Monday, December 23, 2024

రాజేంద్రనగర్‌లో ద్విముఖ పోటీనే!

- Advertisement -
- Advertisement -

(పి.సూర్యనారాయణ/మన తెలంగాణ)
అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన మన రాజధానికి దక్షిణ ముఖ ద్వారం రాజేంద్రనగర్. ఇక్కడే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. పదుల సంఖ్యలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన కేంద్రాలు,కళాశాలలు , రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థలు, పంచాయితీరాజ్ శిక్షణ కేంద్రం, రైతాంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంగా ఉన్నతస్థానానికి చేరిన తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ అమ్ములపొదిలోనే ఉన్నాయి. ఇక దేశానికి ఐపిఎస్ అధికారులను అందించే నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు, రాష్ట్ర ప్రజలకు శాంతిభద్రతల సేవలందించే తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ దాదాపు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కొలువై ఉన్నాయి.

ఆరు లక్షలకు చేరువలో ఓటర్లు…
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో దాదాపు ఆరు లక్ష మందికి చేరువలోకి ఓటర్లు చేరుకున్నారని చెప్పాలి. నవంబర్ 30 జరిగే ఎన్నికల పోలింగ్‌కు 581937 మంది ఓటర్లు అర్హులుగా అధికార లెక్కలు చెబుతున్నాయి. మొత్తం ఓటర్లలో 302995 మంది పురుష ఓటర్లు ఉండగా, 278898 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇక ఇతరులు 44 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం కావలసిన పొలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు సిద్ధ్దం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్, గండిపేట్, శంషాబాద్ మండలాలతో కూడిన బౌగోళిక ప్రాంతం నుంచి కొత్తగా ఏర్పడింది రాజేంద్రనగర్ నియోజకవర్గం. రంగారెడ్డి జిల్లాలోని రాజకీయాలకు, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం ఓటర్లు 2009లో, 2014లో టిడిపికి పట్టం కట్టారు. 2018లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టిఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఇచ్చారు. కానీ నియోజకవర్గం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్నికల్లో అభ్యర్థిని మాత్రం ఒక్కరినే గెలిపించడం విశేషం.

ఆ అభ్యర్థియే ప్రస్తుత బిఆర్‌ఎస్ రాజేంద్రనగర్ అభ్యర్థి టి. ప్రకాష్‌గౌడ్. తొలి ఎన్నికలో సుమారు ఏడున్నర వేల మెజారిటీ సాధించగా, రెండవ ఎన్నికలో దాదాపు 26 వేల మెజారిటీని ప్రకాష్‌గౌడ్‌కు ఇక్కడి ప్రజలు ఇచ్చారు. ఇక 2018లో టిఆర్‌ఎస్‌లోచేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్‌గౌడ్‌నే నియోజకవర్గం ప్రజలు మరో మారు 58 వేల పైచిలుకు భారీ మెజారిటీతో ఎన్నుకోవడం విశేషం. రాష్ట్రంలో ఏపార్టీ గాలి వీచినా రాజేంద్రనగర్‌లో మాత్రం ప్రకాష్‌గౌడ్ గాలే కొనసాగుతుందని ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు నిరూపించాయి.దానికి తోడు నియోజకవర్గంలోని శంషాబాద్ మండలంలోని కొన్ని గ్రామాలు మినహా మిగతా ప్రాంతం మునిసిపాలిటీగా ఏర్పడి అధికార పార్టీకి చైర్మన్‌తో పాటు మెజారిటీ సంఖ్యలో కౌన్సిలర్లు ఎన్నుకోవడానికి స్థానిక ఓటర్లు మొగ్గు చూపారు. గండిపేట మండలంలోని బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ గా అవతరించగా, మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు అత్యధిక కార్పొరేటర్ స్థానాలు బిఆర్‌ఎస్ ఇక్కడ దక్కించుకుని పాలన కొనసాగిస్తుంది.

గండిపేట మండలంలోని నార్సింగి మునిసిపాలిటీ అధికార పార్టీదే పై చేయి కాగా, మణికొండ మునిసిపాలిటీ కుర్చీని మాత్రం కాంగ్రెస్ వశం చేసుకుంది.ఆ మునిసిపాలిటీ చైర్మన్ కస్తూరి నరేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.ఇక ఒక సారి టిఆర్‌ఎస్, రెండవ సారి బిజేపి పార్టీ నుంచి మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌గా గెలిచిన తోకల శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా గట్టిపోటీనిస్తున్నారు. మిత్రపక్ష మజ్లిస్ పార్టీ మాత్రం ఆపార్టీ కార్వాన్ కార్పొరేటర్ స్వామి యాదవ్‌ను పోటీలోకి దింపింది.

సర్కిల్ ప్రాంతంలో ఎదురుగాలి ఈసారి ఎవరికో..
నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు రాజేంద్రనగర్ జిహెచ్‌ఎంసి సర్కిల్ పరిధిలోనే ఉన్నారు. ఇక్కడి ప్రజల తీర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిపై స్పష్టంగా ఉంటుంది. మొత్తం 5 డివిజన్లు ఉండగా , గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బిఆర్‌ఎస్ రెండవ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే సులేమాన్‌నగర్, శాస్త్రీపురం డివిజన్లు మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించారు అక్కడి ఓటర్లు. ఇక మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్‌లను ఉనికి సరిగా లేని బీజేపీ ఊహించని విధంగా సొంతం చేసుకుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ గాలులు వీస్తున్నా రాజేంద్రనగర్‌లో మాత్రం ఆ జోష్ కనిపించడంలోదు. కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గం అయినా అభ్యర్థి ఎంపిక విషయంలోనో లేక సదరు అభ్యర్థి ప్రచారం దూకుడు పెంచకపోవడంతోనో, బిఆర్‌ఎస్‌కు మిత్ర పక్షమైన మజ్లిస్ స్థానికేతర, ముస్లిమేతర అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఆయా పార్టీ అభ్యర్థులు పెద్దగా పోటీనివ్వకపోవచ్చనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News