Saturday, November 23, 2024

పబ్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

నిందితుల ఫోన్ డేటా ఆధారంగా విచారణ
అభిషేక్‌కు సినీ,రాజకీయ సంబంధాలపై ఆరా..!

Police investigation into pub case

మనతెలంగాణ/హైదరాబాద్: బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే అభిషేక్‌తో పబ్ మేనేజర్ అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈకేసులో అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలో డేటాను విశ్లేషిస్తున్నారు. అభిషేక్ సెల్‌ఫోన్‌లో పలువురు మాదక ద్రవ్యాల విక్రేతల ఫోన్ నంబర్లతో పాటు రాజకీయ,సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. దీంతో తొలుత మాదక ద్రవ్యాల విక్రేతలకు, అభిషేక్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అభిషేక్, అనిల్‌ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే, మాదక ద్రవ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటికే పోలీసులు వీరిద్దరి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేసిన విషయం విదితమే. కాగా పబ్‌లో పోలీసుల దాడుల సమయంలో 60 మందికి సరిపడా డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్ పై దాడి చేసిన సమయంలో అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతడి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. దర్యాప్తులో భాగంగా పబ్‌లోని సిసి కెమెరాల దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పబ్‌లో 4.6 గ్రాముల కొకైన్‌తో పాటు అనుమానాస్పద పదార్థాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

గ్రాము కొకైన్‌ను కనీసం 10 నుంచి 12మంది వరకు తీసుకోవచ్చని ఈ లెక్కన దాదాపు 60 మందికి పబ్‌లో మాదక ద్రవ్యాలు సరఫరా చేసేలా ఏర్పాట్లు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో పబ్‌లో జరిగిన పార్టీకి మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లందరి వివరాలను ఇప్పటికే సేకరించిన పోలీసులు వాళ్లలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న అర్డున్, కిరణ్ రాజ్‌ల కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపడుతున్నారు. డ్రగ్స్ పబ్ లోకి ఎలా వచ్చాయి, బర్త్ డే పార్టీ ఎవరిదన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారాలపైనా పోలీసుల దృష్టి సారించారు.

అసలు సూత్రధారులతోపాటు డ్రగ్స్ వినియోగించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎన్‌డిపిసి చట్టంలోని 8సి, 22 బి, 29 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు గత ఏడాది పబ్‌ను లీజుకు తీసుకున్న అభిషేక్, అర్జున్, కిరణ్‌లను పోలీసులు నిందితులుగా చేర్చారు. పబ్‌లోని సీసీ కెమెరాలలోని ఫుటేజ్‌లో జనం కిక్కిరిసి ఉండటంతో డ్రగ్స్ ఎవరు వాడారనేది గుర్తించడం కష్టతరంగా మారిందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు అనిల్, అభిషేక్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పబ్‌లో డ్రగ్స్ వాడిన వారెవరనే ప్రాథమిక వివరాలు తెలిస్తే వారికి పరీక్షలు చేయించేందుకు పోలీసులు సమాయత్తమౌతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News