లొంగిపోవాలని చెప్పిన డిసిపి రక్షిత
మనతెలంగాణ, హైదరాబాద్ : అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఇద్దరు మావోయిస్టుల కుటుంబ సభ్యులను రాచకొండ పోలీసులు శనివారం కలిశారు. మావోయిస్టుల్లో ఉన్న వారిని వెంటనే లొంగిపోవాల్సిందిగా కోరాలని చెప్పారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావోయిస్టుల కుటుంబాలను మల్కాజ్‌గిరి డిసిపి రక్షిత మూర్తి, ఎడిసిపి శివకుమార్, పోలీసులు కలిశారు. అండర్ గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు అల్వాల్ చంద్రహాస్ అలియాస్ పాండు అలియాస్ ప్రమోద్ అలియాస్ చంద్రన్న, పల్లెపాటి రాధా అలియాస్ నీల్‌సో కుటుంబాలను కలిశారు.
యాప్రాల్‌లో ఉంటున్న చంద్రహాస్ అక్క, బావను డిసిపి, ఎడిసిపి కలిశారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ఇందిరానగర్‌లో ఉంటున్నపల్లెపాటి రాధా తండ్రి పల్లెపాటి బాలయ్య, తల్లి పోచమ్మను కలిశారు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను అందజేశారు. హింస ద్వారా ఎమి సాధించలేరని, అడవలను వీడి జనజీవ స్రవంతిలో కలువాలని డిసిపి రక్షితమూర్తి కోరారు. మావోయిస్టులు లొంగిపోతే వారికి వైద్య చికిత్స చేయిస్తామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. కరోనాతో అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని అన్నారు.