సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గాలకు నేడు (గురువారం) పోలింగ్ నిర్వహిస్తుండగా రెండు నియోజక వర్గాల్లో బిఆర్‌ఎస్ సిరిసిల్ల అభ్యర్థి కెటిఆర్ మినహా మిగిలిన వారందరూ ఇప్పటి వరకు శాసన సభలో కాలు పెట్టని వారే పోటీలో ఉండటం విశేషం. సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాల్లో బహుముఖ పోటీ సాగుతోంది. సిరిసిల్ల నియోజక వర్గం ఆవిర్భవించిన నాటి నుండి చరిత్రలో మరుపురాని, మరువలేని అద్భుతమైన రికార్డులు సృష్టించిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల నుండి ఐదో సారి శాసన సభకు ప్రాతినిధ్యం వహించేందుకు సిరిసిల్ల నుండి అధికార పార్టీ బిఆర్‌ఎస్ నుండి బరిలో ఉన్నారు. సిరిసిల్లలో మరోసారి ఇప్పటికే మూడు సార్లు కెటిఆర్‌పై పోటీ చేసి పరాజయం పాలైన కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బిజెపి అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన రాణి రుద్రమారెడ్డి బరిలో నిలవగా, బిఎస్‌పి నుండి పిట్టల భూమేష్ పోటీ చేస్తున్నారు.
స్వతంత్రులుగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్, పత్తిపాక సురేష్ సహా 21 మంది సిరిసిల్ల బరిలో నిలుచుండగా, వేములవాడ నియోజక వర్గంలో మొదటి సారిగా అధికార పార్టీ అభ్యర్థిగా చలిమెడ లక్ష్మీకాంతరావు రంగంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడలో పోటీ చేసి ఓటమి చెందినా పట్టువదలని విక్రమార్కుడిగా మరోసారి బరిలో ఆది శ్రీనివాస్ ఉంటున్నారు. బిజెపి అభ్యర్ధిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడైన డా. వికాస్ రావు నాటకీయ పరిణామాల మధ్య రంగంలోకి రాగా, బిఎస్‌పి అభ్యర్థిగా డా. గోలి మోహన్ బరిలో ఉన్నారు. మరి కొందరు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. సిరిసిల్ల నుంచి శాసన సభకు ఇప్పటికే నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన మంత్రి కెటిఆర్‌ను ప్రస్తుత ఎన్నికల్లో మరో సారి లక్షకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి శాసన సభకు సాధికారికంగా పంపాలని సిరిసిల్ల ప్రాంత గులాభీ శ్రేణులు ఆరాట పడుతున్నాయి. ఇప్పటికే సిఎం కెసిఆర్ సిరిసిల్లలో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించగా,
మంత్రి కెటిఆర్ సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటల్లో ఆత్మీయ యువ సమ్మేళనాలు, సిరిసిల్ల, గంభీరావుపేట, వీర్నపెల్లి, ఎల్లారెడ్డిపేటల్లో రోడ్‌షోలు నిర్వహించి ప్రచార బరిలో ముందున్నారు. సిరిసిల్ల నియోజక వర్గంనుండి మొదటి సారిగా మంత్రి కెటిఆర్ 2009లో పోటీ చేశారు. మొదటి సారి పోటీ చేసినప్పుడు పోలైన ఓట్లలో 26.9 శాతం (36,783) ఓట్లు సాధించి ప్రత్యర్థి అయిన కెకె మహేందర్ రెడ్డిపైన కేవలం 0.01 శాతం (171 ఓట్ల) తో విజయం సాధించి గెలిచాననుకొనే అతి సాధారణ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రజలతో మమేకమై తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరిస్తూ 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మెజార్టీని కొంత మెరుగు పర్చుకున్నారు. 2014లో మెజార్టీని మరింతగా అభివృధ్ధి పర్చుకున్నారు. 2018లో నాలుగో సారి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1,25,213 (70.89 శాతం) సాధించి చిరకాల ప్రత్యర్థి కొండెం కరుణ మహేందర్ రెడ్డిపై 88,601 ఓట్ల ఆధిక్యాన్ని కనపరిచారు. మంత్రి కెటిఆర్ ఎప్పటి కప్పుడు తన మెజార్టీని పెంచుకుంటూనే పోతుండటం విశేషం. వెలమ కులస్థులకు పెట్టని కోటగా మారిన సిరిసిల్ల నియోజక వర్గం చరిత్రలో చెన్నమనేని రాజేశ్వరరావు ఐదు సార్లు (1967, 1978, 1985, 1994, 2004) శాసన సభ్యుడిగా గెలుపొందినా ఆయన వరుసగా ఎప్పుడూ రెండో సారి గెలువక పోవడం గమనార్హం.
