Wednesday, January 22, 2025

జనం నన్నే ఎన్నుకుంటారు :సంజయ్ శుక్లా

- Advertisement -
- Advertisement -

ఇండోర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత పాపులర్ నాయకుల్లో ఒకరు. అయితే కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న కమలం పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం కోసం వర్గీయతో పాటుగా మరో ముగ్గురు కేంద్రమంత్రులను కూడా అసెంబ్లీ బరిలోకి దింపింది. ఈ పరిణామం వర్గీయను సైతం మొదట్లో ఆశ్చర్యానికి, గందరగోళానికి గురి చేసింది. ఎందుకంటే తన కుమారుడు ఆకాశ్‌కు టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత ఆయన పరిస్థితులకు రాజీ పడాల్సి వచ్చింది. ఇండోర్1 నియోజకవర్గం నుంచి టికెట్ పొందిన ఆయన నియోజకవర్గానికి కొత్తేమీ కాదు. గతంలో ఇండోర్ మేయర్‌గా కూడా పని చేసిన ఆయన ఆరుసార్లు ఎంఎల్‌ఎగా కూడా గెలుపొందారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మొన్న విజయదశమి రోజున ఇండోర్‌లోని మహావీర్ బాగ్‌లో జరిగిన దసరా మిలన్ కార్యక్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు వెల్లువెత్తారు. ఆ జనసందోహాన్ని చూసిన ఎవరికైనా ఆయన విజయం నల్లేరుమీద నడకేనని భావించవచ్చు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదు. విజయ్ వర్గీయ ఇండోర్ నగరానికి ఒక గెస్ట్ లాంటి వాడని, తానే ఇండోర్ బిడ్డనని అంటున్నారు ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సంజయ్ శుక్లా. ఈ వాదనను వర్గీయ కొట్టి పారేస్తున్నారు. ‘ఇండోర్‌తో నా అనుబంధం గురించి శుక్లాకు తెలియకపోతే అంతకన్నా గొప్ప అమాయకత్వం మరోటి ఉండదు’అని అంటున్నారు. అంతేకాదు 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 75 సీట్లు కూడా రావని ఆయన అంటున్నారు.

నెమ్మదస్తుడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరున్న వర్గీయ మంచి రాజకీయ వ్యూహకర్త కూడా. హర్యానాలో బిజెపి విజయంలో, అలాగే పశ్చిమ బెంగాల్‌లో కమలం పార్టీ ఎదుగుదలలో ఆయనది కీలక పాత్ర. ఈ సారి ఆయన తన గెలుపుతో పాటుగా మాల్వా ప్రాంతంలో బిజెపికి విజయాన్ని తెచ్చిపెడతారని పార్టీ అధినాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇండోర్‌నుంచి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలదాకా విస్తరించి ఉన్న మాలా ప్రాంతంలో 66 సీట్లున్నాయి. ఈ ప్రాంతంపై ఎవరు పట్టు సాధిస్తారో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బిజెపి 57 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అయితే 2018లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీ సాధించినప్పుడు ఆ పార్టీ 38 సీట్లులో విజయం సాధించగా బిజెపికి 28 స్థానాలు మాత్రమే దక్కాయి.

అయితే మరోసారి ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కోసం అధిష్ఠానం విజయ్ వర్గీయపై గంపెడన్ని ఆశలు పెట్టుకుంది. వర్గీయ కూడా అవే సంకేతాలు ఇస్తున్నారు. తాను కేవలం ఎంఎల్‌ఎ కావడం కోసం రాలేదని, అదిష్ఠానం తనకు ఇంతకన్నా పెద్ద బాధ్యతే అప్పగించనుందని ఆయన అంటున్నారు. ఒక వేళ మధ్యప్రదేశ్‌లో బిజెపి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టవచ్చని వినిపిస్తున్న వారి పేర్లలో వవిజయ్ వర్గీయ ముందున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజయ్ వర్గీయ ప్రచారంతో పోలిస్తే శుక్లా ప్రచారం సాదా సీదాగా సాగుతోందని చెప్పాలి. హంగూ ఆర్భాటాలు ఆయన ప్రచారంలో కనిపించడం లేదు. కానీ తనదే గెలుపన్న ధీమాలో శుక్లా ఉన్నారు. విజయ్ వర్గీయ ఇండోర్ మేయర్‌గా ఉన్న మాట నిజమే కానీ పట్టణంలో జరిగిన అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని ఆయన అంటున్నారు. అంతేకాదు, విజయ్ వర్గీయకు టికెట్ ఇవ్వడానికి ముందు ఆయనతో వేదిక ఎప్పుడు పంచుకున్నా శుక్లా ఆయనకు పాదాభివందనం చేసే వారు.

అంతేకాదు కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఉంది. ఈ నిరాడంబరతే ఆయన బలాలు అని జనం అంటున్నారు. శుక్లా ప్రచార రథంలో ‘తుమ్ తెహ్రే పరదేశీ, సాథ్ క్యా నిభాయేంగా(నీవు పరదేశీవి, ఎంతకాలం ఉంటావు) అనే బాలీవుడ్ పాపులర్ పాట నిత్యం ఆయన ప్రచారంలో వినిపిస్తూ ఉంటుంది. కేంద్రమంత్రులు సహా హెవీవెయిట్‌లను బరిలోకి దించడాన్ని బట్టే బిజెపి గెలుపుపై ఎంత అపనమ్మకంతో ఉందో అర్థమవుతోందని శుక్లా అంటున్నారు. ‘బేటాహీ జీతేగా, నేతా నహీ’అని ఢంకా బజాయించి చెబుతున్నారు. 20 ఏళ్ల బిజెపి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, ఆ పార్టీ వాళ్లు కేవలం మతం గురించే తప్ప అభివృద్ధి గురించి మాట్లాడరనికూడా శుక్లా అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం విజయ్ వర్గీయ మధ్య పెద్ద తేడా చూపించడం లేదు. ఇద్దరూ మంచి వాళ్లని,సానికులకు అదుబాటులో ఉండే వారేనని అంటూనే స్థానికుడు తమ ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటూ ఉండడం విశేషం. వచ్చే నెల 17lన జరగబోయే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వారే స్థానికుడుగా ఓటరు భావించారని అనుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News