Tuesday, November 5, 2024

బిజెపి స్వప్రయోజక దాడులు!

- Advertisement -
- Advertisement -

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిబిఐ, ఇడిని దుర్వినియోగం చేయడం అందరికీ తెలిసిందే. 95% పైగా రాజకీయ కేసులు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే నమోదయ్యాయి. అదే సమయంలో బిజెపిలో చేరిన వారిపై కేసులు అటకెక్కాయి. సత్యం, న్యాయం, ధర్మం గురించి గొప్పగొప్ప మాటలు చెప్పే ప్రధాని మోడీ, తనకు సన్నిహితుడైన వ్యాపారవేత్తపై వచ్చిన ఆర్థిక మోసాల ఆరోపణల్ని విస్మరించడం దారుణం. కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు ఎదుర్కొన్నవారు 124 మంది అయితే అందులో 118 విపక్షీయులే ఉన్నా రు. అంటే ఈ రెండు పాలనా కాలంలో ప్రతిపక్ష శాతం 60 నుండి 95కు పెరిగింది.

యుపిఎ ప్రభుత్వం 29 మంది సొంత వారిపై దర్యాప్తుకు ఆదేశిస్తే ఎన్‌డిఎ మాత్రం ఆరుగురు బిజెపి పక్షంవారిపై సిబిఐని పంపింది. సిబిఐ, ఇడి, ఐటి స్థాయి వంటి బలమైన వ్యవస్థలు రాష్ట్రాల చేతుల్లో లేనందు వల్ల కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు లేఖాస్త్రమే మిగిలింది. అయితే ఆ అస్త్రం కొంచెమైనా ప్రధానిని పునరాలోచించుకొనేలా చేస్తుందని అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన చిక్కేమిటంటే దర్యాప్తు సంస్థల కొరడా చేపట్టిన పాలక బిజెపి కేవలం విపక్షాలవారిపై మాత్రమే దానిని ఝుళిపించడమే. దాడులు చేయిస్తామని బెదిరించి ఆయా పార్టీల కీలక నేతలను తమ బుట్టలో వేసుకోవడమే. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం, కులం, భాష, రాజకీయాలకు ముడిపెడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని మారుస్తూ, వారికి నచ్చిన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ, నచ్చని వాటికి మొండి చెయ్యి వివక్ష చూపుతున్నారు.
2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై ఇప్పటికీ వివక్ష చూపుతున్నది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆందోళన కలిగించే సామాజిక సమస్యలను లేవనెత్తకుండా ప్రతిపక్షాలను నిలువరించేందుకు మోడీ ప్రభుత్వం వ్యూహాలు పన్నింది. విభజనలు, ఇతర ముఖ్యమైన సమస్యలతో పాటు అదానీ స్కామ్ గురించిన చర్చను జరగడం లేదు. నిశ్చయాత్మకమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అపూర్వమైన చర్యలను అవలంబించింది. చర్చలను నిరోధించడం, న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు బిజెపి ప్రభుత్వం క్రమబద్ధమైన దాడులు చేస్తోంది. స్వయాన కేంద్ర న్యాయశాఖ మంత్రి కొంత మంది రిటైర్డ్ జడ్జీలను దేశ వ్యతిరేకులని ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించడం దేనికి సంకేతం? ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, వారి అభిరుచులను రెచ్చగొట్టేందుకు, న్యాయమూర్తులను భయపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ భాషను ఎంచుకున్నారు.

ప్రభుత్వ రాజకీయ బెదిరింపులకు, బిజెపి ఆర్థిక బలంతో మీడియా స్వాతంత్య్రం చాలా కాలంగా రాజీపడిందని ఆరోపణ ఉంది? నిశ్శబ్దాన్ని అమలు చేయడం వల్ల దేశ సమస్యలు పరిష్కారం కావని నొక్కి చెప్పారు. చైనాతో ప్రత్యక్ష సరిహద్దు సమస్యను ప్రస్తావిస్తూ చైనా చొరబాట్లను ప్రధాని తిరస్కరించడం, పార్లమెంటులో చర్చను ప్రభుత్వం అడ్డుకోవడం, విదేశీ వ్యవహారాల మంత్రి పరాజయ వైఖరిని అవలంబించడం మోడీ సర్కార్ అసమర్థతను చెప్పకనే చెబుతోందని! ఈ మధ్య రాజకీయ నేతలపై సిబిఐ, ఇడి దాడులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఈ దాడులు పెరగడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే బిజెపి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా వాడుకొంటుందని, కావాలనే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు చేయిస్తోందని ఇదివరకే విపక్ష నాయకులు ఆరోపించారు. అయితే ఈ విషయం పై 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఇడి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ వేసిన వాటిలో కాంగ్రెస్, డిఎంకె, ఆర్‌జెడి, బిఆర్‌ఎస్, టిఎంసి, ఆప్, ఎన్‌సిపి, శివసేన ఉద్ధవ్, జెఎంఎం, జెడియు, సిపిఐ, సిపిఎం, ఎస్‌పి పార్టీలు వున్నాయి. సిబిఐ సోదాలు లేదా ఇడి దాడులు గత కొన్ని నెలలుగా బిజెపియేతర రాష్ట్రాలలో మాత్రమే నిర్వహించబడ్డాయి, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అవినీతికి సంబంధించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చినప్పటికీ అలాంటి దాడులు ఏవీ కొనసాగలేదు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా, కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వార్థ, రాజకీయ ప్రయోజనాలతో దుర్వినియోగం చేయడంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో బిజెపి నాయకులు లేదా వారి

