సంగారెడ్డి: రక్త దానం చేసి విలువైన ప్రాణాలు కాపాడటానికి ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ రమణ కుమార్ పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సంగారెడ్డి జిల్లా పోలీసుల అధ్వర్యంలో పోలీస్ కళ్యాణ మండపంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి,పోలీస్ శాఖఅధికారులు, సిబ్బంది,పట్టణ యువత రక్త దానం చేశారు. అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ,సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మరియు సంగారెడ్డి పట్టణ యువకులు స్వచ్చందంగా వచ్చి రక్త దానం చేశారని, 52 యూనిట్ల బ్లడ్ ను సేకరించడం జరిగిందని తెలిపారు.ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చని, రక్త దానం ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడుతుంద న్నారు. కులమత భేదం లేని, గ్రూపులు మాత్రమే కలిగి వున్న రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని,అందుకే రక్తానికి అంత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సబ్ డివిజన్లలో మొత్తం 291 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు.
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో సుమారు మూడు వందల మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సబ్ డివిజన్లలో 550 మంది రోగులకు పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున అభినందనలు తెలియజేస్తూ, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ టి.ఉషావిశ్వనాథ్,సంగారెడ్డి డి.ఎస్పీ బి.రవీంద్రారెడ్డి , డా. జ్యోతి , సంగారెడ్డి-టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, రూరల్ సి.ఐ శివలింగం, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ రమేష్, యస్.బి ఎస్‌ఐ యాదవరెడ్డి, ఆర్.ఐ.లు కృష్ణ, డానియల్, రామారావ్, పోలీస్ సంఘం అధ్యక్షులు దుర్గరెడ్డి, కోశాదికారి ఆసిఫ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.