Sunday, November 3, 2024

వాహనం సీజ్ చేయొద్దు

- Advertisement -
- Advertisement -
Police have no power to seize vehicles Says HC
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
అమలు చేయనివారిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు
తాగి నడుపుతుంటే ఆ వ్యక్తితో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి చేతికి బండి ఇవ్వాలి
వెనుక ఎవరూ లేకపోతే బంధువులకో, స్నేహితులకో ఫోన్ చేసి వారికి అప్పగించాలి
ఎవరూ రాకపోతే వాహనాన్ని స్టేషన్‌కు తరలించి తరువాత అప్పగించాలి
ప్రాసిక్యూషన్ అవసరం అనుకుంటే మూడు రోజుల్లో ఛార్జిషీట్ వేయాలి
అనంతరం బండి అప్పగించాలి
వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

మనతెలంగాణ/హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి నడిపితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు పేర్కొంది. అలాగే మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడిపేందుకు అనుమతించవద్దని, మద్యం తాగని మరో వ్యక్తి వాహనదారుడి వెంట ఉంటే అతడికి వాహనాన్ని అప్పగించాలని తెలిపింది. ఒకవేళ వాహనదారుడి వెంట ఎవరూ లేకపోతే బంధువు లేదా స్నేహితుడిని పిలిపించి వాహనాన్ని ఇవ్వాలని సూచించింది. ఎవరూ రాకపోతే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తర్వాత వాహనాన్ని అప్పగించాలని తెలిపింది. ఇక ప్రాసిక్యూషన్ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేయాలని హైకోర్టు తెలిపింది. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక వాహనాన్ని అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి స్పష్టం చేసింది.మద్యం సేవించి వాహనం డ్రైవింగ్ చేయడం నేరమని, ఒకవేళ మద్యం సేవించి ఉంటే వాహన చోదకుడిని అరెస్ట్ చేయొచ్చు కానీ, వారి వాహనాన్ని మాత్రం సీజ్ చేయొద్దని రాష్ట్ర హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

మార్గదర్శకాలు జారీ 

డ్రంక్ అండ్ డ్రైవర్ కేసులపై దాఖలైన 40 రిట్ పిటిషన్లపై విచారణ పూర్తి చేస్తూ జస్టిస్ కె ఎల్ లక్ష్మణ్ సారధ్యంలోని హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడుపుతూ ఉంటే, ఆయనతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేసేందుకు పోలీసులు అనుమతించాలి లేదా వారి బంధువుకు గానీ, స్నేహితుడికి గానీ సమాచారం ఇచ్చి సదరు వాహనం తీసుకెళ్లమని సూచించాలని హైకోర్టు పేర్కొంది. ఈ మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం లేనప్పుడు మాత్రమే పోలీసులు సంబంధిత వాహనాన్ని తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించింది. అలా జప్తు చేసిన వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సమర్పించిన దాని యజమాని, లేదా అధీకృత వ్యక్తికి తదుపరి దాన్ని అప్పగించాల్సి ఉంటుంది.

3 రోజుల్లో చార్జిషీట్‌తో మేజిస్ట్రేట్ ముందుకు

ఇక మద్యం సేవిస్తూ వాహనం డ్రైవ్ చేసిన వ్యక్తిని పోలీసులు మూడు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని పోలీసులను హెచ్చరించింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ గానీ, ఇతర ప్రభుత్వ ఆదేశాల్లో గానీ ఒక వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News