రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు అనే వ్యక్తి అటవీ ప్రాంతానికి షికారుకు వెళ్లి పెద్ద బండరాళ్ల మధ్యలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇరుక్కున్నాడు. కొండపై నుంచి స్నేహితునితో కలిసి వెళ్తుండగా సెల్‌ఫోన్ కొండల మధ్యలో పడిపోవడంతో దాన్ని తీసుకునేందుకు ప్రయత్నించి ఆ కొండల సందుల్లో ఇరుక్కుపోయాడు. పరిస్థితిని గమనించి అతనితోపాటు వెళ్లిన స్నేహితుడు రాజును బయటకు తీయడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. దాంతో స్నేహితులతో కలిసి ఆ రోజు రాత్రి వరకూ శ్రమించినా ఫలితం దక్కలేదు.
దాంతో బుధవారం ఉదయం విషయాన్ని రాజు కుటుంబ సభ్యులకు చెప్పి, మధ్యాహ్నం పోలీసులకు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో రెస్కూ టీం సాయంతో పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని బయటకు తీయడానికి ప్రయత్నం చేశారు. బుధవారం రాత్రి వరకూ వారు చేసినా సరైన ఫలితం దక్కలేదు. దాంతో గురువారం ఉదయం నుంచి బండరాళ్ల మధ్య చిక్కుకున్న రాజుతో మాట్లాడుతునే.. ఆయనకు ఓఆర్‌ఎస్ ద్రావణం, గ్లూకోజ్, వాటర్, జ్యూస్‌లు అందిస్తూ సఫర్యాలు చేస్తూ వచ్చారు. ఉదయం నుంచి దశలవారీగా బండరాళ్లను బ్లాస్టింగ్ చేస్తూ జెసిబితో బండరాళ్లను తొలగిస్తూ. చర్యలు చేపట్టారు. ఒక దశలో అతని బంధువుని బండరాళ్ల మధ్యకు పంపి రాజుతో మాట్లాడించే ప్రయత్నమూ చేశారు.
ఇలా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 7 విడతలుగా బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి అతనికి ఎలాంటి హాని జరుగకుండా చర్యలు తీసుకుంటూ.. చివరకు 43 గంటల తరువాత రాజును సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వెంటనే అతని ఆరోగ్య పరిస్థితిని అప్పతికే అక్కడికి చేరుకున్న వైద్యులు పరిశీలించి 108 వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసియూలో చికిత్స చేస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కలెక్టర్, ఎస్పిలతో సహా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా నిర్వహించింది.
కామారెడ్డి జిల్లా ఎస్పి శ్రీనివాస్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. బుధవారం రాత్రి నుంచి జిల్లా అడిషనల్ ఎస్పి అన్యోన్య కొండల వద్దే టెంటు వేసుకొని, అధికారులకు, సిబ్బందిని సమన్వయం చేస్తూ ్త పర్యవేక్షిస్తూ రెస్కూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లా యంత్రాంగ మొత్తం ఘటనా స్థలంలో ఉండి రాజును సురక్షింతగా బయటకు తీసుకురావడంతో గ్రామస్తులు, అధికార యంత్రాంగం, కుటుంబ సభ్యులు ఊపీరి పీల్చుకున్నారు.