వరుసగా దాడులు చేస్తున్న సైబరాబాద్ పోలీసులు
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫామ్‌హౌస్‌లు
గత కొంత కాలం నుంచి నిఘా పెట్టిన పోలీసులు
హైదరాబాద్: గత కొంత కాలం నుంచి ఫామ్ హౌస్‌లపై సైబరాబాద్ పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన వాటిపై దాడులు చేయడమే కాకుండా కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫామ్‌హౌస్‌ల యజమానులు, వర్కర్లపై కేసులు నమోదు చేయడమేకాకుండా అరెస్టు చేస్తున్నారు. పోలీసులు వరుస దాడులు చేయడంతో వాటిల్లో జరుగుతున్న తతంగం బయటపడుతున్నాయి. చాలామంది నగరంలో వేడుకులు చేసుకునేందుకు వెనుకాడుతున్నారు.
డిజే సౌండ్లు, గంజాయి, డ్రగ్స్, మద్యం తాగేందుకు స్వేచ్ఛ లేదని నగర శివారులోని ఫామ్ హౌస్‌లకు వెళ్తున్నారు. ఇవి నగర శివారులో ఉండడం, పోలీసుల నిఘా తక్కువగా ఉండడంతో చాలామంది వీటిల్లో వేడుకులు చేసుకుంనేదుకు మొగ్గుచూపుతున్నారు. నగరంలో పార్టీ చేసుకోవాలంటే చాలా ఆంక్షలు ఎదురవుతున్నాయి. సౌండ్ పెట్టకూడదు, నిర్ణీత సమయం దాటిన తర్వాత అనుమతించరు, మద్యం తదితరాలపై ఆంక్షలు ఉంటాయి.
వీటి నుంచి తప్పించుకుని ఎంజాయ్ చేయాలంటే ఫామ్‌హౌస్‌లే బెటరని భావిస్తున్నారు పలువురు. దీంతో చాలామంది చాలా రోజుల నుంచి ఫామ్ హౌస్‌లను అద్దెకు తీసుకుని పార్టీలు చేసుకుంటున్నారు. ఇక్కడ పోలీసుల నిఘా తక్కువగా ఉండడంతో పెద్దపెద్ద సౌండ్లు పెట్టుకుని ఎంజాయి చేస్తున్నారు. తెల్లవారు జాము వరకు మద్యం తాగుతున్నా అడిగే వారు లేకపోవడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్కృతి ఎక్కువ కావడంతో గత కొంత కాలం నుంచి ఫామ్‌హౌస్‌లపై సైబరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. వరుసగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫామ్ హౌస్‌లపై దాడులు చేస్తున్నారు.
ముఖ్యంగా వీకెండ్ సమయంలో పోలీసులు దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 31 ఫామ్ హౌస్‌లపై పోలీసులు దాడులు చేసి పెద్ద ఎత్తున మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గతంలో కూడా సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. గత వారం కొత్తురు పరిధిలోని ఫామ్‌హౌస్‌పై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. కేవలం ఫామ్‌హౌస్‌లో పనిచేసే వారిపైనే కాకుండా వాటి యజమానులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
మొయినాబాద్ …
ఫామ్‌హౌస్‌లకు కేరాఫ్‌గా మొయినాబాద్ నిలుస్తోంది. పలువురు ప్రముఖులకు ఇక్కడ ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. అలాగే చాలామంది ఫామ్ హౌస్‌లను ఏర్పాటు చేసి దానిలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఫామ్ హౌస్‌ల్లో మద్యం సరఫరా చేసే అనుమతులు లేకున్నా కూడా చాలామంది నిబంధనలు పాటించడంలేదు. కొన్ని ఫామ్‌హౌస్‌ల్లో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దాడుల్లో బయటపడినట్లు తెలిసింది. వాటిని వ్యాపార సముదాయాలుగా మార్చి మద్యం, హుక్కా తదితరాలను సరఫరా చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అక్రమ సంపాదనకు ఫామ్ హౌస్‌లను వేదికగా చేసుకోవడంతో పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. పోలీసుల దాడులతో ఫామ్‌హౌస్‌ల్లో అక్రమలకు చెక్‌పడుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.