Friday, November 22, 2024

పోలీసు అధికారులు విధి నిర్వహణలో…

- Advertisement -
- Advertisement -

విజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది : డిజిపి అంజనీ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఉత్పాదకత సాధించడానికి ఎప్పటికప్పుడు తమ విజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను నవీకరించుకోవలసిన అవసరం ఉందని డిజిపి అంజనీ కుమార్ అన్నారు. శిక్షణ ఐజిపి తరుణ్ జోషి నేతృత్వంలో రాష్ట్రంలోని 29 పోలీసు శిక్షణా సంస్థల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ట్రైనీ అభ్యర్ధులతో మంగళవారం నిర్వహించిన వర్కషాప్‌లో అంజనీకుమార్ పాల్గొన్నారు. 9,871 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సిటి) పోలీస్ కానిస్టేబుల్స్, సివిల్, ఎఆర్, ఐటి అండ్ సి, పిటిఒ మెకానిక్స్, డ్రైవర్లకు ఇండక్షన్ ట్రైనింగ్‌కు ముందు ఈ వర్క్ షాపును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డిజిపి అంజనీకుమార్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతు న్నప్పుడు ట్రైనీలు తప్పనిసరిగా ఉత్సాహంగా ఉండాలన్నారు. పని సంస్కృతిలో మార్పు, సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం వంటి అంశాలను వివరిస్తూ అభ్యర్ధులు కేవలం వ్యక్తిగత కార్యాచరణపై దృష్టి పెట్టకుండా టీమ్ స్పిరిట్‌ను పెంపొందించుకోవడానికి టీమ్ స్పోర్ట్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించాలని ప్రిన్సిపాల్స్ వైస్ ప్రిన్సిపాల్‌లను కోరారు. శిక్షణార్థులకు సరైన వాతావరణం ఉండేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని, దుష్ప్రవర్తనను పోలీసు శాఖ సహించబోదన్నారు. అలాంటి అభ్యర్థుల పట్ల డిపార్ట్‌మెంట్ కఠినంగా వ్యవహరిస్తందన్నారు. అభ్యర్ధులను క్రమశిక్షణలో పెట్టే భాద్యత ప్రిన్సిపాల్స్‌పై ఉందన్నారు. ప్రతి స్థాయిలో విజిలెన్స్ సంస్కృతి కూడా ముఖ్యమైనదన్నారు. నిపుణులైన ట్రైనర్‌లతో అభ్యర్ధులకు ఆన్‌లైన్ సెషన్‌లను నిర్వహించాలని, సాంకేతికతను ఉపయోగించు కోవడంలో వారికి సహాయపడాలని శిక్షణ ఐజిపి తరుణ్ జోషిని కోరారు. వనరులను సరైన రీతిలో ఉపయోగించడం, విధినిర్వహణలో పారదర్శకత వంటి అంశాల ప్రాధాన్యతను అభ్యర్ధులకు వివరించాలన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వం పోలీసు శాఖకు ఎక్కువ వనరులను కేటాయించిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్ధులకు నిపుణులతో శిక్షణ ఇప్పించడం ఎంతో ముఖ్యమని దానిని పరిశీలించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపల్స్‌పై ఉందన్నారు. సైన్యంలో శిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అలాంటి కఠోర శిక్షణా సంస్కృతిని పోలీసు శాఖలో కూడా తీసుకురావాలన్నారు. రెగ్యులర్ శిక్షణా తరగతులతో పాటు జిల్లా కలెక్టర్, ఆర్‌డిఓ, జిల్లా అటవీ అధికారి, విశ్వవిద్యాలయాల సీనియర్ ప్రొఫెసర్లు, ఇతర విద్యావేత్తలతో స్పెషల్ ఇంటరాక్షన్ తరగతులు నిర్వహించాలని సూచిం చారు. ఐజిపి తరుణ్ జోషి మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన శిక్షణ ఇస్తున్నామని, ఇండోర్, అవుట్‌డోర్ శిక్షణ మాడ్యూల్స్ గురించి అంజనీ కుమార్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో శిక్షణా సంస్థల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టామని, ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయని చెప్పారు. ముగింపు ప్రసంగంలో ఐజిపి (పిఅండ్‌ఎల్) ఎం రమేష్ మాట్లాడుతూ శిక్షణా సంస్థల్లో రూ.కోటికి పైగా ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. 17.20 కోట్లతో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయన్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో ఏదైనా నష్టం జరిగితే జవాబుదారీగా ఉండాలని ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్‌లకు ఆయన సూచించారు. శిక్షణా సెషన్‌ల ప్రారంభానికి ముందు తమ సంస్థల్లో చేపట్టిన వివిధ పనులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపల్స్ వివరించారు. సైబరాబాద్ డిసిపి అడ్మినిస్ట్రేషన్ యోగేష్ గౌతమ్, 4వ బెటాలియన్ కమాండెంట్ సింధు శర్మ, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ డి. తులసిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Police 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News