Wednesday, January 22, 2025

సిరిసిల్ల నిర్ణేతలు మగువలు

- Advertisement -
- Advertisement -

(కరుణాల భద్రాచలం/సిరిసిల్ల ప్రతినిధి)
రాష్ట్రప్రజల దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల నియోజక వర్గంలో బహుముఖ పోటీ సాగుతోంది. ఎన్నికల బరిలో సిరిసిల్లలో 21 మంది అభ్యర్థులున్నా ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, బిఎస్‌పి మధ్యనే సాగుతోంది. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,44,426 మంది ఓటర్లుండగా అందులో పురుషులు 1,19,663 మంది కాగా మహిళలు 1,24,756 మంది, ఏడుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 14 మంది, సర్వీస్ ఓటర్లు 103 మంది ఉన్నారు. సిరిసిల్లలో బహుముఖ పోటీ ఉన్నా ప్రధానంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, బిఎస్‌పి (నలుగురు) అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. నియోజక వర్గంలో పురుషులకన్నా 5,093 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నేపద్యంలో సిరిసిల్ల అభ్యర్థుల తలరాతలు రాసేది మహిళా ఓటర్లే అనేది సుస్ఫష్టం. మహిళా ఓటర్ల ఆశీర్వాదం ఎవరికి లభిస్తే వారే సిరిసిల్లలో శాసన సభ్యులవుతారనేది వాస్తవం. సిరిసిల్లలో నాలుగుసార్లు శాసనసభ్యునిగా వరుసగా గెలిచి మంత్రి అయిన

కెటిఆర్ ఐదో సారి బరిలో నిలిచి తన గెలుపు ఖాయమని విశ్వాసంతో ఉన్నారు. సిరిసిల్లలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా మంత్రి వర్గం లో స్థానం దక్కడం ఖాయమని ప్రజలు చెప్పుకుంటున్నారు. సిరిసిల్ల నియోజక వర్గలో తాను చేసిన అభివృధ్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కెటిఆర్ భావిస్తున్నారు. సిరిసిల్లను అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన రీతిలో అభివృధ్ధి పర్చిన తనను సిరిసిల్ల ప్రాంత ప్రజలు దూరం చేసుకుంటారని,కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటారని తాను భావించడం లేదని బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలకు క్యాడర్ లేదని, ప్రజలు బిఆర్‌ఎస్ పక్షానే ఉన్నారని ఆయన గాఢం గా విశ్వసిస్తున్నారు. సిరిసిల్లలో ఎంత అభివృధ్ధి చేసినా ఎన్ని సమస్యలు పరిష్కరించినా ప్రజలు నేరుగా తనను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకోవాలని కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో వారానికి రెండు రోజులు సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నానని మంత్రి కెటిఆర్ హమీ ఇచ్చారు. సిరిసిల్ల ప్రాంతంలో గతం లో ఎవరూ చేయలేని అభివృధ్ధి పనులు తన హయాంలో జరిగాయని, సిరిసిల్లను జిల్లా చేశామని,

జిల్లా కలెక్టర్ సహా అనేక ముఖ్య అధికారుల కార్యాలయాలు నిర్మించుకున్నామని, సిరిసిల్లకు మెడికల్ కళాశాల, జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాల ఇలా అనేక అభివృధ్ధి పనులు సాధించుకున్నామని,వైద్య సదుపాయాలు మెరుగు చేసుకున్నామని కెటిఆర్ తన ప్రచారంలో ప్రకటిస్తున్నారు. బిజెపికి, కాంగ్రెస్‌కు క్యాడరే లేదని,పలువురు బిజెపి, కాంగ్రెస్ నేతలు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ప్రజలు కాంగ్రెస్,బిజెపి వాళ్లను నమ్మే స్థితిలో లేరని అంటున్నారు. బిఆర్‌ఎస్ రాష్ట్రంలో హట్రిక్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని బల్లగుద్ది ప్రకటిస్తున్నారు. బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో బాధ్యత పెరిగినందువల్ల రాష్ట్రమంతా తిరగాల్సి వస్తుందని సిరిసిల్లలో పూర్తి స్థాయి ప్రచారం సాగించలేక పోతున్నానని అందుకే కార్యకర్తలే తనకు పూర్తి స్థాయిలో ప్రచారం సాగించాలని ఆయన కోరుతున్నారు. బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను గడపగడపకు అందేలా చేయాలని అందులోని విషయాలు ప్రజలకు వివరించి, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు తెలుసుకుంటే వాటిపి పరిష్కరిస్తామంటున్నారు.

