మల్కాజిగిరి: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చి, కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. కాని, మల్కాజిగిరిలో రాజకీయ కక్షలు ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా బిఆర్‌ఎస్ కార్పొరేటర్లుకు, నాయకులకు వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్ నియోజకవర్గంలో కలం కలం రేపుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధుల నడుమ పోటీ తీవ్రంగా జరిగింది. ఎవరికి వారు తామే గెలుస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. కాని, ఎన్నికల ఫలితాలు కొందరికి భిన్నంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో మల్కాజిగిరి బిఆర్‌ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్‌రెడ్డి 49,479 ఓట్ల భారీ మెజారిటితో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు దక్కించుకోగా నగర, శివారులలో మాత్రం బిఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించింది.
హమ్మయ్య.. ఫలితాలు వచ్చాయి. ఎన్నికలు సందడి ప్రశాంతంగా ముగిసిందని అందరూ సంతోషపడ్డారు. కాని, గత కొద్ది రోజులుగా బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు, ముఖ్య నాయకులకు బెదిరింపు కాల్స్ అధికంగా వస్తుండటంతో మల్కాజిగిరిలో రాజకీయ మంటలు రేపుతోంది. మా అన్ననే ఓడిస్తారా..రా.. మీ అంతు చూస్తాం అంటూ కార్పొరేటర్లకు , మాజీ కార్పొరేటర్లుకు, నాయకులు ఎన్నికల ఫలితాల అనంతరం ఫోన్‌లు వస్తున్నాయి. గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునితయాదవ్ భర్త మేకల రాముయాదవ్, నేరేడ్‌మెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా భర్త ఉపేందర్‌రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ శాంతి భర్త శ్రీనివాస్‌రెడ్డి , జవహర్‌నగర్ కార్పొరేటర్ ఏకె మురుగేష్, మౌలాలి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముంతాజ్ ఫాతిమా భర్త అమీనుద్ధీన్, మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్.జగదీష్‌గౌడ్‌లకు వరుసగా గత మూడు రోజుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ కాల్స్ అన్నీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫోన్ నుండి రావడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే స్ధానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిని కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. టెక్నాలజీని ఉపయోగించి ఓడిపోయిన అభ్యర్ధి అనుచరులు, ఇలా బెదిరింపు కాల్స్ చేస్తున్నారని తెలిపారు. దీనికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, బాధితులు మేకల రాము యాదవ్, కొత్తపల్లి ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఏకె మురుగేష్, అమీనుద్ధీన్, ఎన్.జగదీష్‌గౌడ్‌లతో కలిసి శుక్రవారం రాచకొండ పోలీసు కమిషనర్ డిఎస్ చౌహన్‌కు ఫిర్యాదు చేశారు.
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
ఈ బెదిరింపు కాల్స్‌పై విచారణ చేపట్టి, దోషులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే, బాధితులతో కలిసి రాచకొండ సీపీ డిఎస్ చౌహన్‌కు లిఖిత ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటువంటి బెదిరింపులకు భయ పడే వారు ఎవరూ లేరని, బాధితులకు తాను అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు తమ పార్టీకి చెందిన వారు 10 మందికి పైగా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని, ముఖ్యంగా బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వారి భర్తలు, నాయకులకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఇది హేయమైమన చర్యగా ఆయన అభివర్ణించారు. నిందుతులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తాము సీపీని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.