక్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News