న్యూఢిల్లీ: వైరల్ వీడియోల పుణ్యమాని ఢిల్లీ మెట్రో రైళ్లలో ఇక సాయుధ పోలీసుల గస్తీ ఏర్పడనున్నది. ఇటీవల కొంతకాలంగా అసభ్యకరమైన, అనాగరికమైన సంఘటనలు ఢిల్లీ మెట్రో రైళ్లలో చోటుచేసుకుంటున్నాయి. ఇవి వీడియోల రూపంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉలిక్కిపడింది. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు బాధ్యతతో, సభ్యతతో వ్యవహరించాలంటూ పలుమార్లు కార్పొరేషన్ విజ్ఞప్తి కూడా చేసింది. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తోటి ప్రయాణికులకు ఇబ్బందికలిగించే రీతిలో ఉన్న కొందరి ప్రవర్తనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అసహనంగా ఉంది. దీన్ని అదుపు చేయడానికి యూనిఫారమ్ ధరించిన పోలీసులతో మెట్రో రైళ్లలో పెట్రోలింగ్ నిర్వహంచాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లలోకాని స్టేషన్ల పరిసరాలలో కాని అసభ్యకర, అశ్లీల కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి(మెట్రో) జితేంద్ర మణి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నివారించేందుకు సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది, డిఎంఆర్‌సితో కలసి పోలీసులు గట్టి నిఘా పెడతారని ఆయన చెప్పారు.
Also Read: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు: తొమ్మిది మంది మృతి