Thursday, January 23, 2025

మల్కాజిగిరిలో ఉత్కంఠత

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: టికెట్ల ఎంపిక తంతులో రాష్ట్ర వ్యాప్తంగా వార్తలలో కెక్కిన మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక ఈసారి ఉత్కంఠ భరితంగా మారింది. బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు, బిజెపి అభ్యర్ధిగా ఎన్.రాంచందర్‌రావు ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు బిఆర్‌ఎస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చినప్పటికి , తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వలేదన్న అక్కసుతో ఆ పార్టీని వీడి, కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి సవాల్ విసిరారు. దీంతో బిఆర్‌ఎస్ అధిష్ఠానం మైనంపల్లికి ధీటుగా మంత్రి చేమకూర మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని పార్టీ అభ్యర్ధిగా ఖరారు చేసింది. దీంతో ఇన్నాళ్లు మైనంపల్లిపై తీవ్ర అసంతృప్తితో ఉండి, రాజకీయాలకు దూరంగా ఉంటున్న నాయకులు, కార్యకర్తలు సైతం ఒక్కసారిగా బయటకు వచ్చి మర్రి రాజశేఖర్‌రెడ్డికి బహిరంగంగా తమ మద్దతు ప్రకటించారు. మైనంపల్లి వెంట ఎవరూ వెళ్లకుండా మర్రి చక్రం తిప్పారు. మల్కాజిగిరికి పార్టీ ద్వితీయ శ్రేణి, ముఖ్య నాయకులు మర్రికి మద్దతు ఇవ్వడంతో బిఆర్‌ఎస్ పార్టీ క్యాడర్ బయటకు పోకుండా అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైనారనే చెప్పాలి.

దీంతో నాటి నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డి అందరిని కలుపుకుని పోతూ సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం హయాంలో మల్కాజిగిరిలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలే తన ప్రచార అస్త్రాలుగా మరింత ఉత్సాహంగా తన ప్రచారాన్ని కొనసాగించారు. ఆయనకు మద్దతుగా బిఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, కార్మిక శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డిలు సైతం రెండుసార్లు మల్కాజిగిరిలో పర్యటించి, పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం ప్రచార హోరెత్తించడంతో విజయంపై బిఆర్‌ఎస్ పూర్తి ధీమాగా ఉంది. కాని, స్ధానికేతరుడు కావడం బిఆర్‌ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్‌రెడ్డికి ప్రధాన బలహీనతగా మారింది. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓడి పోయిన తరువాత ఆయన మల్కాజిగిరికి రాక పోవడం, మంత్రి మల్లారెడ్డి సైతం మల్కాజిగిరి మొఖం చూపక పోవడం, మల్కాజిగిరికి ఆయన స్ధానికేతరుడు కావడంతో బిఆర్‌ఎస్‌కు విజయానికి అడ్డు కట్ట పడింది. బిఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీకి చెందిన 4 కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ అంతా సమష్టిగా మర్రి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిలిచి ఆయనతో కలిసి ప్రచారం చేస్తుండటంతో కొండంత బలంగా మారింది. ఇక, కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి హన్మంతరావుకు అధికారికంగా టికెట్ ఖరారైన తరువాతనే, ఆయన తనదైన శైలిలో ప్రచారంలో దూకుడు పెంచారు.

మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, గత మూడు దశాబ్ధాలుగా మల్కాజిగిరి,అల్వాల్ సర్కిళ్ల ప్రజలకు ఆయన, నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడు కావడంతో చిన్న పిల్లవాడి నుంచి పండు ముదసలి వరకు మైనంపల్లి అంటే తెలియని వారండరేమో. ఆయన అందరికి సుపరిచితుడు కావడంతో తొలి నాళ్లలో ఎన్నికల్లో ప్రచారం మంద కొడిగా సాగింది. ఆయన మల్కాజిగిరి నియోకవర్గం కన్నా, మెదక్‌లో తన కుమారుడి మైనంపల్లి రోహిత్ ప్రచారంపైనే ఫోకస్ పెట్టారు. మైనంపల్లి మెదక్ పర్యటనలో ఉంటే, ఆయన సతీమణి మైనంపల్లి వాణి హన్మంతరావు మల్కాజిగిరి నియోజకవర్గంలో పలు డివిజన్‌లలో తన ప్రచారాన్ని కొనసాగించారు. మైనంపల్లికి మద్దతునిచ్చిన ఇద్దరు కార్పొరేటర్లు, తన అనుచరులతో పాటు కాంగ్రెస్ శ్రేణుల అండతో మైనంపల్లి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బిజేపి అభ్యర్ధిగా పాత కాపు రాంచందర్‌రావునే మరో మారు ఆ పార్టీ మల్కాజిగిరి ఎన్నికల బరిలో నిలిపింది. ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధుల కన్నా కొద్దిగా ఆలస్యంగా బిజెపి తన అభ్యర్థిని ప్రకటించడంతో ప్రచారంలో ఆయన కొంత వెనుకంజలో ఉన్నారు. అయితే, స్థ్ధానికులందరికీ ఆయన సుపరిచితుడు కావడం, గత అసెంబ్లీ ఎన్నికలలో కన్నా భిన్నంగా ఈసారి బిజెకి కలిసి వచ్చే అవకాశం ఉంది.

ఆ పార్టీకి మల్కాజిగిరి సర్కిల్‌లోనే ముగ్గురు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండటం, సుక్షితులైన పార్టీ క్యాడర్ బిజెపికి ఉండటం, గతంలో పలుమార్లు ఓటమి పాలు కావడంతో పాటు ధనబలం బరిలోకి దిగిన ప్రధాన పార్టీలను చిత్తుగా ఓడించి మల్కాజిగిరి ప్రజలను తనను ఈసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని రాంచందర్‌రావు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తొలినాళ్లలో ప్రచారంలో ముందంజలో బిఆర్‌ఎస్ అభ్యర్ధి దూసుకుపోగా, తరువాయి కాంగ్రెస్ తన ప్రచారంలో రెండోస్థానం ఉంది. దీంతో పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఏర్పడిందన్న వ్యాఖ్యలు మల్కాజిగిరిలో వినపడ్డాయి. చివరాఖరున వచ్చినా, ప్రధాన పార్టీలకు ధీటుగా బిజేపి అభ్యర్ధి తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా 10 రోజలు గడవు ఉండటంతో ప్రచారం సరళి మారి, ప్రధాన పార్టీలు అభ్యర్థులు పుంజుకునే అవకాశం మరింతగా ఉంది. ఈసారి ఏపార్టీ అభ్యర్ధి గెలిచినా, స్వల్ప మెజారిటీతోనే బయట పడతారని, భారీ మెజారిటీలు వచ్చే అవకాశం లేదని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News