Monday, December 23, 2024

ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30 ఏళ్లకు లీజుకు ఎలా ఇస్తారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పని గట్టుకుని విషం చిమ్మే కొన్ని పత్రికల్లో వచ్చిందే నిజమనుకుంటే ఎలా? అని సీఎల్పీ నేతను కెటిఆర్ నిలదీశారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజుపై తెలంగాణ అ సెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. దివాలా తీసిన ఐఆర్‌బి సంస్థకు ఓఆర్‌ఆర్ నిర్వహణను అతి తక్కువ మొత్తానికి 30ఏళ్లకు కట్టబెట్టారని కాం గ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించగా మంత్రి కెటిఆర్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లోనూ అదే ఐఆర్‌బి సంస్థకు టోల్ వసూలు లీజు ఇచ్చారని కెటిఆర్ చెప్పారు. అక్కడ కూడా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ టోల్ లీజు వ్యవహారంలో అవినీతిని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ విసిరారు.
రేవంత్‌పై పరువు నష్టం దావా వేస్తాం
కాంగ్రెస్ అంటేనే అంధకారం. పిసిసి అధ్యక్షుడు ఏదీ మా ట్లాడినా రూ.వేల కోట్ల కుంభకోణం అంటారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టీఐ కొం దరికి రూట్ టు ఇన్‌కంగా మారిందని కెటిఆర్ తెలిపారు. రేవంత్ మాటలు సంస్కారం ఉన్న నాయకుడి మాటలా? 70 ఏళ్లు ఉండి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కెసిఆర్‌ను ఉరి వేసి రాళ్లతో కొట్టమంటారా? ఐఏఎస్ అధికారులను పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? పరువు నష్టం దావాతో మీ అధ్యక్షుడి అంతు చూస్తాం. ఓఆర్‌ఆర్ లీజు తీసుకున్న ఐఆర్బీ సంస్థ రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర చోట్ల కూడా ఇదే తరహాలో లీజు తీసుకుంది. అక్క డ కూడా కుంభకోణాలు జరిగాయా? ఓఆర్‌ఆర్ యాజమాన్య హక్కులు వదులుకోవడం లేదు. 30 ఏళ్ల తర్వాత భట్టి సిఎంగా ఉంటారేమో?ఓఆర్‌ఆర్ టెండర్ల వ్యవహారంలో తప్పు చేసినట్లు నిరూపిస్తే మళ్లీ ఏ పదవీ తీసుకో ను.రాజకీయసన్యాసంతీసుకుంటాననికెటిఆర్ తెలిపారు.
చాయ్ పే చర్చ కాదు, సిలిండర్, నిత్యావసర ధరలపై చర్చ
దేశంలో ఇప్పుడు చాయ్ పే చర్చ కాదు, సిలిండర్, నిత్యావసర ధరలపై చర్చ జరుగుతోందని మంత్రి కెటిఆర్ ధ్వ జమెత్తారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో తమ కంటే ఉత్తమ పాలన ఉందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనా మా చేస్తానని కెటిఆర్ పేర్కొన్నారు. పొరపాటున కాం గ్రెస్, బిజెపి అధికారంలోకి వస్తే ఒక మాట ఇవ్వాలన్నా, ఒక పని చేయలన్నా, చివరకు బాత్రూంకు పోవాలన్నా, చలో ఢిల్లీ అంటారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిజెపిలు ఢిల్లీ వదిలిన బాణాలని, తమ నాయకుడు కెసిఆర్ ప్రజలు వదిలిన బ్రహ్మాస్త్రమని ఆయన పేర్కొన్నారు.
