Monday, January 20, 2025

భయటపడుతున్న పోలీసులు భాగోతాలు

- Advertisement -
- Advertisement -

వరుస సంఘటనలతో పోలీసుల ప్రతిష్ట మసగబారుతోంది. సమస్య చెప్పుకుందామని పోలీస్ స్టేషన్లకు వస్తున్న మహిళలు,యువతులతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో అప్రతిష్ట మూట గట్టుకుంటున్నారు. సనత్‌నగర్ ఇన్స్‌స్పెక్టర్ మూడు నెలల క్రితం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలతో ఎస్‌హెచ్‌ఓ పురేందర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. అందంగా ఉన్నవాని తను చెప్పిన చోటికి రావాలని తరచూ ఫోన్లో మెసేజ్‌లు పంపించి వేధించడం ప్రారంభించాడు. చాలా రోజుల నుంచి వేధింస్తున్నా కూడా బాధితురాలు బయటికి చెప్పలేదు, రోజు రోజుకు ఇన్స్‌స్పెక్టర్ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు మహిళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేసింది. ఇన్స్‌స్పెక్టర్ తనకు పంపించిన మెసేజ్‌లను చూపించడంతో పోలీస్ కమిషనర్ వెంటనే ఇన్స్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు.

ఇదే కమిషనరేట్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని వదిలేయడంతో బాధితురాలు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిజమని రుజువు కావడంతో అరెస్టు చేశారు. కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన ఓ ఇన్స్‌స్పెక్టర్ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో సైబరాబాద్ సిపి బదిలీ వేటు వేశారు. గతంలో బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేసిన నాగేశ్వర్‌రావు తన ఫామ్ హౌస్‌లో పనిచేస్తున్న వ్యక్తి భార్యపై కన్నేశాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో మహిళను బెదిరించి తన కారులో తీసుకుని వెళ్లి అత్యాచారం చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావును అరెస్టు చేశారు. కాగా ఇదే ఇన్స్‌స్పెక్టర్ బంజారాహిల్స్‌లోని పబ్‌పై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడుల విషయంలో తనను తప్పుదారి పట్టించాడని అప్పటి సిపి సివి ఆనంద్‌కు తెలియడంతో ఏకంగా నాగేశ్వర్‌రావును సర్వీస్ నుంచి తొలగించాడు.

బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ పోస్టింగ్ కోసమే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విచారణలో తెలిసింది. టిజిఎస్‌ఎస్‌పిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువకుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తాను మోసపోయానని గ్రహించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. కార్పొరేటర్ సోదరుడు ఉప్పల్ భగాయత్ ప్లాట్లలో తాము కలిసి ఉన్న వీడియోలు తీశాడని, వాటిని డిలీట్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ప్రేమికులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న శంకర్‌కు ఫిర్యాదు చేశారు. తాము డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తామని బ్లాక్‌మేయిల్ చేస్తున్నారని చెప్పారు.

ఈ కేసులో ఎస్సై బాధితులకు న్యాయం చేయకుండా వారితో సెటిల్ చేసుకోవాలని బాధితులకు చెప్పాడు. వారికి రూ.3లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని చెప్పాడు. దీంతో బాధితులు ఎస్సై భాగోతంపై రాచకొండ అప్పటి పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన సిపి ఎస్సై శంకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డిసిప్లేన్‌గా ఉండాల్సిన పోలీసులు పక్కదారి పడుతుండడంతో కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News