Sunday, November 24, 2024

రీజనల్ రింగ్‌రోడ్డుకు రాజకీయ రంగు

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా మారిన ఆర్‌ఆర్‌ఆర్
తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపి యత్నాలు
కేంద్రం పెట్టే కోర్రీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్‌ఎస్ ప్రణాళికలు
రెండేళ్ల క్రితం భూ సేకరణ చేపట్టినా అనుమతి ఇవ్వని కేంద్రం
ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ముందుండాలని టిఆర్‌ఎస్ శ్రేణులకు పార్టీ పిలుపు

Outer Ring Road
మనతెలంగాణ/హైదరాబాద్: తాజాగా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు రాజకీయాలు మొదలయ్యాయి. అదే రీజనల్ రింగ్‌రోడ్డు. తెలంగాణ భవిష్యత్‌కు ఎంతో కీలకంగా మారుతున్న రీజినల్ రింగ్‌రోడ్డు ఘనత తమదేనని చాటుకునేందుకు బిజెపి పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికిప్పుడు రీజనల్ రింగ్‌రోడ్డు ప్రస్తావన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కనిపించనప్పటికీ తాజాగా జరిగిన పరిణామాలు మాత్రం దీనిని ఎన్నికల అస్త్రంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికే రెండు రింగు రోడ్డులున్నాయి. ఇందులో ఒకటి ప్రస్తుతం సిటీ రోడ్లలో అంతర్భాగం కాగా, మరొకటి కూడా పలు చోట్ల సిటీ ఎక్స్‌టెన్షన్‌లో నగరానికి చేరువుతోంది. జాతీయ రహదారులు పయనించే మార్గాల్లో ఇప్పటికే రింగ్‌రోడ్డు దాకా సిటీ విస్తరించింది. దాంతో నగరానికి మరో పెద్ద రింగు రోడ్డు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. నిజానికి రీజనల్ రింగ్‌రోడ్డు ప్రస్తావని పదేళ్లక్రితమే వచ్చినా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వంలో దీని ప్రస్తావన పెరిగింది. ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయి.

2019 నుంచి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిన కేంద్రం

మహానగరానికి దాదాపు 50 కిలో మీటర్ల రేంజ్‌తో రీజనల్ రింగ్‌రోడ్డు ప్రతిపాదనలు రూపొందాయి. మహానగరానికి ఉత్తరం వైపున సంగారెడ్డి-చౌటుప్పల్ వయా నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి పట్టణాల మీదుగా ప్లాన్ చేశారు. దీని నిర్మాణానికి సుమారు పది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనాలను రూపొందించారు. దీనికి జాతీయ రహదారిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ విషయమై ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రానికి నివేదించి వచ్చారు. అయినా కేంద్రంలో ఉన్న బిజెపి నేతలు మెకాలడ్డుతూ వస్తున్నారు. దీంతో 2019 నుంచి ఈ ప్రాజెక్టును కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పక్కన పెడుతూ వస్తోంది. అప్పట్లో భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, మిగతా ఖర్చులన్నీ కేంద్రం భరిస్తుందని బిజెపి నాయకులు ప్రకటించారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 శాతం భూ సేకరణ సైతం చేపట్టింది. తదనంతరం జరిగిన పరిణామాలవల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రాష్ట్ర ప్రభుత్వానికి, సిఎం కెసిఆర్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో రాష్ట్ర బిజెపి నాయకులు దానిని పక్కన పెట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో చెరిసగం భరిస్తేనే ఆర్‌ఆర్‌ఆర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని రాష్ట్ర బిజెపి నాయకులు కేంద్ర నాయకులతో పేర్కొనడంతో ఆ ప్రాజెక్టుకు కోర్రీలు వేసి ఈ ప్రాజెక్టును కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు తొక్కిపెట్టారన్న విమర్శలు వినిసిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ధిపొందడానికి కేంద్ర, రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలిసింది.

