Wednesday, December 25, 2024

‘అల్లు’పై ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

మూడు గంటలకుపైగా సాగిన పోలీసు విచారణ అనుమతి లేకున్నా థియేటర్‌కు ఎందుకు వచ్చారని నిలదీత మహిళ మృతి చెందిందని పోలీసులు చెప్పినా ఎందుకు వెళ్లి పోలేదని ఆరా
పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వని అల్లు అర్జున్
తండ్రి, మామతో కలిసి వచ్చిన హీరో దర్యాప్తును పర్యవేక్షించిన
డిసిపి అక్షాంశ్ యాదవ్
మన తెలంగాణ/విద్యానగర్/సిటీ బ్యూరో: సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట సంఘటనపై అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు మంగళవారం విచారించారు. ఈ నెల 4వ తేదీన ఆర్‌టిసి ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో పుష్ప2 బెనిఫిట్‌షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు గతంలోనే థియేటర్ యజమానులు, మేనేజర్లు, అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అల్లు అర్జున్ హైకోర్టు నుంచి నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కేసు విచారణలో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు ఆదేశించడంతో మంగళవారం ఆయన న్యాయవాదులతో కలిసి ఎసిపి రమేష్‌కుమార్, ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్ ఎదుట హాజరయ్యారు. దాదాపుగా మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు.

సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ పర్యవేక్షించగా, ఎసిపి రమేష్‌కుమార్, రాజు నాయక్, అల్లు అర్జున్‌ను విచారించారు. ఇద్దరు పోలీస్ అధికారులు అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. చిక్క డ పల్లి స్టేషన్‌కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రేశేఖర్ రెడ్డి, న్యాయవాది అశోక్ రెడ్డితో కలిసి కారులో ఉదయం 11.05నిమిషాలకు వచ్చారు. తండ్రి, మామను స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పోలీసులు ఆపివేశారు. మొదటి అంతస్తులోకి అల్లు అర్జున్‌ను న్యాయవాది సమక్షంలో విచారించారు. డిసెం బర్ 4వ తేదీన బెనిఫిట్ షోకు పోలీసులు అనుమతి ఇవ్వని విషయం తెలియదా, థియేటర్ యజమానులు చెప్పలేదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. పోలీసులు అనుమతి ఇవ్వని విషయం తెలియదా, అనుమతి లేకున్నా థియేటర్‌కు ఎందకు వచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది. మెట్రోస్టేషన్ నుంచి సంధ్య థియేటర్ వరకు కారు రూఫ్‌పై నిల్చుని అభివాదం చేయమని ఎవరు చెప్పారు, ఎన్ని కార్లలో వచ్చారు, ఎంత మంది థియేటర్‌కు వచ్చారని అడినట్లు తెలిసింది. కారు థియేటర్‌లోపలికి వచ్చే సమయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలుసా అడిగినట్లు తెలిసింది. సినిమా చూస్తున్న సమయంలో రేవతి మృతిచెందినది,

ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలుసా, మీ సిబ్బంది చెప్పలేదా, సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్పిందా అని ప్రశ్నించినట్లు తెలిసింది. తాము వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవాలని తాము చెప్పిన విసయం మీ సిబ్బంది చెప్పలేదా అని ప్రశ్నించారు. పోలీసులు వచ్చి చెప్పినా కూడా గంటన్నర పాటు అక్కడే ఎందుకు ఉన్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎక్కువగా అల్లు అర్జున్ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. మరి కొన్ని ప్రశ్నలకు న్యాయవాది బదులిచ్చిన ప్పటికీ వాటినే అల్లు అర్జున్‌ను అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. విచారణ సమయంలో అల్లు అర్జున్‌కు టీ, బిస్కెట్లు ఇచ్చిన తర్వాత 20 నిమిషాలు బ్రేక్ ఇచ్చినట్లు తెలిసింది. తర్వాత సంధ్య థియేటర్‌కు సంబంధించిన వీడియోను చూపించి దాని ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఏకంగా ఎసిపి వచ్చి ఒక మహిళ చని పోయిందని, మీరు థియే టర్ నుంచి వెళ్లి పోవాలని చెప్పినా రేవతి చనిపోయిన విషయం తెల్లవారి తనకు తెలుసని

మీడియా సమయంలో ఎందుకు చెప్పారని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా, మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. అల్లు అర్జున్ భద్రత కోసం వచ్చిన బౌన్సర్లు వారి ప్రవర్తన, వారిని పంపించే ఏజెన్సీ వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుంచి అల్లు అర్జున్ వద్ద పనిచేస్తున్నాడు, అతడు అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నా ఎందుకు వారించలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆంటోని రెండు రోజుల ముందనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు, అతడి నుంచి తెలుసుకున్న వివరాల గురించి అల్లు అర్జున్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఉదయం 11.05 గంటలకు వచ్చిన అల్లు అర్జున్ 2.50 గంటల కు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.

మైత్రీ మూవీ మేకర్స్‌పై కేసు
సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి నిందితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ కేసులో పుష్ప2 సినిమాను నిర్మిం చిన మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యాన్ని ఎ18గా పోలీసులు చేర్చారు. రేవతి మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ ఎ 11 కాగా ఎ1నుంచి ఎ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది నిందితులుగా ఉన్నారు. ఎ12 నుంచి ఎ 17 వరకు అల్లు అర్జున్ వెంట ఉన్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండగా ఎ18 గా నిర్మాణ సంస్థ పేరు చేర్చారు.

బౌన్సర్ ఆంటోని విచారణ
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోగా భావిస్తున్న పోలీసులు అతడిని ముందుగానే విచారించినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే అంటోనిని అదు పు లోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి తెలుసుకున్న సమాచారం ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నిం చారు. అంతే కాకుండా చిక్క డ పల్లి పోలీస్ స్టేషన్ బన్నీ విచారణ కొన సాగుతుండగానే పోలీసులు సంధ్య థియే టర్‌కు ఆంటోనిని తీసుకుని వెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్చన్ చేసినట్లు తెలిసింది. ప్రైవేట్ వాహనంలో ఆంటోనిని తీసుకుని వెళ్లి అక్కడ ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు సంబం ధిం చిన న్యాయ నిపు ణులు ముగ్గురు మంగళ వారం మధ్యాహ్నం సంధ్య థియేటర్ లోకి వెళ్లి తొక్కిసలాట రోజు జరిగిన పరిణామాలను అక్కడి సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు.

మళ్లీ విచారణకు?
తొక్కి సలాటకు సంబంధించిన విచారణ పూర్తి కానట్లు తెలిసింది, అల్లు అర్జున్ మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అవసర మైతే మళ్ళీ నోటీసులు జారీ చేస్తామని, విచారణకు రావాలని పోలీసులు సూచించినట్లు తెలిసింది. మంగళవారం విచారణలో అల్లు అర్జున్ మౌనంగా ఉండడంతో పోలీసులు మరోసారి విచారణకు పిలవనున్నట్లు తెలిసింది. మళ్లీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే సమయంలోనే విచారణకు సహకరించాలని కండిషన్ పెట్టినట్లు తెలిసింది. దానిని ఉల్లంఘించిన అల్లు అర్జున్ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి తన తప్పులేదని, పలు విషయాలు చెప్పాడు. దీంతో పోలీసులు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News