సిహెచ్ రాజేశ్వరరావు నాలుగు సార్లు సిపిఐ పేరిట, ఒకసారి తెలుగుదేశం పార్టీ పేరిట గెలుపొందారు. జువ్వాడి నర్సింగరావు రెండు సార్లు (1962,1972) లో గెలుపొందినా ఆయన కూడా వరుసగా రెండో సారి గెలిచిన సందర్భం లేకపోవడాన్ని గమనించాలి. 1952లో జే ఆనందరావు, ఎం రాజమణిదేవి, 1957 అమృతలాల్ శుక్ల, కర్రెల్లి నర్సయ్యలు ఉమ్మడి నియోజక వర్గంగా కొనసాగిన సిరిసిల్ల నుండి అప్పుడు కమ్యూనిస్టు పార్టీల ద్వారా పోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్థులుగా గెలుపొందినా వారెవరూ రెండో సారి గెలుపొందక పోవడం గమనార్హం.1983లో టిడిపి అభ్యర్థిగా వి మోహన్ రెడ్డి, 1989లో ఎన్‌వి కృష్ణయ్య జనశక్తి, 1999లో ఆర్ పాపారావు కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించినా రెండోసారి వారు ఎమ్మెల్యేగా కాలేదు. కాని సిరిసిల్ల చరిత్రలో కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల ప్రజల మనస్సులు దోచుకుని 2009,2010,2014,2018లో నాలుగు సార్లు అప్రతిహతంగా విజయాలు సాధించి సిరిసిల్ల చరిత్రలో తిరుగులేని రికార్డులు సృష్టించారు. అంతే కాకుండా కెటిఆర్ సిరిసిల్లలో అడుగు పెట్టేనాటికి అధికార పార్టీ అభ్యర్థులెవరూ సిరిసిల్లలో శాసన సభ్యులుగా కొనసాగిన దాఖలాలు లేని పరిస్థితిలో కెటిఆర్ మొదటి,
రెండో సారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గెలవడం ఒక రికార్డయితే,సాధించుకున్న తెలంగాణలో మూడోసారి, నాలుగో సారి వరుసగా గెలిచి మంత్రిగా కావడం సిరిసిల్ల చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. సిరిసిల్ల ప్రాంతం నుండి రిజర్వ్‌డ్ నియోజక వర్గం నుండి గెలిచిన పాటి రాజం ( కాంగ్రెస్ ), సుద్దాల దేవయ్య (తెలుగుదేశం) నుండి మంత్రి వర్గంలో ప్రాతినిద్యం వహించినప్పటికీ సిరిసిల్ల జనరల్ నియోజక వర్గం నుండి వారు ప్రాతినిధ్యం చేయకుండా నేరెళ్ల రిజర్వుడ్ నియోజక వర్గం నుండి ప్రాతినిద్యం వహించారనేది గ్రహించాలి. సిరిసిల్ల నుండి నాలుగు సార్లు వరుసగా గెలువడమే కెటిఆర్‌ది తిరుగులేని రికార్డు కాగా సిరిసిల్ల నుండి గెలిచి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుని అభివృద్ధికి మారుపేరుగా సిరిసిల్లను తయారు చేసిన ఘనత కెటిఆర్‌కే దక్కుతుంది. అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన కెటిఆర్‌ను సిరిసిల్ల ప్రాంత ప్రజలు వదులుకోరనే విశ్వాసంతో మంత్రి కెటిఆర్ ప్రచారానికి పూర్తి స్థాయిలో హజరు కాలేదు. బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఆయనపై ఇతర నియోజక వర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉండటంతో ఆయన సిరిసిల్ల నియోజక వర్గంలో బిఆర్‌ఎస్ శ్రేణుల ప్రచారాన్ని నమ్ముకున్నారు.
