Thursday, January 23, 2025

ఎలుక కూడా జంతువే..చంపితే నేరమే!

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: జంతువులను క్రూరంగా హింసించి చంపడం నేరంగా చట్టం పరిగణిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. జంతువులంటే కుక్క, పిల్లి మొదలుకొని ఏనుగు వరకు ఉంటాయని మనమంతా భావిస్తుంటాం. అయితే ఎలుకను చంపడం కూడా నేరమని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక 30 ఏళ్ల వ్యక్తిపై చార్జిషీట్ కూడా వేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బదౌన్‌లో ఒక పూరి గుడిసెలో ముగ్గురు కూతుళ్లతో నివసించే మనోజ్ కుమార్ అనే కుమ్మరిపై ఎలుకను ఇటుకకు కట్టేసి నీటిలో ముంచి చంపాడన్న నేరం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసిలోని సెక్షన్ 429తోపాటు జంతు హింస నిరోధక చట్టంలోని సెక్షన్ 11(1) కింద మనోజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
జంతు హక్కుల కార్యకర్త వికేంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు 2022 నవంబర్‌లో మనోజ్‌పై కేసు నమోదు చేశారు. ఇటుకకు ఎలుక తోకను కట్టి దాన్ని నీటిలో ముంచుతూ అత్యంత క్రూరంగా మనోజ్ చంపుతున్న దృశ్యాలతో కూడిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరలైంది.దీన్ని ఆధారంగా చేసుకుని వికేంద్ర శర్మ మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. నవంబర్‌లోనే మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై అతను విడుదలయ్యాడు. ఎలుకను నీటిలో ముంచి చంపినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదిక నిర్ధారించడంతో ఇప్పుడు పోలీసులు మనోజ్‌పై వివిధ సెక్షన్ల కింద కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. స్థానికుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. మరి..ఎలుకను చంపిన నేరానికి న్యాయస్థానం మనోజ్ కుమార్‌కు ఎటువంటి శిక్ష విధిస్తుందో వచే చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News