కుటుంబ సభ్యులపై ఎన్ని సిబిఐ లేదా ఇడి దాడులు జరిగాయని ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారు. బిజెపి నేతలందరూ రాజా సత్యహరిశ్చంద్రకు దగ్గరి బంధువులేనా అన్న ఆలోచన వస్తున్నది. కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం విద్యా శాఖలో అవినీతి ఆరోపణలతో చిక్కుకుంది, నాయకులు 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్ల సంఘాలు ఆరోపించాయి, ధ్రువీకరణ పత్రాల పునరుద్ధరణ విషయంలో స్కూల్ మేనేజ్‌మెంట్ సంఘాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. వివిధ సెక్షన్ల ద్వారా ఈ ఛార్జీలు విధించబడుతున్నప్పటికీ, కర్ణాటకలో ఒక్క సిబిఐ లేదా ఇడి దాడులు నిర్వహించలేదు. ఎందుకు అంటే ఇక్కడ బిజెపి ప్రభుత్వం కొనసాగుతుంది.
పంజాబ్‌లో జనవరి నెలలో సిఆర్‌పిఎఫ్ సహాయంతో 40 గోడౌన్లలో సిబిఐ దాడులు నిర్వహించింది. నిల్వల నాణ్యతను నిర్ధారించేందుకు గోధుమలు, బియ్యం నమూనాలను సేకరించారు. న్యూఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతిచ్చిన కమీషన్ ఏజెంట్లకు చెందిన గోడౌన్‌లు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా దాడులు నిర్వహించారన్నారు. మహారాష్ట్ర, ముంబైలోని బార్ యజమానుల నుంచి పోలీసు శాఖ రూ. 100 కోట్లు వసూలు చేయాలని అప్పటి హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కోరినట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరబ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి డిసిపి రాజు భుగ్‌పాల్, ఎసిపి సంజయ్ పాటిల్ సహా 12 చోట్ల సిబిఐ దాడులు నిర్వహించింది. చత్తీస్‌గఢ్‌లో జూలై నెలలో రాయ్‌పూర్, దుర్గ్, ఇతర జిల్లాల్లోని నగలు, వస్త్ర వ్యాపారుల ప్రాంగణాలపై ఇడి దాడులు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ఇడి,

సిబిఐ, ఐటిలు చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లపై దృష్టి సారిస్తాయని ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ చెప్పారు. గత 8 ఏళ్లలో బిజెపి నేతల కార్యాలయాల్లో ఇడి, సిబిఐ లేదా ఐటి ఎన్ని సోదాలు నిర్వహించాయని కూడా ఆయన ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ లో పశువుల స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కోల్‌కతా, బీర్భూమ్ జిల్లాలో జూలై, ఆగస్టులలో పలుచోట్ల దాడులు జరిగాయి. స్థానిక టిఎంసి నేత అబ్దుల్ కరీంఖాన్ స్థలాలపై సోదాలు జరిగాయి. ఆ తర్వాత, అనుబ్రత మండోల్ – టిఎంసీల బీర్భూమ్ జిల్లా అధినేత కుమార్తె సుకన్య మండోల్ యాజమాన్యంలోని రైస్ మిల్లులో సోదాలు జరిగాయి. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించి మాజీ ఎస్‌ఎస్‌సి చైర్మన్, ప్రస్తుత నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబీరేష్ భట్టాచార్యపై దాడి జరిగింది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సిఫారసు చేయడంతో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంతో పాటు మరో 20 చోట్ల సిబిఐ దాడులు చేసింది.

ఇక బిజెపి విషయానికొస్తే ప్రత్యర్థులపై ఇడి, సిబిఐ దాడుల పరంపర దేశవ్యాప్తంగా ఉన్న బిజెపియేతర ప్రభుత్వాలపై వరుసగా కొనసాగుతోంది. అలాగే తమను విమర్శించే వార్త సంస్థలపై కూడా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ విడుదల చేసిన వెంటనే బిబిసి వార్త సంస్థకు చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీ చేపట్టింది. రాజకీయ నాయకులపై ఎలాంటి కేసులు కోర్టులో ఉన్నా, ఎన్ని దర్యాప్తులు జరిగినా నిజాలు బయటపడి ఊచలు లెక్కపెట్టే సందర్భాలు అరుదు. అయితే ఈ దాడులు, దర్యాప్తుల వార్తలు రాజకీయ మనుగడను దెబ్బ కొడుతాయనే భయమే నేతల్లో ఎక్కువ. దాడులు నిర్వహించేవారి ఉద్దేశం కూడా అదే. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఆయుధాల కొనుగోలులో అవకతవకలను అరికట్టేందుకు 1941లో ఏర్పడ్డ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) రూపురేఖలు క్రమంగా మారి ఇప్పుడు కేవలం పాలకపక్ష రాజకీయ ప్రయోజనాలకు సేవికగా మారడం చారిత్రక విషాదం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News