Saturday, November 16, 2024

త్యాగ ధనులు, నిత్యస్మరణీయులు

- Advertisement -
- Advertisement -

పోలీసుల త్యాగాలు వృథా పోనీయరాదనే ఉద్దేశంతో 1959 సంవత్సరం అక్టోబర్ 21 నాడు లడఖ్ ప్రాంతంలోని అక్సాయ్‌చిన్ దగ్గర చైనీయుల దాడిలో పది మంది సిఆర్‌పిఎఫ్ పోలీసులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 తేదీ నాడు అమర పోలీసుల స్మారక దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి చోటా పోలీసువారు విధాయకంగా పోలీసు త్యాగధనుల స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పవిత్రంగా పోలీసు వారు ఆనవాయితీగా ఈ నివాళిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నాడు అమర పోలీసులకు సమర్పిస్తున్నారు. కానీ ప్రజల భాగస్వామ్యం అంతగా కనపడటం లేదని అందరూ గమనిస్తున్న విషయమే!
గణాంకాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా సైనికుల కంటే పోలీసువారే ఎక్కువగా దుర్ఘటనలోనో, ఉగ్రవాదుల దాడులలోనో, తీవ్రవాదుల ల్యాండ్ మైన్స్ వల్లనో ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా విస్మయం కలిగించే విషయంగా కొందరు భావిస్తున్నారు. బ్రిటిష్ వారి పాలనలో మన దేశంలోని పోలీసు వ్యవస్థను వారి అవసరాలకు అనుగుణంగా మలుచుకున్నారు. స్వాతంత్య్రం సాధించిన తర్వాత మన ప్రభుత్వాలు అనేక మార్పులు తేగలిగాయి కానీ పోలీసు వ్యవస్థలోని లోపాలను అనేక కారణాల వల్ల, స్వలాభం కోసం తొలిగించ లేదు. పోలీసులు చేయాల్సింది ఏమిటి? 1) నేర పరిశోధన 2) నేర నిరోధన 3) శాంతి భద్రతలను కాపాడటం ముఖ్యమైన విధులుగా వీటిని పేర్కొనవచ్చు! అయితే అప్పటి బ్రిటిష్ పాలనలోని మన పోలీసులు దురుసుగా, క్రూరంగా ప్రజలను అణచివేసే విధానాలతో అప్పటి పాలకుల అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వహించారు.

ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులు! పాలకులు ఆ ప్రజలు ఎన్నుకున్నవారే! అందుకే ప్రజా పోలీసులుగా మారాల్సిన అవసరం వుంది. మొత్తం జనాభాలో చాలా తక్కువ మంది ప్రజలు పోలీసులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. రక్షణ బాధ్యత వహిస్తున్నారు కాబట్టి పోలీసులకు రక్షక భటులు అన్నపేరు వచ్చింది. ఎక్కువ మందికి పోలీసుల అవసరమే వుండదు. జనాభాలో 10% మందితో మాత్రమే వృత్తిపరంగా పోలీసులు వ్యవహరించాల్సిన అవసరం వుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారు, నేరాలు చేసేవారు, మోసాలు చేసేవారు, – హత్యలూ, దారి దోపిడీలకు పాల్పడేవారు అలాంటి వారు మాత్రమే పోలీసుల దృష్టిలో నిరంతరం సమాజ రక్షణ కోసం వుండక తప్పదు. కేవలం 10% అసాంఘిక శక్తులతోనే కఠినంగా పోలీసులు వుండాలి. మిగతా ప్రజలతో స్నేహంగా వుండాలి! ఆ విధంగా ఎందుకు వుండలేకపోతున్నారు?
పాలకుల జోక్యం పోలీసు వ్యవస్థను ఒక్కొక్కప్పుడు నిర్వీర్యం చేస్తున్నది! నిజానికి పోలీసులు చట్టానికి బాధ్యులు! ఆ విధంగా రాజ్యాంగం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అంతమాత్రాన ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకుల మాట వినగూడదని కాదు.

