Wednesday, January 22, 2025

ముషీరాబాద్‌లో ముక్కోణం

- Advertisement -
- Advertisement -

(కె.శివప్రసాద్/మన తెలంగాణ)
రాజకీయ చైతన్యానికి పేరు గాంచిన ముషీరాబాద్ నియోజక వర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటివరకు ఇక్కడ కాం గ్రెస్ పార్టీ 8 సార్లువిజయం సాధించగా, జనతా పార్టీ 2 సార్లు, బీజేపి 2 సార్లు, బిఆర్‌ఎస్ 2 సార్లు గెలుపొందాయి. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి ముఠా గోపాల్‌కు 72, 919 ఓట్లు రాగా 36, 888 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ కు 36031 ఓట్లు, బిజెపి అభ్యర్ధి డాక్టర్ కె. లక్ష్మన్‌కు 30769 ఓట్లు వచ్చాయి. ఒకవైపున టాంక్ బండ్, మరో వైపు ఉస్మానియా యూనివర్శిటీ లు సరిహద్దులుగా మధ్యలో ఉన్న ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి గెలిచిన టి. అంజయ్య ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగా, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ముషీరాబాద్ నుంచి గెలుపొందిన నాయిని నర్సింహారెడ్డి మొట్ట మొదటి హోం శాఖ మంత్రి గా పని చేసారు.

ప్రస్తుతం నియో జకవర్గంలో 30, 1788 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 155108 మంది పురుషులు, కాగా 146607 మంది మహిళా ఓటర్లు, మరో 13 మంది ఇతరులు ఉన్నారు. సీనియర్ సిటిజన్ల సంఖ్య 6780 ఉండగా కొత్తగా ఓటు హక్కు పొందిన వారు 4568 మంది, దివ్యాంగులు 1659 మంది వరకు ఉన్నారు. గతంలో 274 పోలింగ్ స్టేషన్లు ఉన్నప్పటికి ఓటర్ల సంఖ్య పెరగడంలో ఈ సారి మరో 15 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. నియోజకవర్గంలో కవాడిగూడ, బోలక్ పూర్, గాంధీనగర్, ముషీరాబాద్, రాంనగర్, అడిక్ మెట్ పేర్లతో ఆరు మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. జి హెచ్ ఎం సి ఎన్నికల్లో బోలక్ పూర్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్ధి కార్పొరేటర్‌గా గెలుపొందగా మిగిలిన ఐదు డివిజన్లను బిజెపి అభ్యర్థులు దక్కించుకున్నారు. ఐతే బిజెపి నుంచి గెలుపొందిన అడిక్మెట్ డివిజన్ కార్పొరేటర్ ప్రస్తుతం అధికార బి ఆర్ ఎస్ లోకి వచ్చారు.

బరిలో 31 మంది అభ్యర్థులు…
ముషీరాబాద్ ఆసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 31 మంది అభ్యర్థులు ఉన్నప్పటికి ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్‌ల మధ్యనే ఉండనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బిఆర్‌ఎస్ నుంచి మరోసారి తన ఆదృష్టాన్ని పరీక్షించు కుంటుండగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, బీజేపి నుంచి పూస రాజు పోటీలో ఉన్నారు. పార్టీలకు ఉన్న బలమైన ఓటు బ్యాంకు తో పాటు వ్యక్తిగతంగా నియోజక వర్గంలో ఉన్న సామజిక సమీకరణాల కారణంగా వీరి ముగ్గురి నడుమ తీవ్ర పోటీ నెలకొంది. ఐతే సిపిఎం అభ్యర్థి దశరథ్, బిఎస్‌పి ఏనుగు గుర్తుతో పోటీ చేస్తున్న నరేందర్‌లు ప్రధాన పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉన్నందున గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ గా మారింది. పాజిటివ్ ఓట్ల పైనే ముఠా గోపాల్ ఎక్కువగా ఆధారపడితే ప్రభుత్వ వ్యతిరేక, సంప్రదాయ ఓట్లు గెలిపిస్తాయన్న ధీమాలో అంజన్ కుమార్, పూసరాజు ఉన్నారు.

మహిళలతోనే విజయం…
ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 945 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రతిసారి మహిళల ఓట్లే ఎక్కువగా నమోదు కావడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో మహిళల ఓట్లు ఎవరికి భారీగా పడితే వారికే విజయం సొంతమవు తుంది. ఈ నేపథ్యంలోనే మహిళల ఓట్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. మొత్తం 14.6607 మహిళా ఓట్లు ఉండగా 60 శాతానికి మించి వీరి ఓట్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కీలకంగా మైనారిటీలు…
ముస్లిం మైనారిటిల ఓట్లు సైతం ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపును నిర్దేశించాయి. ముస్లింల ఓట్లను గంపగుత్తగా దక్కించుకున్న వారికే గెలుపు ఖాయమని చెప్పవచ్చు. ఒకవేళ మైనారిటిలలో చీలిక వస్తే ఆవకాశాలు తారుమారవుతాయి. అందుకోసమే మైనారిటీల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తుంటే వారి మద్దతు కోసం బి ఆర్ ఎస్ భారీగా కసరత్తు చేస్తోంది. మైనారిటీల్లో చీలిక వస్తే తమదే విజయమని బిజెపి ధీమాగా ఉంది. ఇక దళితుల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వీరి మద్దతు కూడగట్టినవారికి గెలుపు సులువు ఆవుతుంది. పద్మశాలీలు, గంగ పుత్రులు, బ్రాహ్మణుల ఓట్లు అభ్యర్థుల విజయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నందున ఈ వర్గాల మద్దతు కోసం తెరచాటు మంత్రాంగాలు కొనసాగుతున్నాయి. కులం, వర్గమేదైనా సరే వాటిల్లో నుంచి ఎక్కువ ఓట్లు తమ ఖాతాలో వేసుకోవడానికి బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజెపిలు తమదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News