Friday, November 22, 2024

కదం తొక్కిన రైతులపై పోలీసుల జలఫిరంగులు

- Advertisement -
- Advertisement -

Police use water cannon on Farmers

బారికేడ్లను దాటుకుని ముందుకు సాగిన రైతులు
ఏడు నెలల ఆందోళనకు గుర్తుగా అధికారులకు మెమోరాండం సమర్పణ

చండీగడ్ : కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు శనివారం కదం తొక్కారు. చండీగర్ మొహాలి సరిహద్దులో బారికేడ్లను ఛేదించుకుని వచ్చిన రైతులపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించి అడ్డుకున్నారు. పంజాబ్‌హర్యానా రాజ్‌భవన్ వరకు నిరసన ప్రదర్శన సాగించి ఏడు నెలల ఆందోళనకు గుర్తుగా శనివారం (జూన్ 25) మెమోరాండం సమర్పించాలని రైతులు అనుకున్నారు. కానీ వీరి ప్రయత్నాలు ముందుకెళ్ల నీయకుండా చండీగఢ్ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తుతో తిష్ఠవేశారు. మొహలి, పంచకుల నుంచి రైతులు రాకుండా చాలా చోట్ల భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినాసరే మొహలి నుంచి ఆందోళన కారులు తరలి వచ్చి బారికేడ్లను తోసుకుంటూ జలఫిరంగులను ఎదుర్కొంటూ చండీగడ్‌లో ప్రవేశించారు. అంతకు ముందు పంజాబ్ లోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తరలి వచ్చి పంజాబ్ గవర్నర్ నివాసానికి వెళ్ల డానికి మొహాలీ లోని గురుద్వారా అంబ్ సాహిబ్ వద్ద సమావేశమయ్యారు. ఇదే విధంగా హర్యానా లోని వివిధ ప్రాంతాల నుంచి ఆందోళన కారులు తరలి వచ్చి హర్యానా లోని హర్యానా లోని పాంచ్‌కుల గురుద్వారా నాడా సాహిబ్ వద్ద సమావేశమయ్యారు. వీరంతా హర్యానా రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లారు.

మొహలి వైపు రైతులకు బల్బీర్ సింగ్ రాజేవాల్ నాయకత్వం వహించగా, హర్యానా వైపు రైతులకు హర్యానా బికెయు నాయకుడు గుర్‌నామ్ సింగ్ చదుని నేతృత్వం వహించారు. వీరందర్నీ సెక్టార్ 17 వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని బస్సులను కూడా రోడ్డుకు అడ్డంగా పెట్టారు. చండీగడ్ డిప్యూటీ కమిషనర్‌కు రాజేవాల్ మెమోరాండం సమర్పించారు. దీన్ని పంజాబ్ గవర్నరకు అందచేయాలని కోరారు. ఇదే విధంగా గుర్‌నామ్ సింగ్ చదుని, యోగేంద్ర యాదవ్ కూడా హర్యానా గవర్నర్‌కు తమ మెమొరాండం సమర్పించాలని కోరుతూ ఒక అధికారికి మెమోరాండం సమర్పించారు. ఆ తరువాత రైతులు తిరుగుముఖం పట్టారు. రైతుల్లో అధిక శాతం మంది మాస్కులు ధరించడం కానీ కొవిడ్ నిబంధనలు పాటించడం కానీ చేయలేదు. రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట వద్ద హింసాత్మక సంఘటనకు బాధ్యుడైన లఖా సిధానా కూడా ఈ ఆందోళన లో పాల్గొన్నారు. హర్యానాకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్‌ఎల్‌ఎ పొంబిర్ సంగవాన్ గురుద్వారా నాడా సాహిబ్ వద్ద రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. ఈ చట్టాలు రైతు సమాజాన్ని నాశనం చేస్తాయని ఆయన ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News