దక్షిణ భాగానికి జాతీయ రహదారిగా గుర్తింపు ఇవ్వని కేంద్రం

అందులో భాగంగానే హైదరాబాద్ మహానగరానికి ఉత్తరం వైపున నిర్మాణమయ్యే సంగారెడ్డి- టు చౌటుప్పల్ రీజనల్ రింగు రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్ర ఉపరితల రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్రానికి చెందిన టిఆర్‌ఎస్ ఎంపిలు పలు సందర్భాల్లో కోరారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. ఈ మేరకు 2017లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. జాతీయ రహదారి 161ఏఏ (NH-161AA) నెంబర్‌ను కూడా అప్పట్లోనే కేటాయించింది. ఇక హైదరాబాద్ మహానగరానికి దక్షిణ భాగాన చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి (కంది) వరకు నిర్మాణమయ్యే రీజనల్ రింగ్‌రోడ్డు సౌత్ పార్ట్‌ను కూడా జాతీయ రహదారిగా గుర్తించాలన్న డిమాండ్‌ను కేంద్రం ముందుంచారు టిఆర్‌ఎస్ ఎంపిలు, బిజెపి నాయకులు, చౌటుప్పల్ (జాతీయ రహదారి 65) , షాద్ నగర్ (జాతీయ రహదారి 44), సంగారెడ్డి (జాతీయ రహదారి 65) వరకు దక్షిణ భాగ రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి రూ.6 వేల 481 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. దీనిని జాతీయ రహదారిగా నోటిఫై చేయాల్సి వుంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మొత్తం 17 వేల కోట్ల రూపాయలు (ఉత్తర భాగానికి పదివేల కోట్లకు పైగా + దక్షిణ భాగానికి 6,481 కోట్లు కలిపి) ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనా. అయితే, మొత్తం రింగ్‌రోడ్డును ఒక యూనిట్‌గా మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి ఇంకా జాతీయ రహదారిగా గుర్తింపు నివ్వకపోవడమేంటని టిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని వారు తప్పుపడుతున్నారు. దాంతో రీజనల్ రింగ్‌రోడ్డుకు రాజకీయ రంగు పులుముకుంది. తమదే పైచేయి కావాలన్న రాష్ట్ర బిజెపి నాయకులు తమ వల్లే ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సమాయత్తం అయ్యారు.

రాజకీయ ప్రచారాస్త్రంగా ఆర్‌ఆర్‌ఆర్

రీజనల్ రింగ్ రోడ్డుతో తెలంగాణ ముఖచిత్రం మారనుంది. మొత్తం దాదాపు 17 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగనుంది. అయితే ఈ విషయం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల అంశంగా మారబోతున్న సంకేతాలు సోమవారం వ్యక్తమయ్యాయి. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సారథ్యంలో కలిసిన తెలంగాణ బిజెపి నేతల బృందం రీజనల్ రింగ్‌రోడ్డును మంజూరు చేసినందుకు ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. కిషన్‌రెడ్డి సారథ్యంలోని ఈ బృందంలో బిజెపి ఓబీసీ సెల్ జాతీయ కన్వీనర్ డా. కె. లక్ష్మణ్, మాజీ మంత్రి డికె అరుణలు ఉన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు బంతిని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేస్తేనే, మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీతో చెప్పించి ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

నిర్మాణం పూర్తయితే అభివృద్ధికి ఎంత మేరకు

ప్రస్తుతం పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ఏరియాలోనే ఈ రీజినల్ రింగ్ రోడ్డు ఉంది. ఈ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలతోపాటు నల్గొండ, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించడంలో ఈ ఆర్‌ఆర్‌ఆర్ కీలకం కాబోతోంది. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌కు రావాల్సిన పేరును బిజెపి తమకు అనుకూలంగా మలచుకోవాలన్న ఉద్ధేశ్యంతో ముందుకెళుతోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల (2023 అసెంబ్లీ) నాటికి ఈ రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోతే అప్పటికీ కూడా ఇదే ఎన్నికల అంశంగా మారే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్ (రీజినల్ రింగు రోడ్డు) నిర్మాణం ఇకపై తెలంగాణలో వచ్చే ప్రతీ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిర్మాణం పూర్తయితే అభివృద్ధికి ఎంత మేరకు ఉపయోగపడుతుందో నిర్మాణం పూర్తయ్యే దాకా రాజకీయ పార్టీలకు ఆర్‌ఆర్‌ఆర్ ప్రచారాస్త్రంగా ఉపయోగపడే పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News