Wednesday, January 22, 2025

నాకు 100 కోట్లు.. నాతో వచ్చేవారికి 50 కోట్లు

- Advertisement -
- Advertisement -

Police Interrogation in TRS MLAs buying Case

కీలకంగా మారిన గంటన్నర నిడివిగల ఆడియో, వీడియో రికార్డు 
ముందుగానే సమాచారం అందడంతో నిందితులను పట్టుకోవడానికి పక్కా స్కెచ్ వేసిన పోలీసులు

ఫాం హౌస్ హాల్‌తో పాటు పరిసరాల్లో 74 రహస్య కెమెరాల ఏర్పాటు
బాడీవోర్న్ కెమెరాలు ధరించిన నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు

కేంద్ర ప్రభుత్వంలోని ‘పెద్ద’కు మూడుసార్లు ఫోన్ చేసిన నిందితుడు రామచంద్ర భారతి
మూడు రోజుల పాటు సాగిన ఆపరేషన్‌లో పాల్గొన్న 70మంది పోలీసులు
శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల విచారణ.. ఆరోగ్య పరీక్షలు
ఎ1గా సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, ఎ2 నందకిషోర్, ఎ3
మన తెలంగాణ/హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌజ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాండూరు ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజులు, నందకుమార్‌లపై మెయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 120బి, 171బి, రెడ్ విత్ 171ఇ, 506, రెడ్ విత్ ఐపిసి 34 యాక్ట్ సెక్షన్ 8 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మెయినాబాద్ ఫాంహౌస్‌ను గురువారం మరోమారు పోలీసులు తనిఖీ చేశారు. ఫాంహౌజ్ చుట్టూ ఉన్న సిసిటివి ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎంఎల్‌ఎలతో ఈ ముగ్గురు ఎప్పటి నుంచి టచ్‌లో ఉన్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముగ్గురిని పోలీసులు శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారణ చేశారు. ఈ ఫాంహౌస్‌లో ఎప్పట్నించీ ఈ ముగ్గురు ఉన్నారనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముగ్గురు ఎలా తమను ప్రలోభ పెట్టారనే విషయాన్ని ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.
కీలకంగా మారిన ఫోన్ కాల్స్
టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంఎల్‌లు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురు చేసిన ఫోన్‌కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నరపాటు వీరి మంతనాలు నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డిలను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్లుగా చెబుతున్న సింహయాజులు స్వామి, సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, నందకుమార్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి, కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. రోహిత్‌రెడ్డి ద్వారానే ఈ సమావేశం మెయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో ఉన్న తన ఫాంహౌజ్‌లో జరిగేలా కథ నడిపారని,బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎంఎల్‌ఎల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రం ఫామ్‌హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్‌తో పాటు ఆరు చోట్ల రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. నలుగురు ఎంఎల్‌ఎలు బాడీవోర్న్ కెమెరాలు ధరించినట్లు సమాచారం.
గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్లు…
సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద ఆ ముగ్గురు, సోఫాలో ఎంఎల్‌ఎలు నలుగురు కూర్చున్నారు. ఈ మీటింగ్ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎంఎల్‌ఎలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అయితే, ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తితో మాట్లాడించాలని ప్రయత్నించారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది. అయితే కీలక వ్యక్తిగా చెబుతున్న సదరు కేంద్ర పెద్ద ఎవరనేదానిపై పోలీసులు దృష్టిసారించారు. ప్రలోభాల పర్వంలో కీలకంగా భావిస్తున్న సదరు కీలక వ్యక్తి గుట్టు రట్టు చేసే దిశగా పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఫోన్‌కాల్స్ డేటాను, బాడీవోర్న్ కెమెరా సంభాషణలను సైతం డీకోడ్ చేసి సమాచారం రాబట్టే దిశగా తమ ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.
మూడు రోజులు 70 మంది పోలీసులు..
ఈ ఆపరేషన్ నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది మూడు రోజులు పనిచేశారు. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 74 సీక్రేట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంటన్నరపాటు సాగిన భేటీ ఈ కెమెరాలో రికార్డు అయింది. పీఠాథిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు, ఎంఎల్‌ఎల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి, అన్నమయ్య జిల్లా చిన్న మండ్యం మండలంలో శ్రీమంత్రరాజు పీఠం ఏర్పాటు చేసుకుని తనను తాను పీఠాథిపతిగా ప్రకటించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది.
డబ్బు తెచ్చింది నందూయేనా…?
రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్‌లోని ఓ ఆలయ పూజారి. కాగా, కర్ణాటకకు చెందిన నందకుమార్ నగరానికి వలస వచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో సదరన్ స్పైస్ పేరుతో ఓ రెస్టారెంట్ నడిపాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫిల్మీ జంక్షన్ అనే రెస్టారెంట్ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముఖుడితో విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత అవినాష్ అనే వ్యక్తితో కలిసి మాణిక్ చంద్ పాన్ మసాలా వ్యాపారం చేశాడు. తరువాత, మాణిక్ చంద్ బ్రాండ్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఎపిలోనూ సౌత్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. వీటితో పాటు నగరంలోని అనేక పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు అతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజా ప్రతినిధులు పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని హవాలా ఆపరేటర్ అని కూడా తెలిపారు. బుధవారం నాడు పుట్టినరోజు కావడంతో ఈ ఫాంహౌజ్ పార్టీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్ కావడంతో డబ్బు తీసుకుని వచ్చింది నందుయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
నాకు రూ.100 కోట్లు.. నాతో చేరేవారికి రూ.50 కోట్ల ఆఫర్..
చేరకపోతే ఇడి, సిబిఐ కేసులు: రోహిత్‌రెడ్డి
తాండూరు ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి(ఎ1), హైదరాబాద్‌కు చెందిన నందకిషోర్ (ఎ2), తిరుపతికి చెందిన సింహయాజులు(ఎ3)పై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఎసిపి తెలిపారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలను పోలీసులు పొందుపర్చారు. బిజెపిలో చేరితే రూ.100 కోట్లు ఇప్పిస్తామని సతీష్‌శర్మ అలియాస్ రామచంద్ర భారతి ఆఫర్ చేశారని, నందకుమార్ మధ్యవర్తిత్వంతో ఫాంహౌస్‌కు సతీష్‌శర్మ అలియాస్ రామచంద్ర భారతి వచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని బిజెపి తరపున వారు హామీ ఇచ్చినట్లు పైలట్ రోహిత్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఆ పార్టీలో చేరకపోతే ఇడి, సిబిఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొ న్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించారు. దీనికి నందకుమార్ మధ్య వర్తిత్వం వహించారు. నందకుమార్ ఆహ్వానంతోనే రామచంద్ర భారతి, సింహయాజులు ఫాంహౌజ్‌కు వచ్చారు. ఫాంహౌజ్‌కు వచ్చిన వారు ఎంఎల్‌ఎలతో బేరాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వచ్చిన మధ్య వర్తులు జరగబోయే పరిణామాలు వివరించారని పోలీసులు పేర్కొన్నారు. బిజెపిలో చేరకపోతే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పినట్లు కూడా అందులో తెలిపారు. బిజెపిలో చేరితే కీలక కాంట్రాక్ట్‌తో పాటు భారీ మొత్తంలో డబ్బు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామన్నట్లు వివరించారు. ఇదంతా రోహిత్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.

Police Interrogation in TRS MLAs buying Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News