కర్నాటక మాజీమంత్రి రమేశ్‌జర్కిహోలీ
బెంగళూర్: ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఆశచూపి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక మాజీమంత్రి, బిజెపి ఎంఎల్‌ఎ రమేశ్‌జర్కిహోలీ.. అదంతా తనపై రాజకీయ కుట్రలో భాగమని అన్నారు. నాలుగు నెలల నుంచే తనపై కుట్ర జరుగుతోందన్నారు. తనపై సిడి గురించి తన సోదరుడు బాలచంద్ర ముందే తెలిపారని రమేశ్ అన్నారు. తనపై సిడి విడుదల చేయడానికి 26 గంటలముందే తన శ్రేయోభిలాషుల నుంచి కూడా దాన్ని గురించి తెలిసిందన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ పార్టీ అధిష్ఠానం సూచించినా, తానింకా ఆ పని చేయలేదని రమేశ్ తెలిపారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తనపై కుట్రలో భాగంగా దానిని సృష్టించారని రమేశ్ అన్నారు. తనపై ఆరోపణల నేపథ్యంలో మార్చి 3న మంత్రిపదవికి రాజీనామా చేసిన రమేశ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు.
తనను మంత్రి పదవి నుంచి వైదొలగాలని ఎవరూ కోరలేదని, తనకు తానే రాజీనామా చేశానని ఆయన తెలిపారు. పోయిన తన కుటుంబ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడమే తన ప్రధాన కర్తవ్యమని రమేశ్ అన్నారు. బెంగళూరులోని రెండు చోట్ల తనపై కుట్ర జరిగిందన్నారు. తనపై కుట్రకు పాల్పడింది ఎంతటివారైనా జైలుకు పంపేవరకు వెనకడుగు వేయబోనని రమేశ్ హెచ్చరించారు. ఈ కేసును సిఐడికి అప్పగించాలని జర్కిహోలీ సోదరులు ముఖ్యమంత్రి యడియూరప్పను కోరారు.