మంత్రిగా కెటిఆర్ సిరిసిల్ల ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి అభివృధ్ధికి సిరిసిల్లను మోడల్‌గా రూపొందించారు. సిరిసిల్ల ఒకప్పుడు నేతన్నల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి పార్లమెంట్ ప్రతినిధుల బృందం కూడా సిరిసిల్లను సందర్శించి వెళ్లినా దొరకని పరిష్కారాన్ని మంత్రి కెటిఆర్ బతుకమ్మ చీరెల తయారీ అవకాశం కల్పించి కార్మికులు, ఆసాములు, యజమానులు ఉపాధి, లబ్ది పొందేలా అవకాశాలు కల్పించారు. ఊహించని విధంగా అవసరమున్న ప్రతి చోట రోడ్లు, వంతెనలు ఏర్పాటు చేయించారు, వ్యవసాయ కళాశాల, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల,కెజి టు పీజీ విద్యాసంస్థ, జెఎన్‌టియు వంటి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలతో పాటు వైద్య రంగంలో ఆధునిక వసతులతో కూడిన అన్ని హంగులతో ఆసుపత్రులలో సదుపాయాలు మెరుగు పర్చి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్దిదారులకు అందించారు. ఇండ్లు రానివారికి స్థలాలిచ్చి గృహలక్ష్మి పథకం క్రింద నిధులు మంజూరు చేయించారు. సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి కెటిఆర్ ద్వారా ప్రభుత్వ పరమైన సహయాలు అందుకోని వ్యక్తి ఉన్నాడంటే బ్రహ్మండం బద్దలైనంత వింతగా చెప్పుకోవచ్చు.
సిరిసిల్ల నియోజక వర్గంలోని సిరిసిల్ల మున్సిపల్, తంగళ్లపల్లి, ముస్తాబాద్,గంభీరావుపేట, వీర్నపెల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజలకు అడిగిందే తడవుగా అన్ని పనులను చేసి పెట్టిన కెటిఆర్‌కు నిధుల కొరత సమస్య లేక పోవడం సిరిసిల్ల ప్రాంత ప్రజల అదృష్టంగా చెప్పుకోవాలి. సమస్యను కెటిఆర్ దృష్టికి తీసుకుపోవడమే ఆలస్యం అది ఏదో ఒక రకంగా పరిష్కారం అయిపోతుందనే అభిప్రాయాలను ప్రజల్లో కల్పించారు. సిరిసిల్లలో 2023 ఓటర్ల జాబితా ప్రకారం సిరిసిల్ల నియోజక వర్గంలో 2,40,798 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,17,872 మంది కాగా మహిళలు 1,22,920 మంది ఉన్నారు. ఆరుగురు ఇతరులుండగా 106 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ దాదాపుగా మహిళలకు ప్రయోజనం కలిగించేవే ఎక్కువడా ఉన్న నేపద్యంలో సిరిసిల్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నందువల్ల మహిళలు, పురుషుల ఓట్లు కూడా మంత్రి కెటిఆర్‌కు ఎక్కువ సంఖ్యలో పడే విధంగా గులాబీ శ్రేణలు పకడ్భందీగా బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుని, వాడవాడలో, గ్రామగ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఇంటింటి ప్రచారం సాగించారు. సిరిసిల్ల నుండి మంత్రి కెటిఆర్‌ను మరో సారి (ఐదో పర్యాయం )లక్షకు పైగా మెజార్టీతో గెలిపించి సిరిసిల్లలో మంత్రి కెటిఆర్‌కు ఎదురులేదని నిరూపించుకోవాలని భావిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు సంఘటితంగా,
