మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌టిల రాజకీయ సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ‘ మా తండాలో మా రాజ్యం అనే గిరిజనుల చిరకాల ఉద్యమ ఆకాంక్షకు కార్యరూపం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో తండాలకు మహార్దశ వచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల ఎన్నో ఏండ్ల కలలను సాకారం చేస్తూ తాండాలకు స్వయం పాలనా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం గొప్ప సామాజిక అభివృద్ధికి సాకారం చుట్టినట్లయ్యింది. 500 జనాభాకు మించి ఉన్న తండాలు, గూడాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌టిల జీవితాల్లో చెరగని ముద్ర వేసింది. మొత్తం 3,146 తండాలు, గూడాలు గ్రామపంచాయతీలుగా మారడంతో గిరిజనుల ఆనందోత్సవాలకు హద్దులు లేకుండా పోయాయి. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది ఆదివాసి, లంబాడి, గిరిజన యువతీ యువకులు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచి రాజకీయంగా అధికారంలో భాగస్వాములై తెలంగాణ ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.
తండాల సమగ్ర అభివృద్ధికి నిధులను కేటాయించి ఖర్చు చేస్తూ నిరంతరం ప్రగతికి బాటలు వేస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 20 లక్షల చొప్పున నిధులను మంజూరు చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో 1650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. 1,287 తండాలకు, గూడేలకు రహాదారి సౌకర్యం కల్పించేందుకు 2,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ.1,385 కోట్లు మంజూరు చేసింది.
ఎస్‌టిఎస్‌డిఎఫ్ (పిఆర్) కింద రాష్ట్రంలోని ఎస్‌టి ఆవాసాల 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో 88 బిటి రోడ్లను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో భాగంగా 211.86 కి. మీ. పొదవునా బిటి రోడ్లను వేసేందుకు రూ. 156.60 కోట్ల అంచనాతో 88 పనులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమతించబడ్డ బిటి రోడ్ల పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అధికార యంత్రాంగం ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డిఎఫ్) చట్టం 2017 ద్వారా రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి కేటాయించే నిధులకు ఉద్దేశించిన నిబంధనలతో ఎస్‌సి, ఎస్‌టి దెవలప్‌మెంట్ ఫండ్ యాక్ట్ ను ప్రభుత్వం రూపొందించింది. దీని కింద ఇప్పటి వరకు ఎస్‌టిల సంక్షేమానికి రూ. 47,282 కోట్లను ఖర్చు చేసింది. మంజూరైన బిటి రోడ్ల పనులను వెంటనే ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు రోడ్డు పనుల సర్వేలను నిర్వహిస్తున్నారు.
ఎస్‌టిల స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు నుంచి ఎంకూర్ మండలం బురధరాఘవాపురం వరకు రూ. 9.75 కోట్ల అంచనాతో ప్రభుత్వం మంజూరు చేసిన 13 కి.మీ.ల బిటి రడ్డు పనులు చేపట్టడానికి స్థానిక సర్పంచ్‌ల సమక్షంలో పంచాయతీరాజ్ విభాగం అధికారులు సర్వే చేశారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనెక్టివిటీ లేని ఎస్‌టి ఆవాసాలకు కనెక్టివిటీ లోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిటి రోడ్లు అందుబాటులోకి వస్తే గిరిజనుల రవాణా సౌకర్యాలు మెరుగై విద్యా, వైద్య, నిత్యావసర వస్తువుల వంటి అనేక సౌలభ్యాలు అందుబాటులోకి వస్తాయి. గత ప్రభుత్వాలు నిర్లక్షంతో దశాబ్దాలుగా జనజీవన స్రవంతికి దూరంగా ఉన్న వేలాది తండాలు, గూడేలు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలతో స్వయంపాలన, సాధికారలతో వెలుగులోకి రావడం సాధ్యమయ్యింది. బిటి రోడ్ల నిర్మాణంతో గిరిజనుల జీవితాల్లో బంగారు బాటలు వేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వాకే దక్కుతుంది. మారుమూల వాగులు వంకలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి గిరిజన గ్రామాలు ఈ బిటి రోడ్ల నిర్మాణంతో రవాణా సదుపాయం పెంపొందుతుంది.