Tuesday, December 24, 2024

అనధికారిక ఫైనాన్స్‌లపై పోలీసు నిఘా

- Advertisement -
- Advertisement -

TS Police to Probe on Finance and Chit Fund firms

 

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం నుంచి ఏలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులు నిఘా సారిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక చిట్‌ఫండ్, ఫైనాన్స్ కంపెనీలపై వివరాలతో కూడిన నివేదిక తయారు చేయాలని రాష్ట్ర పోలీసు బాసులు అన్ని జిల్లాల ఎస్‌పిలకు ఆదేశాలిచ్చారు. అనధికారికంగా వడ్డీ,చిట్టీల వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై మూకుమ్మడి దాడులు నిర్వహించాలని బాధితులు వినతి మేరకు పోలీసు బాసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో పోలీసులు, ఐటి శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించేందుకు సమాయత్తమౌతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వడ్డీ డబ్బుల కోసం జలగల్లా పీడిస్తున్న వడ్డీ వ్యాపారులను కట్టడితో పాటు నిరుపేదల అవసరాలను అవకాశంగా చేసుకుని వడ్డీ వ్యాపారాలను నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరించాలని పోలీసు బాసులు ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వేలకు పైగా అనధికారికంగా ఫైనాన్స్ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పూట వడ్డీలు, వారం, నెలల వారీగా వడ్డీలు నడుపుతూ అవసరానికి అప్పులు చేసిన వారు సకాలంలో వడ్డీలు చెల్లంచని పక్షంలో దౌర్జన్యాలకు పాల్పడుతూ దందా సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో సామాన్యులకు శాపంగా మారిన మైక్రో ఫైనాన్స్ మరో రూపందాల్చి నిరుపేదలను గ్రూపులుగా తయారు చేస్తూ అధిక వడ్డీల దందా యధేశ్చగా సాగుతున్న తతంగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అప్పుదారుల నుంచి ప్రామిసరీ నోట్లు, బాండ్లు. ఆధార్ కార్డులు తీసుకుంటూ గ్రూపుల వారీగా ఫైనాన్స్ ఇవ్వడం వల్ల ఎవరు మొత్తాలు ఎగరేసినా ఆయా మొత్తాలు మిగిలిన సభ్యుల నుంచి ముక్కు పిండి వసూలు చేసే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పోలీసులు దృష్టికి వచ్చింది. అలాగే అధికారికంగా చిట్టీలు నిర్వహిస్తూ రాత్రికి రాత్రి బిచానా ఎత్తేసిన ఘటనల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక చిట్టీలు నిర్వహించే వారిపై పోలీసులు నిఘా అధికం చేశారు. మరి కొందరు చిట్టీల మాటున అనధికారికంగా వడ్డీ వ్యాపారాలు సైతం సాగిస్తున్నారని, చిరు వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని వడ్డీ వ్యాపారులు రోజూవారీగా అధికవడ్డీలను వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

అనధికారిక చిట్టీలపై నజర్:

రాష్ట్రవ్యాప్తంగా చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అనధికారిక చిట్టీలు నిర్వహిస్తున్న వారిపై స్థానిక పోలీసులు నిఘా సారించాలని పోలీసు అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో స్థానిక పోలీసులు తమ స్టేషన్ పరిధిలో అనధికారికంగా చిట్టీలు నిర్వహిస్తున్న వారి వివరాలతో పాటు చిట్టీలు నిర్వహిస్తున్న మొత్తాలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అరుణారెడ్డి, రఘునాథరెడ్డి దంపతులు రూ.10 కోట్ల మేరకు చీటింగ్ చేసిన విషయం విదితమే.

నేరేడ్‌మెట్‌లో గత 25 సంవత్సరాలుగా చిట్టీలు, వడ్డీల వ్యాపారం చేస్తూ చుట్టుపక్కల వారికి నమ్మకం కలిగించారు. దీంతో చాలా మంది వారి దగ్గర చిట్టీలు వేయడంతో పాటు వడ్డీకి డబ్బులు ఇచ్చారు. లావాదేవీలు పెద్ద మొత్తంలోకి చేరుకోవడంతో రాత్రిరాత్రి ఉడాయించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉమా ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి చిట్టీల పేరుతో రూ.2 కోట్ల మేరకు వసూలు చేసి నగదుతో పరారయ్యాడు.

అదేవిధంగా జనగాంలోనూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాదాపు 162 మంది నుంచి చిట్టీల పేరుతో రూ. 6 కోట్లు వసూలు చేసి ఉడాయించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్టీల పేరుతో చీటింగ్ చేసిన ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు బాసుల ఆదేశాల మేరకు పోలీసులు ఆదిశగా విచారణ సాగిస్తున్నారు. అనధికారికంగా చిట్టీలు నిర్వహిస్తున్న వారిపై నిఘా సారించడంతో పాటు వారి వివరాలను సేకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News