ఐఐసిటిలో 17వర్టికల్స్ సెమినార్
సమాజం కోసం పోలీసులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు
రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కమిషనరేట్ 17వర్టికల్స్ సమావేశం తార్నాకలోని ఐఐసిటిలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు సమాజంలో శాంతి కోసం నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. పోలీసు శాఖలో చాలా మార్పులు ప్రవేశపెట్టారని, ప్రజలకు సర్వీస్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇవి సామాన్యులు ఎలాంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్లకు వచ్చేలా చేశాయని తెలిపారు. సమాజానికి అవసరమైన మేరకు పోలీసుల విధుల్లో మార్పులు తీసుకుని వచ్చామని తెలిపారు. దీంతో క్రైం రేటు తగ్గిందని అన్నారు. విధుల పట్ల మంచి ప్రతిభ కనబర్చిన పోలీసులకు అవార్డులు అందజేస్తామని, అవార్డులు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు సహకరిస్తాయని తెలిపారు.
అడిషనల్ డిసిపి సత్యనారాయణ మాట్లాడుతూ పోలీసులు నిరంతరంగ పనిచేయడంతో సమాజంలో శాంతి నెలకొందని అన్నారు. బాధితులకు ముందుగా స్పందించేది పోలీసులేనని, వారికి సాధ్యమైనంత వరకు సాయం చేస్తారని తెలిపారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే త్వరగా న్యాయం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 2015 నుంచి వెర్టికల్స్‌ను ప్రారంభించారని, వీటి వల్ల మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2018 నుంచి అమలు చేశారని తెలిపారు. వర్టికల్స్ వల్ల పోలీసులు వాళ్ల బాధ్యతల నుంచి తప్పించుకోలేరని తెలిపారు. పోలీసులు న్యాయంగా బాధితులకు చేయాల్సిన సాయం చేస్తున్నారని తెలిపారు. పోలీసులు తమ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, డిసిపి రక్షితమూర్తి, డిసిపి సన్‌ప్రీత్ సింగ్, క్రైం డిసిపి యాదగిరి, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.