Wednesday, January 22, 2025

సెక్యూరిటీపై నిఘా

- Advertisement -
- Advertisement -
Police inquiries into security agencies in Telangana
 సమాంతర పోలీసులకు ప్రత్యేక శిక్షణ
 రాష్ట్రంలో ‘సెక్యూరిటీ’ సంస్థలపై పోలీసుల ఆరా..!
 అనుమతిలేని ఎజెన్సీలపై ప్రత్యేక నిఘా

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసులకు ధీటుగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థల వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సంస్థలు, ఎజెన్సీలపై పోలీసుశాఖ ఆరా తీయడంతో పాటు సెక్యూరిటీ గార్డులకు పోలీసు శిక్షణ ఇచ్చేందుకు సమాలోచనలు సాగిస్తున్నారు. కీలకమైన సంస్థలు, సముదాయాల వద్ద విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బందికి పోలీసు శిక్షణ తప్పని సరిగా ఉండాలని పోలీసు బాసులు సూచిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఏలాంటి అనుమతులు లేకుండా సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎజెన్సీల వివరాలు సేకరిచేందుకు పోలీసులు సమాయత్తమౌతున్నారు. ముఖ్యంగా అన్ని రకాల అనుమతులతో ప్రముఖ సంస్థల వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కీలక సంస్థలు, పరిశ్రమల సెక్యూరిటీ కాంట్రాక్టు పొందిన ఎజెన్సీలు సిబ్బందిని నియాకమకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

అదేవిధంగా సెక్యూరిటీ సంస్థలను నిర్వహిస్తున్న వారిపై, సెక్యూరిటీ ఎజెన్సీలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనుమతిలేని సెక్యూరిటీ సంస్థల ఏరివేత సులభతరమౌతోందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ప్రముఖ సంస్థలు, పరిశ్రమల వద్ద ఏదైనా జరిగితే అందుకు పరోక్షంగా పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుందని ముందస్తుగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వనిబంధనలను ఉల్లంఘిస్తూ గుర్తింపు లేని సెక్యూరిటీ ఎజెన్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎజెన్సీలకు కళ్లెం వేసేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. ఈక్రమంలో సెక్యూరిటీ ఎజెన్సీల వివరాలను సేకరించేందుకు పోలీసుశాఖ అధికారులు కార్మిక శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సమాయత్తమౌతున్నారు. అదేవిధంగా కార్మిక శాఖ సైతం పలు సెక్యూరిటీ ఎజెన్సీలు సెక్యూరిటీ సిబ్బందికి కనీసవేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్ కల్పించని సంస్థలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రాధమిక విచారణలో రాష్ట్రంలో దాదాపు 400 సెక్యూరిటీ ఎజెన్సీలకు ప్రభుత్వం నుంచి ఏలాంటి గుర్తింపు లేనట్లుగా తేలింది. ప్రైవేటు ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా సెక్యూరిటీ గార్డులను ఎంపిక చేసుకుని పారిశ్రామిక వాడల్లో, అపార్ట్ మెంట్ల యాజమాన్యాలతో కాం ట్రాక్టు కుదుర్చుకుని కమీషన్ పద్ధ్దతుల్లో సెక్యూరిటిని నియమించడంపై పోలీసులు నిఘా సారిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి అనుతులున్న ఎజెన్సీలకు చెందిన సెక్యూరిటీలను మాత్రమే సెక్యూరిటీ సిబ్బందిగా నియమించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

అవగాహన అంతంత మాత్రం :

రాష్ట్రంలో గుర్తింపులేని సెక్యూరిటీ ఎజెన్సీలలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆయుధాలు, అగ్ని ప్రమాద నివారణకు చర్యలు, నేరస్తులను గుర్తించే విధానాలపై అవగాహన అంతంత మాత్రమే ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. ఈక్రమంలో సెక్యూరిటీ ఎజెన్సీలు వారి వద్ద పనిచేసే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం లేదని తేలింంది. దీంతో రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఏజెన్సీలు నిబంధనల మేరకు అక్కడి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు సాగిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీల్లో 60 శాతం ప్రభుత్వ గుర్తింపు లేనివే ఉన్నాయన్నది సమాచారం. ప్రధానంగా ఉత్తరాధి రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం రాష్ట్రానికి వచ్చేవారు ఎక్కువగా సెక్యూరిటీ గార్డులుగా పనిలోకి చేరుతున్నారు. ముఖ్యంగా మణిపూర్, నాగలాండ్, బీహార్,రాజస్తానీ, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలవారు రాష్ట్రంలో సెక్యూరిటీ గార్డులుగా కొనసాగు తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పుట్టగొడుగుల్లా సెక్యూరిటీ ఎజెన్సీలు :

రాష్ట్రంలో బోగస్ సెక్యూరిటీ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయని రాష్ట్ర ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. సెక్యూరిటీ గార్డు కావాలంటే కఠినమైన శిక్షణ,క్రమశిక్షణ అవసరమని, ఏమాత్రం అవగాహణ లేని వారు సైతం ఎజెన్సీలను ప్రారంభిస్తున్నాయని వివరించారు. రాష్టంలో గుర్తిం పులేని ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు తక్కువవేతనాలు చెల్లించి అపార్టు మెంట్లకు సెక్యూరిటీ గార్డులను పంపిస్తుంటాయని ఆయన తెలిపారు. ఏజెన్సీలు అధిక కమీషన్లు పొందుతూ సిబ్బందికి తక్కువ వేతనాలు చెల్లిస్తుంటాయని ఆయన చెప్పారు. పోలీసు శాఖ సీరియస్ గా స్పందించి గుర్తింపు లేని ఏజెన్సీలను ఏరివేయాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News