Monday, December 23, 2024

‘మహా’ సంక్షోభం

- Advertisement -
- Advertisement -

22మంది ఎంఎల్‌ఎలతో శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు

షిండేకు సిఎం ఉద్ధవ్ ఫోన్..
బిజెపితో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఏక్‌నాథ్ షరతు
కుదరదని చెప్పేసిన ఉద్దవ్ థాక్రే
శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే తొలగింపు
అధికారం కోసం ద్రోహం చేయను : ఏక్‌నాథ్ ట్వీట్
ఎంఎల్‌ఎలను హోటల్‌కు తరలించిన శివసేన
అసోంకు రెబెల్ శాసనసభ్యులు
నేడు రాష్ట్ర కేబినేట్ భేటీ
మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి
అది శివసేన అంతర్గత
వ్యవహారం : పవార్

ముంబై/సూరత్: మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నా థ్ షిండే 22 మంది శాసనసభ్యులను వెంటబెట్టుకుని గుజరాత్‌లో తిష్ట వేశా రు. సూరత్ నగరంలోని మెరీడియన్ హోటల్‌లో క్యాంప్ ఏ ర్పాటు చేశారు. వీ రిలో ఐదుగురు మంత్రులు కూడా ఉన్న ట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంలో అలజడి మొదలైంది. మంత్రి ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు పల్ఘర్ ఎంఎల్‌ఎ శ్రీనివాస్ వంగా, అలీగర్ ఎంఎల్‌ఎ మ హేంద్ర డల్వీ, భీవండి రూరల్ ఎంఎల్‌ఎ శాంతారామ్‌తోపాటు పలువురు శాసనసభ్యుల ఫోన్లు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఇదిలావుండగా బిజెపి వర్గాల సమాచారం ప్రకారం శివసేనకు చెందిన 22 మంది ఎంఎల్‌ఎలతో 5 మంది స్వతంత్ర శాసనసభ్యులు కూడా వారి వెంట ఉన్నారని చెబుతున్నారు. అ యితే రెబెల్ నాయకుడు ఏక్‌నాథ్ షిం డేను బుజ్జగించేందుకు శివసేన హైకమాండ్ రంగంలోకి దిగింది.

ఇద్దరు ఎంఎల్‌ఎలను సూరత్‌కు పంపించింది. హోటల్ క్యాంప్‌లో ఉన్న ఏక్‌నాథ్‌తో సిఎం ఉద్ధవ్ ఫోన్‌లో 10 నిమిషాలపాటు మాట్లాడారు. శివసేన తిరిగి బిజెపితో కూటమి ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో పాలన సాగించాలని షిండే పట్టుబట్టినట్లు సమాచారం. అలాగైతే పార్టీలో చీలిక ఉండదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీనికి ఉద్ధవ్ నిరాకరించినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. బిజెపితో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పుకునే పరిస్థితి లేదని, కాంగ్రెస్, ఎన్‌సిపిలతోనే కలిసి వెళతామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బుధవారంనాడు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఎంఎల్‌ఎలు అందరినీ ముందు జాగ్రత్త చర్యగా ఉద్ధవ్ తన నివాసం నుంచి ముంబైలోని ఓ హోటల్‌కు తరలించారు. ఇదిలావుంటే రెబెల్ ఎంఎల్‌ఎలను సూరత్ నుంచి అసోం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ క్యాంపు ఏర్పాటు చేశారు.

అంతకుముందు ఎన్‌సిపి నేత, డిప్యూటీ సిఎం అజిత్ పవారతో కూడా ఉద్ధవ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మరోవైపు ఈ వ్యవహారంపై మాజీ శివసేన నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె స్పందించారు.. మైనారిటీలో పడిపోయిన ఉద్ధవ్ సర్కార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా మహారాష్ట్ర ఎంఎల్‌సి ఎన్నికల్లో అధికార మహాకూటమి, విపక్ష బిజెపి చెరో 5 సీట్లు గెలుచుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. బిజెపి పోటీ చేసిన 5 చోట్లా విజయం సాధించింది. కాగా కాంగ్రెస్ నేత, దళిత నాయకుడు చంద్రకాంత్ హండోర్ ఓటమి పాలవ్వడం అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. మరోవైపు బిజెపి నేత, మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగింపు…