ఎవరు ఊహించని విధంగా సిరిసిల్లలో జరుగుతున్న అభివృధ్ధి చూసి వేరే ప్రాంతాల వారు అసూయ పడేలా చేశామంటున్నారు. బిఆర్‌ఎస్‌కు ఓటు వేయక పోవడానికి అసలు కారణమే లేదంటున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఫలానవారికి ఫలాన పని చేయలేదని వేలెత్తి చూపించే పరిస్థితి లేదంటున్నారు. మంత్రి కెటిఆర్ గెలుపు కోసం ఇప్పటికే సిఎం కెసిఆర్ ఒక సారి ప్రచారం సాగించి వెళ్లారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు నిరంతరం తమ ప్రచారం సాగిస్తున్నారు.

నాలుగోసారి బరిలో కాంగ్రెస్ అభ్యర్థి…
కాగా కాంగ్రెస్ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డి ఇప్పటికే మూడు పర్యాయాలు కెటిఆర్ చేతిలో పరాజయం పాలై మరో సారి కాంగ్రెస్ టికెట్‌పై బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిరిసిల్ల నియోజక వర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకోసం ఇప్పటికే తీన్మార్ మల్లన్న, పలువురు ఏఐసిసి నాయకులు ప్రచారం సాగించి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కొంత అనుకూల వాతావరణం ఉందని విశ్వసిస్తున్న కాంగ్రెస్ నాయకులు సిరిసిల్లలో తమ గెలుపు కూడా ఖాయమని ప్రచారం సాగిస్తున్నారు.

బిజెపి అభ్యర్థి ఒంటరి పోరాటం…
సిరిసిల్లలో బిజేపి అభ్యర్థిగా రాణి రుద్రమ రెడ్డి పోటీ చేస్తూ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఆమె పక్షాన ఇప్పటికే బండి సంజయ్ ప్రచారం సాగించారు. స్ధానికులకు టికెట్ కేటాయించలేదనే సాకుతో అనేక మంది బిజెపి నాయకులు పార్టీని వీడటంతో ఆమె రెక్కలు తెగిన పక్షిలా ఒంటరైనా మనో ధైర్యం కోల్పోకుండా ఉన్న పార్టీ క్యాడర్‌తోనే గ్రామగ్రామాన ప్రచారం సాగిస్తున్నారు. సిరిసిల్లకు బరిలో నిలిచిన ఇతర అభ్యర్థులు టెక్స్‌టైల్ క్లస్టర్ తెస్తానని బాండ్ పేపర్‌ను రాసివ్వడం గమనార్హం.
ఇకపోతే బిఎస్‌పి అభ్యర్థి పిట్టల భూమేష్ గతంలో వేములవాడలో బిఎస్‌పి అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలై ఈ పర్యాయం సిరిసిల్ల బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇప్పటికే సిరిసిల్లలో ప్రచారం సాగించి వెళ్లారు. బిజెపి టికెట్ నిరాకరిండంతో లగిశెట్టి శ్రీనివాస్ రెబల్‌గా మారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి పద్మశాలి సామాజిక ఓట్లు తనకు పడతాయనే అభిప్రాయంతో ఉన్నారు.

పద్మశాలి సామాజిక వర్గానికే చెందిన పత్తిపాక సురేష్ ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో నిలిచి తనదైన రీతిలో ప్రచారంలో ఉన్నారు. పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నా వారు నామమాత్రంగా కూడా ప్రధాన అభ్యర్థులకు ధీటుగా ప్రచారం సాగించడం లేదు. సిరిసిల్లలో మహిళా ఓట్లే కీలకంగా మారడంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్,బిజేపి, బిఎస్‌పిలు మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు తమకే వేస్తారనే ధీమాను కనపరుస్తున్నారు. సిరిసిల్లలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా మంత్రి వర్గంలో స్థానం దక్కడం ఖాయమని ప్రజలు చెప్పుకుంటున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి కెటిఆర్ స్వయంగా వివిధ కారణాల వల్ల ప్రజలు కొంత గులుగుళ్లు గులిగినా చివరికి తనకే ఓటు గుద్దుతారనే విశ్వాసం కనపర్చడం గమనార్హం. సిరిసిల్ల నియోజక వర్గంలో ఎక్కడ చూసినా శాసన సభ ఎన్నికలపైనే చర్చ సాగుతుండటం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News