Monday, December 23, 2024

హైదరాబాద్ లో వ్యాపారస్తులకు పోలీస్ లైసెన్స్…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నవారంతా పోలీస్ లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన అమల్లోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలోని పలు వ్యాపార సంస్థల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా పలువురు మృత్యువాతపడుతున్నారు. ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ డెక్కన్ మాల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పోలీస్ లైసెన్స్‌ను అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2014 వరకు వ్యాపారాలు నిర్వహించాలనుకున్నవారంతా పోలీస్ లైసెన్స్ తీసుకొనే వారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యాపారస్తులు పోలీస్ లైసెన్స్ తీసుకోవడం అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఏ వ్యాపారం చేస్తున్నారు? ఎంతమంది పనిచేస్తారు? ఈ వ్యాపారానికి అవసరమైన మెటీరియల్ ఎక్కడి నుండి తెస్తారు? అగ్నిమాపక శాఖతో పాటు ఇతర శాఖల లైసెన్స్‌లు ఉన్నాయా? అనే విషయాన్ని లైసెన్సులు జారీ చేసే సమయంలో పోలీసులు పరిశీలించనున్నారు. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ లైసెన్సులు లేవు. దీంతో వ్యాపార సంస్థలకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద లేకుండా పోయింది. పోలీస్ లైసెన్స్‌ను అమల్లోకి తీసుకువస్తే వ్యాపార సంస్థల సమాచారం పోలీసుల వద్ద కూడా ఉంటుంది. ఏదైనా ఘటన జరిగిన సమయంలో వ్యాపార సంస్థలకు సంబంధించిన సమాచారం పోలీసులు దర్యాప్తునకు మేలు కల్గించే అవకాశం లేకపోలేదు.

ఆయా వ్యాపారాన్ని బట్టి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. కనీస ఫీజు రూ. 1000 నుండి ప్రారంభం కానుంది. టీ స్టాల్ నుండి రెస్టారెంట్ వరకు పోలీస్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో పోలీస్ లైసెన్స్ జారీ చేయనున్నారు. ఈ ఏడాది లైసెన్స్ తీసుకొంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆ లైసెన్స్ అమల్లో ఉంటుంది. ప్రతి ఏటా లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ లైసెన్స్‌కు సంబంధించి వ్యాపారులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. hyderabadpolice.gov.in వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News