Friday, December 20, 2024

రాచకొండలో కొత్త సంవత్సర ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకలకు నిబంధనలు పాటించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. – రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్‌ను 31వ తేదీ రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 1గంట వరకు మూసివేయనున్నారు. – ఓఆర్‌ఆర్‌పైకి లైట్ వెహికిల్స్, ప్యాసింజర్ వాహనాలు అనుమతించరు. మీడియం, హెవీ వాహనాలను అనుమతిస్తారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారిని అనుమతిస్తారు. వారు ఫ్లైట్ టికెట్లను చూపించాల్సి ఉంటుంది. కామినేని ఫ్లైఓవర్, ఎల్‌బి నగర్ ఫ్లైఓవర్, చింతకుంట అండర్ పాస్,నాగోల్ ఫ్లై ఓవర్, బైరామాల్‌గూడ ఫ్లైఓవర్, ఎల్‌బి నగర్ అండర్ పాస్, చింతకుంట అండర్‌పాస్ రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు మూసివేయనున్నారు.

డ్రైవర్లు యూనిఫాం ధరించాలి…
క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షాల డ్రైవర్లు, ఆపరేటర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు. క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితులలోను రైడ్ నిరాకరించకూడదు. ఇది మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 ప్రకారం ఉల్లంఘన, ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధించబడుతుంది. ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదు. వాహనదారులు సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

పబ్బులకు సూచనలు…
బార్లు, పబ్బులు, క్లబ్బులు తమ ప్రాంగణంలో మద్యం సేవించిన కస్టమర్లు, అసోసియేట్లను వాహనాలు నడపడానికి అనుమతిస్తే, నేరాన్ని ప్రోత్సహించినందుకు సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలపై తమ కస్టమర్లు, సహచరులకు అవగాహన కల్పించాలి, మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలి. మద్యం తాగిన వ్యక్తులు తమ ప్రాంగణంలో వాహనం నడపకుండా ఆపాలి.

మద్యం తాగి వాహనాలు నడిపితే…
మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం డిడి కేసులు బుక్ చేయబడతాయి, వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టులో హాజరుపరుస్తారు. మొదటి నేరానికి జరిమానా రూ. 10000 లేదా 6 నెలల వరకు జైలు శిక్ష, రెండవ సారి పట్టుబడితే రూ. 15000 మరియు, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే, మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 19 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం వారి డ్రైవింగ్ లైసెన్స్లను స్వాధీనం చేసుకుని సంబంధిత ఆర్‌టిఓలకు పంపబడును.

కెమెరాలతో నిఘా…
‘ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. అటువంటి వారిని కెమెరాల ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుని, వాహన యజమాని, డ్రైవర్ ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చుతారు. వాహనాలలో అధిక-డెసిబెల్ సౌండ్, మ్యూజిక్ సిస్టమ్‌ను ఉపయోగించడం నిషేధించబడింది ఒకవేళ అలా చేస్తే తదుపరి చర్యల కోసం వాహనాలు నిర్బంధించబడతాయి .

నంబరు ప్లేట్లు లేని వాహనాలు నడిపితే, ఆ వాహనాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు, ఈ వాహనాలను కూడా ఆర్‌టిఓ అధికారికి పంపుతారు. వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, వాహనాలపై భాగంలో ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ట్రాఫిక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన శబ్దాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్, మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై కేసులు బుక్ చేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News