నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను నాలుగు రోజుల కస్టడీ కోరుతూ హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ కొత్తపేటలో సెటిల్‌మెంట్ చేస్తున్న సమయంలో శేషన్నను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నయీంకు చెందిన సెటిల్‌మెంట్లలో శేషన్న ప్రధాన భూమిక పోషించాడని పోలీసులు గుర్తించారు. నయీంకు ఎకె 47 ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. శేషన్న ఆధీనంలోని యాక్షన్ టీంలో ఎందరున్నారు, వారంతా ఎక్కడు న్నారనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఈ విషయాలపై పూర్తి సమాచారం రావాలంటే శేషన్నను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. జైల్లో ఉన్న శేషన్నను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
2016లో ఆగస్టు 16న షాద్‌నగర్‌లో నయీం ఎన్‌కౌంటర్ తర్వాత శేషన్న అదృశ్యమయ్యాడు. నయీం, శేషన్నలు ఇద్దరూ పీపుల్స్‌వార్‌లో పనిచేశారు. వీరిద్దరూ జనజీవన స్రవంతిలో చేరిన తర్వాత ఒకప్పటి పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. శేషన్న అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఐపిఎస్ వ్యాస్, కొనపురి రాములు, పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, శ్రీధర్‌రెడ్డి, కనకాచారి టీచర్, రాములు హత్య కేసులో శేషన్న నిందితుడు. పలు అక్రమ ఆయుధాల కేసులో సైతం శేషన్న నిందితుడిగా ఉన్నాడు. విద్యార్థి దశలోనే నక్సలైట్ ఉద్యమంలో శేషన్న చేరాడు. తాడా కేసులో గతంలో అరెస్టయ్యాడు. గ్యాంగ్‌స్టర్ నయీంతో జైల్లో పరిచయమేర్పడింది. ఆ తర్వాత వరుస హత్యలు, అక్రమాలకు తెగబడ్డాడు. గ్యాంగ్‌స్టర్ నయీంతో కలిసి అనేక నేరాలకు శేషన్న పాల్పడ్డాడు. 15 మంది నక్సల్స్ కమాండర్స్‌తో శేషన్న పనిచేశాడు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులతో శేషన్నకు సన్నిహిత సంబంధాలున్నాయి. మావోయిస్టులకు కొరియర్‌గా, డెన్ కీపర్‌గా శేషన్న పనిచేశాడు. శేషన్నపై పలు కిడ్నాప్, మర్డర్, ల్యాండ్ సెటిల్‌మెంట్ కేసులు ఉన్నాయి. శేషన్న వద్దనుంచి 9ఎంఎం పిస్టల్‌ను పోలీసులు స్వాధీనపర్చుకున్న సంగతి విదితమే.