చట్టబద్ధంగా వారు ఇచ్చే ఆదేశాలు క్రమశిక్షణతో పాటించాల్సిందే. పోలీసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట నిజం! 1) సిబ్బంది కొరత. 2) పని గంటలకు పరిమితి లేకపోవటం. 3) పండుగలూ, పబ్బాలూ చేసుకోవాలన్నా తీరిక దొరకకపోవటం! డ్యూటీలు ఆ రోజుల్లోనే ఎక్కువ వుంటాయి! 4) పిల్లల విద్య సమస్యలు 5) ఆరోగ్య సమస్యలు 6) జీతాలు ఈ కాలానికి తగ్గట్లు – ఇతర ఉద్యోగస్థులతో సమానంగా రాకపోవటం. 7) టిఎ, డిఎల కోతలు 8) వీటన్నిటినీ మించి పోలీసు ఉద్యోగ స్థాయిలో సమాజంలో గౌరవం, ఆదరణ పొందలేకపోవడం! ఎన్నో కమిటీలు సంస్కరణలు ప్రతిపాదించాయి కానీ చాలా ప్రతిపాదనలు కాగితాల్లోనే పదిలంగా వుండిపోవటం దురదృష్టకరం! అయినా సరే మన పోలీసులు ప్రపంచ స్థాయిలో అనేక అసౌకర్యాలు వున్నా, విధుల నిర్వహణలో పేరు తెచ్చుకోవడానికి కారణం – వారికి వారి యూనిఫాం మీద వున్న ప్రేమ, గౌరవం! మాట పోగొట్టుకో గూడదన్న మానసిక దృక్పథం!
ఇప్పుడు ప్రజలు కానీ, సమాజం కానీ వారికి ఇవ్వాల్సింది కాసింత మానసిక స్థైర్యం, నైతిక తోడ్పాటుతో పాటు వృత్తికి తగ్గ గౌరవం! పాలకులు చేయాల్సింది చట్టబద్ధంగా వారి పని వారిని చేయనివ్వటం! ముఖ్యమంత్రి డిజిపి ఉద్యోగం చేయకూడదు! మినిష్టర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ స్థాయికి పడిపోగూడదు. పాలకులు ఇవ్వాల్సింది చట్టబద్ధంగా ఆదేశాలు, -ఇవ్వకుండా వుండాల్సింది – చట్ట వ్యతిరేక ఆదేశాలు! నిజానికి పోలీసు యూనిఫాం వున్న పౌరుడు,- పౌరుడు యూనిఫాం లేని పోలీసు! చాలా మంది విజ్ఞులు చెప్తారు కానీ ఆచరణలో ఈ విషయాన్ని పోలీసులు – పౌరులూ,- పాలకులూ అందరూ మర్చిపోతారు.

పోలీసులు అలవర్చుకోవాల్సింది మానవీయత! పోలీసుకాకపోతే ఆ వ్యక్తి ప్రజలలో ఒకడు! పోలీసులు కూడా ప్రజల్లోంచి వచ్చినవారమే అన్న భావనను సదా మనసుల్లో దీపంగా వెలిగించుకున్ననాడు జ్ఞాన జ్యోతి వెదజల్లే కాంతిలో మానవత్వపు పరిమళాన్ని వ్యాపింప చేస్తారు! అధికారంలో వున్నవారు పోలీసులు మా తాబేదార్లు అని అనుకోగూడదు, లేనప్పుడు పోలీసులు అధికారంలో వున్నవారి తొత్తులు అని నిందలు వేయగూడదు. అధికార, ప్రతిపక్షాలు ఏదో ఒక సందర్భంలో పోలీసుల మీద నమ్మకం లేదు అని అన్నవారే! త్యాగధనులుగా పోలీసుల సేవలను కేవలం ఒక్కరోజు గుర్తింపుకే పరిమితం చేయగూడదు. పోలీసులను స్మరిస్తూ ప్రతి రోజూ నివాళులు అర్పించాల్సిన అవసరమూ లేదు. గుర్తించాల్సింది పోలీసుల కఠినమైన బాధ్యతలను! విస్మరించకుండా ఇప్పటికీ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నందుకు, వృత్తి ధర్మంలో ప్రాణాలు కోల్పోయిన వారిని నిత్య మూ స్మరించినా తప్పులేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News