మంత్రి ఏక్‌నాథ్ షిండేపై శివసేన చర్యలు చేపట్టింది. శాసనసభాపక్ష నేత పదవి నుంచి ఏక్‌నాథ్ షిండేను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరి నియమించింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారం కోసం ద్రోహం చేయను : ఏక్‌నాథ్ ట్వీట్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మంత్రి ఏక్‌నాథ్ షిండే తొలిసారి స్పందించారు. తాను బాల్‌థాక్రే ప్రియ శిష్యుడిని అని, అధికారం కోసం పార్టీకి ద్రోహం చేయబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ‘మేం బాలాసాహెబ్‌కు నిబద్ధత కలిగిన శివసైనికులం. ఆయనే మాకు హిందుత్వ పాఠాలు బోధించారు. అధికారం కోసం మేం మోసం చేయం. బాలాసాహెబ్ ఆలోచనలు, ధర్మవీర్ ఆనంద్ దిఘే సాహెబ్ పాఠాలను మరిచిపోం’ అని మరాఠీలో ట్వీట్ చేశారు.

ఆ ఇద్దరి జోక్యం వల్లే అసంతృప్తి

మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన ఎక్‌నాథ్ షిండే శివసేన పార్టీలో అగ్ర నాయకుడు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు అత్యంత విశ్వాసపాత్రుడు. మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వం ఏర్పడడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఒకదశలో ఎంవిఎ ప్రభుత్వానికి ఆయనే నాయకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎన్‌సిపి అధినేత షిండే ముఖ్యమంత్రిత్వాన్ని వ్యతిరేకించడంతో ఉద్దవ్ థాక్రే పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో ఎంవిఎ ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిత్వ బాధ్యతలను ఏక్‌నాథ్‌కు అప్పగించారు. మంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపిగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు.

అయితే షిండేను గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో సిఎం ఉద్దవ్ ఠాక్రే, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల కూడా షిండే కొంత అసంతృప్తికి కారణమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగుసార్లు (2004, 2009, 2014, 2019) ఎన్నికయ్యారు. 2014లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. థానే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండే.. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ నమ్మకం చొరగొన్న నేతగా గుర్తింపు పొందాడు.

అది శివసేన అంతర్గత వ్యవహారం : పవార్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఈ సమస్యను శివసేన అంతర్గత విషయంగా అభివర్ణించారు. ఎంవిఎ ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొంటారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై విశ్వాసం ఉందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించేందుకు జరుగుతున్న మూడో ప్రయత్నమిది అని అన్నారు. ఇది కూడా ఫలించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే బిజెపితో జట్టుకట్టే ప్రసక్తే లేదన్నారు.

ఇవీ బలాబలాలు..

– మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288.శివసేనకు చెందిన ముంబయి ఎంఎల్‌ఎ రమేశ్ లట్కే మృతి చెందడంతో ప్రస్తుతం సభలో 287 మంది సభ్యులున్నారు.
మహా వికాస్ అఘాడీ సభ్యులు (శివసేన 55, ఎన్‌సిపి 53, కాంగ్రెస్ 44), ఇతర చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 169మంది ఉన్నారు. బిజెపికి 106 మంది, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల ఎంఎల్‌ఎలు కలిపి మొత్తం 114 మంది ఉన్నారు.
అయితే ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల శాసనసభ్యులు ఎప్పుడు ఎవరివైపు ఉంటారో అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దాదాపుగా ఎవరు అధికారంలో ఉంటే వారు ఆ పక్షం వైపు నిలబడుతున్నారు. రాజకీయ బేరసారాల్లో పావులుగా మారుతున్నారు. ఇటీవల ఎంఎల్‌సి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల్లో అది నిరూపితమైంది.

22మంది రాజీనామా చేస్తే…?

ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనకు చెందిన తిరుగుబాటు ఎంఎల్‌ఎలు(22) అందరూ రాజీనామా చేస్తే శివసేన బలం 33కు పడిపోతుంది. ఎన్‌సిపి, కాంగ్రెస్ సభ్యులు కలిపినా ఆ బలం 130కి పడిపోతుంది. బిజెపి, మిత్రుల బలం 114కు పరిమితం అవుతుంది. 22మంది రాజీనామా చేస్తే సభలో సంఖ్య 265కు పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వం విశ్వాస పరీక్షకు కావాల్సిన సభ్యుల సంఖ్య 133. అయితే శివసేన వర్గాలు మాత్రం ఏక్‌నాథ్ షిండేతో 17 నుంచి 18మంది మాత్రమే ఉన్నారని, 22మంది లేరని పేర్కొంటున్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News