సమైక్యంగా కలిసి ముందుకు సాగారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిరిసిల్ల నియోజక వర్గంలో మాత్రం మంత్రి కెటిఆర్‌కు ప్రతికూల పరిస్థితులు మాత్రం లేవనేది బిఆర్‌ఎస్ నేతల అభిప్రాయం. అందుకే మంత్రి కెటిఆర్ బహిరంగ సమావేశాల్లో పలు సార్లు తనకు మానవ జన్మనిచ్చింది కన్నతల్లైతే, తనకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రాంత ప్రజలని వారికి ఎంత సేవ చేసినా, తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని ప్రకటించి ప్రజల మనస్సులను మరింతగా గెలుచుకున్నారు. వారానికి రెండు రోజులు సిరిసిల్లలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. దానికి తోడు ఇటీవల ఎన్నికల్లో మద్యం పోయడంగాని, డబ్బులు పంచడం గాని గతంలో చేయలేదని, ఇకముందు కూడా అలా చేయనని ప్రకటించి కెటిఆర్ సిరిసిల్ల ప్రాంత ప్రజలు తనను ఎంతగా అభిమానిస్తారో అనే విషయాన్ని, సిరిసిల్ల ప్రజల గొప్పతనం గురించి ప్రపంచ ప్రజల ముందు ఆవిష్కృతం చేశారు. కెటిఆర్ ప్రకటనల్లోని లోతుపాతులను సిరిసిల్ల ప్రజలు అర్థం చేసుకుని ఆయనకు అండగా ఉన్నామని, ఆయన నాయకత్వానికి ఎదురు లేదని మరో సారి నిరూపించుకుంటారనేందుకు తగినట్లుగా బిఆర్‌ఎస్ నేతలు ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కెకే మహేందర్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం సాగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని ఆ ప్రభావం సిరిసిల్లలో కూడా ఉంటుందని, నిశ్శబ్ధ విప్లవం ద్వారా ఓట్లు తనకు పడతాయని భావిస్తున్నారు. బిజేపి నుండి రాణి రుద్రమారెడ్డి ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. బిజేపి శ్రేణుల్లో చాలా మంది ఆమె అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించి పార్టీ మారారు. అయినా రాణి రుద్రమ తనదైన శైలిలో ప్రచారం సాగించారు. బిఎస్‌పి నుండి పిట్టల భూమేష్‌లు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం సాగించారు. స్వతంత్రులైన లగిశెట్టి శ్రీనివాస్, పత్తిపాక సురేష్‌లు పద్మశాలి సామాజిక వర్గం ఓట్లపై ఆశతో రంగంలో నిలిచారు. వేములవాడ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ టికెట్ మొదటి జాబితాలోనే ప్రకటించడంతో ఆయన ప్రచారంలో ముందున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి చల్మెల లక్ష్మికాంతరావు బిఆర్‌ఎస్ శ్రేణులు ప్రజాప్రతినిధులతో కలిసి జోరుగా ప్రచారం సాగించారు. వేములవాడలో నిర్వహించిన ఆత్మీయ యువ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కెటిఆర్ చలిమెడ లక్ష్మికాంతరావును గెలిపిస్తే తాను వేములవాడను దత్తత తీసుకుంటానని ప్రకటించి, వేములవాడకు ఇద్దరు ఎంఎల్‌ఏలు ఉంటారన్నారు.
సిఎం కెసిఆర్ కూడా లక్ష్మీకాంతరావు గెలుపు కోసం ప్రచారం చేశారు. దాంతో బిఆర్‌ఎస్ శ్రేణులు ఆశించిన దానికన్నా ఉత్సాహంగా పని చేశారు. బిజేపి నుండి ఆఖరి క్షణంలో టికెట్ సాధించుకున్న డా. చెన్నమనేని వికాస్ రావు కూడా తనదైన తీరులో ప్రచారబరిలో దిగారు. బిఎస్‌పి అభ్యర్థిగా డా. గోలి మోహన్ తాను చేసిన సేవా కార్యక్రమాలు తనను గట్టెక్కిస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాల్లో మహిళలు, యవ ఓటర్లు ఎన్నికల పై తమ ప్రభావం చూపనున్న నేపద్యంలో గురువారం ఓటింగ్ జోరుగా సాగితే అభ్యర్థుల జయాపజయాలను వారే నిర్ణయిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్భందీగా చేశారు.