సచిన్ పైలట్‌కు సిఎం పదవిస్తే ఒప్పుకోం
గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మంది
ఎంఎల్‌ఎల రాజీనామా హెచ్చరిక
సిఎల్‌పి భేటీకి ముందు కీలక పరిణామాలు
నా చేతుల్లో ఏమీ లేదు : అశోక్ గెహ్లాట్
జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఆదివారం భారీ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్‌నే కొనసాగించాలని లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని 90 మందికి కాంగ్రెస్ ఎ మ్మెల్యేలు హెచ్చరించారు. వీరిని గెహ్లోట్ టీంగా వ్యవహరిస్తున్నా రు. ఒక వ్యక్తి ఒకే పదవి నిర్థిష్టాల నడుమ ఇప్పుడు రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముసలం తలెత్తింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ పోటీకి దిగితే ముందుగా ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగాలని రాహుల్ గాంధీ స్పష్టం చేయడం, సిఎం పదవిలో తన సన్నిహితుడు సచిన్ పైలెట్‌ను కూర్చోబెట్టేందుకు సంకేతాలు ఇవ్వడంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో పరిస్థితి భగ్గుమంది. అశోక్ గెహ్లోట్ సిఎంగా ఉండాల్సిందేనని లేకపోతే రాజీనామాకు సిద్ధం అని చెప్పిన ఆయన వర్గీయులు ఇప్పుడు ఆదివారం రాత్రి స్పీకర్‌ను కలుసుకుని రాజీనామాలు సమర్పించేందుకు బయలుదేరి వెళ్లారు.
ఈ విధంగా సామూహిక రాజీనామాలకు దిగితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది. గెహ్లోట్‌నే సిఎంగా ఉంచాలని కోరుతూ కాంగ్రెస్‌లోని అత్యధిక ఎమ్మెల్యేలు అంతకు ముందు స్పష్టం చేశారు. తన కీలక రాజకీయ ప్రత్యర్థి సచిన్ పైలెట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ సిఎం పీఠం దక్కకుండా చూడాలని గెహ్లోట్ చూసుకుంటున్నారు. అయితే అధ్యక్ష పదవి దక్కితే సిఎం పీఠం కొనసాగింపు ప్రశ్నను రాహుల్ లేవనెత్తినట్లు తెలిసింది. తాను సిఎం పదవిలో లేకపోవడం జరిగితే తన విధేయులకు ఈ స్థానం కల్పించాల్సి ఉంటుందని గెహ్లోట్ స్పష్టం చేస్తున్నారు. అయితే గెహ్లోట్ పదవి నుంచి వైదొలిగితే ఈ స్థానం సచిన్‌కు అప్పగించి తన చిరకాలపు స్నేహధర్మం పాటించాలని రాహుల్ భావిస్తూ వస్తున్నారు.
ప్రస్తుత ఇరకాటం దశలో పార్టీ ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో రాజీనామాలకు సిద్ధం కావడం పార్టీలో సంక్షోభానికి చివరికి కాంగ్రె స్‌లో చిచ్చుకు దారితీసింది. గెహ్లోట్ స్థానంలో కొత్త నేత ఎన్నికకు పార్టీ అధిష్టానం తరఫున జైపూర్‌కు వచ్చిన కేంద్ర పార్టీ పరిశీలకులు మల్లిఖార్జున ఖర్గే, రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జి అజయ్ మకెన్ నిర్ణీత సమయం సాయంత్రం ఏడుగంటలకు సమావేశాన్ని నిర్వహించలేకపొయ్యారు. మరో వైపు రోజంతా జైసల్మెర్‌లో గడిపిన గెహ్లోట్ సాయంత్రం తరువాత జైపూర్‌కు చేరారు. ఖర్గే, మకెన్‌లను స్థానిక ఫైవ్‌స్టార్ హోటల్‌లో కలిశారు.
ఆ తరువాత సచిన్ పైలెట్‌ను కలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ తనకు అధిష్టానంపై అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ అధ్యక్షురాలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ తరువాతనే పార్టీ ఎమ్మెల్యేలు గెహ్లోట్‌కు మద్దతుగా రాజీనామాకు సిద్ధం కావడంతో పరిస్థితి మారింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సచిన్ పైలెట్ విశేషప్రచారం కారణం అని, గెహ్లోట్ ఆ ఫలం అనుభవిస్తున్నాడని, సచిన్‌కు సిఎం పదవి ఇవ్వాలని రాహుల్ భావించడం ఇందుకు గెహ్లోట్ వంటి సీనియర్ నేత నుంచి సహకారం ఉండాలని చెప్పడం ఇప్పటి రాజకీయ పరాకాష్టకు దారితీసింది.
నా చేతుల్లో ఏమీ లేదు వారి ఇష్టం : గెహ్లోట్
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల బెదిరింపులపై ఢిల్లీ నుంచి పార్టీ నేతలు గెహ్లోట్‌కు రాత్రి ఫోన్ చేశారు. అయితే వారి రాజీనామాల అంశంపై తానేమీ చేయలేనని, తన చేతుల్లో ఏమీ లేదని నేతలకు గెహ్లోట్ చెప్పినట్లు తెలిసింది. వారి ఇష్టానుసారం వ్యవహరించుకునే వీలుంది. అంతా వారి ఇష్టం అని ఫోన్‌లో తెలిపారు.