పదవుల కోసం నీచ రాజకీయాలు చేయం
పదవుల కోసం నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం బిఆర్‌ఎస్‌కు లేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఛాయిస్ ప్రజల ముందు ఉందన్నారు. తాము చెప్పింది తప్పు అయితే శిక్షించండి లేదా ఓడించండని ఆయన విజ్ఞప్తి చేశారు. 2023 మార్చి వరకు పంచాయతీల అన్ని బిల్లులు క్లియర్ అయ్యాయన్నారు. ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా పూర్తిచేసి తీరుతామని, ప్రజాశీర్వాదంతో మళ్లీ కెసిఆర్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పైసలతో భావిభారత నిర్మా ణం జరుగుతుందంటే మనందరికీ గర్వకారణమన్నారు. ప్రజాశీర్వాదంతో అధికారంలో ఉన్నాం, కాదంటే ఇంటికెళ్తాం. నూటికి నూరుశాతం మూడోసారి మేమే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో సంక్షేమం తప్ప సంక్షోభం లేదు
తెలంగాణలో సంక్షేమమే తప్ప సంక్షోభం లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. 9 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక వైపు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మరో వైపు మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. బ డ్జెట్ పెట్టుబడి వ్యయంలో తెలంగాణే ముందుందని, బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం ఛత్తీస్‌ఘడ్‌లో 15 శాతం, రాజస్థాన్‌లో16 శాతం మాత్రమే ఉందని, అదే తెలంగాణలో మాత్రం 26 శాతం పెట్టుబడి వ్యయంగా పెడుతున్నామని కెటిఆర్ తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమ ఖర్చుల లెక్క మాత్రమే
రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమ ఖర్చుల లెక్క మాత్రమేనని కెటిఆర్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌కు బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రజల జీవనరేఖ అని, తెలంగాణ నమూనా అని ఆ యన తెలిపారు. సమగ్ర, సమ్మిళిత అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం దూసుకుపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో తెలంగాణలో పల్లె మురిసిందని, పట్ట ణం మెరిసిందని ఆయన తెలిపారు. పల్లెల్లో హార్వెస్టర్లు, పట్టణంలో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారన్నారు. 9 ఏళ్ల క్రితం రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉండేదని, కాంగ్రెస్ పాలన ఎంత చెత్తగా ఉండేదో ఆనాడే సభలో రేవంత్ రెడ్డి చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు.
భట్టివన్నీ అబద్ధాలే..
నీళ్ల కోసం రోజుకొక ట్యాంకర్ తెచ్చుకుంటున్నామన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలు అవాస్తవమని కెటిఆర్ స్పష్టం చేశారు. 2022 జనవరి నుంచి భట్టి ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదన్నారు. భట్టి ఉంటున్న ఇంట్లో మంచినీటి మీటర్ చెడిపోయిందని, మీటర్ చెడిపోవడం వల్లే రూ. 2.90 లక్షల నీటి బిల్లు చెల్లించాల్సి వచ్చిందని కెటిఆర్ తెలిపారు. మీటర్ పని చేసి ఉంటే భట్టి ఇంటికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేదని, నగరంలో ప్రతి ఒక్కరికీ 20 వేల లీటర్ల వరకు మంచినీరు ఉచితంగా ఇస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.
జగన్, చంద్రబాబుకు ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడికి మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్‌కు అర్థమయ్యిందన్నారు. కానీ, రాష్ట్రంలోని విపక్షాలకు అర్థం కావడం లేదని కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని, భూముల విలువను చంద్రబాబు గుర్తించారని కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఎపిలో 100 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు అన్నారని, తెలంగాణ అభివృద్ధిని ఒప్పుకున్న చంద్రబాబుకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్‌కు రైతులపై ప్రేమ ఉన్నందునే మీటర్లకు ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను ఎపి సిఎం జగన్ కూడా మెచ్చుకున్నారన్నారు. దిశ ఘ టన విషయంలో ఐ సెల్యూట్ టు కెసిఆర్ అని జగన్ కూడా అన్నారన్నారు. తెలంగాణ శాంతి భద్రతలను మెచ్చుకున్న జగన్‌కు కూడా ధన్యవాదాలని, జగన్, చంద్రబాబుకు అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావడంలేదని కెటిఆర్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద ప్రజలకు మంచినీరు అందిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం, మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రిగా కూర్చుంటారని, మీరు అక్కడ ఉంటారో లేదో చూసుకోవాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు నల్లాల ద్వారా అందుతుందని కేం ద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారని కెటిఆర్ గుర్తు చేశారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వచ్చాయన్నారు. 9 ఏళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని, కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో పెట్టిన ఖర్చు రూ. 6 వేల కోట్లు మాత్రమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మానేరు ఒడ్డున ఉన్నవారికి కూడా మంచినీరు అందేది కాదని కెటిఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయని పనులను 6 ఏళ్లలోనే బిఆర్‌ఎస్ చేసింది…
కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయని పనులను 6 ఏళ్లలోనే బిఆర్‌ఎస్ చేసి చూపించిందని కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో 24 వేల ఆవాసాలకు నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్నామని, రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కిలోమీటర్ల పైపులైన్లు వేశామని, నీళ్ల కోసం ఆనాడు నీళ్ల మంత్రి జానారెడ్డి దగ్గరకు వెళితే కన్నీళ్లు పెట్టించారన్నారు. నల్లగొండలో ఫ్లో రెడ్ రక్కసిని రూపుమాపామని కెటిఆర్ తెలిపారు. కాం గ్రెస్ డబ్బా ఇళ్లు కట్టించి ఇచ్చిందని, బిఆర్‌ఎస్ ప్రభు త్వం మాత్రం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇచ్చిందని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమని కెటిఆర్ తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద మరింత మం దికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు.
