Thursday, January 23, 2025

సిజెఐపై విమర్శలు: రాజకీయ విశ్లేషకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

చెన్నై: మణిపూర్ హింసాకాండను అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకోని పక్షంలో తాము జోక్యం చేసుకోవలసి వస్తుందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చేసిన ప్రకటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ప్రముఖ ప్రచురణకర్త, రాజకీయ విశ్లేషకుడు బద్రీ శేషాద్రిని తమిళనాడు పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

తమిళనాడులోని ప్రముఖ ప్రచురణ సంస్థలలో ఒకటైన కిళక్కు పత్తపగం వ్యవస్థాపకుడైన 58 ఏళ్ల శేషాద్రి తమిళ టెలివిజన్, యుట్యూబ్ చానళ్లలో తరచు కనిపిస్తుంటారు. శనివారం ఉదయం మైలాపూర్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు పెరంబలూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. న్యాయవాది కవియరసు చేసిన ఫిర్యాదుపై పెరంబలూరు పోలీసు స్టేషన్‌లో శేషాద్రిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

బిజెపికి వీరాభిమాని అయిన శేషాద్రి పై ఐపిసిలోని 153ఎ, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ చానల్ ఆదాన్ తమిళ్‌కు ఇచ్చిన ఇంటర్వూలో శేషాద్రి మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తీవ్రంగా విమర్శించారు. చంద్రచూడ్‌కు ఒక తుపాకీ ఇచ్చి మణిపూర్ పంపిద్దాం. ఆయన శాంతిని పునరుద్ధరిస్తామో చూద్దాం అంటూ శేషాద్రి ఆ ఇంటర్వూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా..శేషాద్రి అరెస్టును బిజెపి ఖండించింది. తమిళనాడులో వాక్ స్వాతంత్య్రాన్ని డిఎంకె ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నిస్తోందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై ఒక ట్వీట్‌లో ఆరోపించారు. రాజకీయ వ్యాఖ్యాత సుమంత్ రామన్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ రామచంద్రన్ కూడా శేషాద్రి అరెస్టును ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News