బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు
హైదరాబాద్: బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పబ్ యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని సికింద్రాబాద్, బోయినపల్లి, శాంతినికేతన్ కాలనీకి చెందిన జిఆర్ రామచందర్ ఈ నెల 6వ తేదీన భార్య మీనాక్షి, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని కెమిస్ట్రీ పబ్బుకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కారును వాలెట్ పార్కింగ్ కోసం అక్కడ ఉన్న డ్రైవర్ రాజేష్‌కు కారు కీ ఇచ్చారు. కారులో మీనాక్షికి చెందిన మంగళసూత్రం, రూ.1,000 బ్యాగులో ఉన్నాయి. బ్యాగును వీరు కారులోనే పెట్టి పబ్బులోకి వెళ్లారు. రాత్రి 12.40 గంటలకు పబ్బులో నుంచి బయటికి వచ్చిన తర్వాత నవీన్ అనే డ్రైవర్ వారి కారు పార్కింగ్ నుంచి తీసుకుని వచ్చి అప్పగించాడు. వారు కారును తీసుకుని ప్రశాసన్ నగర్‌లోని స్నేహితుడికి ఇంటికి వెళ్లారు. అక్కడ కారులోని బ్యాగును తనిఖీ చేయగా మంగళసూత్రం, రూ.1,000లు కన్పించకుండా పోయాయి. వెంటనే వెనుకకు వచ్చి పబ్బు యాజమాన్యానికి విషయం చెప్పారు. దీనికి వారు నిర్లక్షంగా సమాధానం చెప్పారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.