9 ఏళ్లలో 462 శాతం అధికంగా ఖర్చు చేశాం
కాంగ్రెస్ పరిపాలనలో మున్సిపాలిటీలకు డబ్బులు రాకపోయేదని కెటిఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 2014 నుంచి 23 మధ్య ఒక లక్షా 21 వేల 294 కోట్లు ఖర్చు చేశామని కెటిఆర్ తెలిపారు. 2004 నుంచి 2014 వరకు చూస్తే ఖర్చు చేసింది రూ. 26,211 కోట్లు మాత్రమేనని, కాంగ్రెస్ కంటే 462 శాతం ఎక్కువ ఖర్చు చేశామని కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్రం ఒక మిథ్య అని ఎన్టీఆన్ ఏనాడో చెప్పారని, రాష్ట్రాల సమాహారమే కేంద్రమని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కెటిఆర్ పేర్కొన్నారు.
కంటెంట్ లేని కాంగ్రెస్‌కు, కమిట్‌మెంట్ ఉన్న కెసిఆర్ పోలికా?
కంటెంట్ లేని కాంగ్రెస్‌కు, కమిట్‌మెంట్ ఉన్న కెసిఆర్ పోలికా? అని కెటిఆర్ ప్రశ్నించారు. 1956లో తెలంగాణకు, ఆంధ్రాకు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిన పాపాత్ములు ఎవరు? 1968లో 370 మంది పిల్లలను కాల్చి చంపిందేవరు? 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను ప్రజలు గెలిపించినా వారి ఆశయాలను తుం గలో తొక్కి, కాంగ్రెస్‌లో కలుపుకున్నది వాస్తవం కాదా..? 2004లో మాటిచ్చి 2014 దాకా 1000 మందిని చం పింది వారు కాదా..? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఎవరు? అని కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పాత్రకు తేడా ఏం దంటే బ్రిటిషోళ్ల మీద భారతీయులు కొట్లాడి స్వాతం త్య్రం తెచ్చుకున్నారన్నారు.బ్రిటిషోళ్లు మేం స్వాతంత్య్రం ఇచ్చినం అంటే ఏమన్నా సిగ్గు ఉంటదా? చెప్పేందుకే ఎంత గలీజ్‌గా ఉంటది. అదొక్కటే కాదు నవమాసాలు మోసి ప్రసవించిన తల్లికి ఎంత బాధ ఉంటుందో మాకు అంతే బాధ ఉంటదని, మంత్రసాని పాత్ర పోషించిన వా రే కాంగ్రెసోళ్లు,1000 మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని రేవంత్ అన్నారని కెటిఆర్ తెలిపారు.
మంచి పనులను విపక్షాలు గుర్తించాలి
ప్రభుత్వం చేసిన మంచి పనులను విపక్షాలు గుర్తించాలని కెటిఆర్ సూచించారు. కాంగ్రెస్ బాగా చేసి ఉంటే హైదరాబాద్ ప్రజలు ఎందుకు తిరస్కరించారని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న నగరాన్ని తామంటే తాము నిర్మించామని విపక్షాలు చెప్పుకుంటున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన కొన్ని మంచి పనులను తాము గుర్తించి ప్రశంసించామని కెటిఆర్ తెలిపారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికీ పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే డిఆర్‌ఎఫ్ ఏర్పాటు చేసిందన్నారు. చిన్నచిన్న పట్టణాల్లో కూడా డిఆర్‌ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచామని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో 35 ఫ్లైఓవర్లు నిర్మించాం
ప్రభుత్వం హైదరాబాద్‌లో 35 ఫ్లైఓవర్లు నిర్మించిందని, కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌లో రెండు ఫ్లైఓవర్లు నిర్మించలేకపోయిందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం చేపట్టిన ఉప్పల్, అంబర్‌పేట ఫ్లైఓవర్ల పనులు కొన్నేళ్లుగా ముందుకు సాగడం లేదన్నారు. కేంద్రానికి తెలంగాణ చెల్లించే రూపాయిలో తిరిగి వచ్చేది 40 పైసలు మాత్రమేనని ఆయన తెలిపారు. తెలంగాణ చెల్లించే పన్నులతో యూపీ, గుజరాత్, బీహార్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. పంటలకు నీళ్లు ఇచ్చే బిఆర్‌ఎస్ కావాలా, మత మంటలు లేపే పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే హైదరాబాద్ కు ప్రపంచస్థాయి సంస్థలు వస్తున్నాయన్నారు. రూ.100 కోట్లు పెట్టి ఎకరం భూమి కొనేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News