మన తెలంగాణ/హైదరాబాద్ : గోషామహల్ బిజెపి అభ్యర్థి, ఎంఎల్‌ఎ రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. అంతేకాకుండా ఆయన చేసిన విద్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు జారీ చేశారు. కాగా రాజాసింగ్ దసర సందర్భంగా తుపాకులు, కత్తులు ప్రదర్శించి పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి విదితమే. అక్టోబర్ 16న రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో విద్వేషపూరిత ప్రసంగం కూడా ఉందని పోలీసులు వెల్లడించారు.
నవరాత్రి దాండియా కార్యక్రమాలు, వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని నిర్వాహకులను రాజాసింగ్ కోరారు. అంతేకాదు కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను పరిశీలించాలని, ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు, వీడియోగ్రాఫర్లు, డిజె నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని వీడియోలో కోరారు. ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఎ సమద్ వార్సీ ఫిర్యాదు మేరకు ఐపిసి 153ఎ, 295ఎ, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.