సినీనటుడు అల్లు అర్జున్‌కు హైదరాబాద్, రాంగోపాల్‌పేట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించినున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు, మళ్లీ సోమవారం కూడా నోటీసులు ఇచ్చారు. బాలుడిని చూసేందుకు ఆస్పత్రికి వస్తే ముందుగానే అనుమతి తీసుకోవాలని, తర్వాతే అక్కడికి వెళ్లాలని పేర్కొన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్‌కు నోటీసులు అందజేశారు.కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చినా భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాంగోపాల్‌పేట్ పోలీసులు తెలిపారు. కానీ గంట లోపలే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేలా ఆయన చూసుకోవాలని సూచించారు.
సందర్శన గోప్యంగా ఉంచాలని, ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటన దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి రావొద్దని స్పష్టం చేశారు. ఒకవేళ అలా సమాచారం ఇవ్వకుండా వెళ్తే జరిగే పరిణామాలకు అల్లు అర్జునే బాధ్యత వహించాలని పోలీసులు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 4న గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తారనే సమాచారం రాంగోపాల్‌పేట్ పోలీసులకు తెలిసింది. దీంతో ఆదివారం ఉదయం పోలీసులు మెుదటిసారిగా బన్నీకి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన మేనేజర్‌కు నోటీసులు అందజేశారు. శాంతిభద్రతల దృష్ట్యా శ్రీతేజ్‌ను చూసేందురు రావొద్దని తెలిపారు. బాలుడిని పరామర్శించేందుకు రావాలనుకుంటే తాము చెప్పే సూచనలు పాటించాలని, ఆ సమయంలో అనుకోని ఘటనలు జరిగితే దానికి బన్నీనే బాధ్యత వహించాలని చెప్పారు. అయితే పోలీసులు సోమవారం కూడా మరోసారి నోటీసులు అందజేశారు.