Monday, December 23, 2024

మానుకోటలో వీరులెవరో?

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మహబూబాబాద్‌లో 12 మంది, డోర్నకల్‌లో 14 మంది అభ్యర్థులు తుది బరిలో నిలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల రంగంలో మిగిలిన అభ్యర్థుల్లో ప్రధానంగా అధికార బిఆర్‌ఎస్, ప్రధా న ప్రతిపక్షమైన కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల మధ్యే తీవ్రంగా పోటీ నెలకొందని చెప్పవచ్చు. వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగుతున్న సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా గత ఎన్నికల్లో గెలిచిన తాజా మాజీలైన మహబూబాబాద్ నుంచి బానోత్ శంకర్‌నాయక్, డోర్నకల్ నుంచి ధరంసోతు రెడ్యానాయక్‌లను ఈసారి కూడా ఆ పార్టీ మళ్లీ రంగంలోకి దింపింది.

రెడ్యానాయక్ ఏడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతుండగా, మహబూబాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన బానోత్ శంకర్ నాయక్ హ్యాట్రిక్ కొడతాననే ధీమాతో బరిలో నిలిచారు. బిజెపి నుంచి మానుకోటలో గత ఎన్నికల్లో బరిలో నిలిచిన జాటోతు హుస్సేన్ నాయక్ ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా డాక్టర్ భూక్య మురళీ నాయక్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలిచి పోరాడుతున్నారు. డోర్నకల్‌లో కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలైన డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్‌నే తిరిగి ఆ పార్టీ బరిలో నిలిపింది. అక్కడ బిజెపి నుంచి నర్సింహులపేట జడ్పీటీసీగా గెలిపొందిన భూక్య సంగీతను ఈ సారి రంగంలో దింపి ంది. ఇతర పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా మానుకోట నుంచి 9 మంది, డోర్నకల్ 11 మంది ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోనున్నారు.

బిఆర్‌ఎస్ అభ్యర్థులు ఇరువురు బలమైన వారే…
జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో అధికార బిఆర్‌ఎస్ నుంచి తిరిగి బరిలో నిలిచిన అభ్యర్థులు బానోత్ శంకర్ నాయక్, డి.ఎస్.రెడ్యానాయక్‌లు బలమైన అభ్యర్థులుగానే పరిగణించాల్సి వస్తోంది. వారిని ఢీకొట్టడం అన్ని విధాలుగా కాంగ్రెస్, బిజెపిలు చమటోడ్చాల్సిన పరిస్థితే. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు వారిరువురు నిత్యం తమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారనే ప్రచారానికి తోడు అందరితో కలసిమెలసి ప్రజల కష్టసుఖాల్లో తోడుంటారని భావిస్తుంటారు.
ఏడోసారి బరిలో రెడ్యానాయక్…
వరుసగా ఏడో సారి అసెంబ్లీకి తలపడుతున్న రెడ్యానాయక్ ఈ సారి కూడా గెలిచి రికార్డు సృష్టించేందుకు తన రాజకీయానుభవంతో ఎత్తుగడలు వేయడంతో పాటు కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధ్ది సంక్షేమ కార్యక్రమాలు తన గెలుపునకు సోపానాలుగా లాభిస్తాయని భావిస్తున్నారు. అంతేకాక డోర్నకల్ నియోజకవర్గానికే చెందిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి కూడా రెడ్యా గెలుపు కోసం తోడ్పాటు అందించం కూడా లాభిస్తుందని రెడ్యా భావిస్తున్నారు. అంతే కాకండా ఎంపీగా, బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న రెడ్యా కూతురు మాలోతు కవిత తన తండ్రి గెలుపుకోసం ప్రచార బాద్యతల్ని భూజాన వేసుకోవడం కూడా కలిసివస్తోందని ఆయన గంపెడాశతో ఉన్నారు.

బలమైన పోటీకి సై అంటున్న బిజెపి అభ్యర్థులు…
బిజెపి అభ్యర్థులు కూడా రెండు నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీని ఇవ్వనున్నారు. మహబూబాబాద్ అభ్యర్థి జాటోతు హుస్సేన్ నాయక్ 2018 ఎన్నికల్లోనూ అసెంబ్లీకి,పార్లమెంట్ స్థానాలకు బిజెపి తరుపున తలపడి భంగపడ్డారు. అయినప్పటికీ పార్టీనే నమ్ముకుని రాజకీయాలు నెరపుతూ వస్తున్న ఆయనకే ఈసారి అసెంబ్లీ టిక్‌ట్ ఇచ్చి బరిలో నిలిపింది. ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా నియోజకవర్గంలో గత రెండు నెలలుకు పైగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతన్నారు. స్థానికుడినైన తనకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిచూడండి అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అలాగే డోర్నకల్ నుంచి నర్సింహులపేట జడ్పీటీసీ భూక్య సంగీత ఏడాది క్రితం బిజెపిలో చేరి ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై బరిలో నిలిచారు. ఆమె చురుకైన నాయకురాలిగా పరిచయం ఉన్న ఆమె తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థినిగా సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రెడ్యానాయక్‌ను ఢీకొంటున్నారు.

సునాయాసంగా గెలుస్తామనే కాంగ్రెస్ ధీమా…
ఇక మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గాలికి తోడు ప్రభత్వ వ్యతిరేక ఓట్లు తమ గెలుపునకు సోపనాలుగా నిలుస్తాయని ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన డాక్టర్లు ధీమాగా ఉన్నారు. మహబూబాబాద్ నుంచి డాక్టర్ భూక్య మురళీనాయక్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలిచారు. బలమైన కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు, క్యాడర్ కలుగడవంతోపాటు కొత్తగా చేరిన వారితో ఆ పార్టీ కొంత ఊపుతోనే ఉంది. అలాగే డోర్నకల్ అభ్యర్థి డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ వరుసగా రెండో సారి రెడ్యానాయక్‌తో తలపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయనకే ఈసారి పార్టీలో ఇదే తరహా బలమైన ఇరువురు నేతలను కాదని ఆయన పార్టీటికెట్‌ను ఈ సారి కూడా దక్కించుకుని రెండోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News