350 గదులను తనిఖీ చేసిన పోలీసులు
మెడికల్ రిపోర్టులో కన్పించని క్లోరోఫాం
నలుగురు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గాంధీ ఆస్పత్రి అత్యాచారం కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాధితురాలు తన భర్తకు కిడ్నీ ఫెయిల్ కావడంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఈ నెల 4వ తేదీన తమకు తెలిసిన ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్ సాయంతో ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీ రోగికి సాయంగా వచ్చిన భార్య, మరదలు 7వ తేదీ నుంచి అతడి వద్దకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే రోగి కుమారుడు ఈ నెల 9వ తేదీన ఆస్పత్రికి రాగా తల్లి, పిన్ని గురించి ఆరాతీశాడు.
వారి ఆచూకీ తెలియదని తండ్రి చెప్పడంతో ఆస్పత్రి మొత్తం వెతికాడు. ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 11వ తేదీన తండ్రిని ఆస్పత్రి నుంచి డిఛార్జ్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్లాడు. తర్వాత రేడియాలజీ డార్క్‌రూమ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ ఆదివారం ఫోన్ చేసి మీ పిన్ని ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో దుస్తులు లేని స్థితిలో పడి ఉందని చెప్పాడు. దీంతో వెంటనే వచ్చిన బాధితురాలి అక్క కుమారుడు ఆమెను తీసుకుని ఇంటికి వెళ్తుండగా బస్సులో తమపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. వెంటనే నగరానికి వచ్చి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నీ రోగి భర్త కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.
పనిచేయని సిసి కెమెరాలు
పోలీసులు గాంధీ ఆస్పత్రిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆస్పత్రిలోని 350 గదులను తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆస్పత్రిలోకి ఎవరినీ రానివ్వలేదు. సిసిటివిల ఫుటేజ్ పరిశీలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, అవి పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు ఇరవై నాలుగు గంటలు కాపలాకాస్తున్నారు.
వైద్య పరీక్షల్లో లేని క్లోరోఫాం
గాంధీ ఆస్పత్రి అత్యాచారం కేసులో బాధితురాలి నుంచి సేకరించిన నమూనాలను పోలీసులు వైద్య పరీక్షల కోసం పంపించారు. మెడికల్ రిపోర్టులో మత్తు ప్రయోగం ఆనవాళ్లు లేనట్లు తెలిసింది. కాని బాధితురాలు తనకు క్లోరోఫాం, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి రక్తం నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇందులో క్లోరోఫాం ఆనవాళ్లు లేనట్లు తెలిసింది. ట్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్‌ను సస్పెండ్ చేసినట్లు డిఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. మహిళలపై అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.