Monday, December 23, 2024

గద్వాలలో వేడెక్కిన రాజకీయం

- Advertisement -
- Advertisement -

గద్వాల: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూత్మాకంగా పావులు కదుపుతున్నారు. బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ హాల్‌చల్ సృష్టిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కడం, అప్పుడే ఆయా నేతల అనుచరవర్గం అంచనాల్లో మునిగితేలుతున్నారు. అందులో భాగంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో ప్రతి రోజు సుడిగాలి పర్యటనలు చేస్తూ తామే అభివృద్ది చేశామంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఇది ఇలా ఉండగా తామేమి తక్కువ అన్నట్లుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బిజపి, కాంగ్రెస్ పార్టీతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు పలు కార్యక్రమాల ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు నియోజకవర్గాలలో విసృత్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలపై అధికార పార్టీ, ప్రతిపక్షాల హాడావిడితో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. గెలుపు పై ఎవరీ ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ విజయం సాధిస్తుందో.. ఏ పార్టీ ఓడిపోతుందో లెక్కలతో మరీ ప్రచారం చేస్తున్నాయి.

దేశానికి ఆదర్శం తెలంగాణ పథకాలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో అలంపూర్, గద్వాల రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో మాత్రం రోజు రోజుకు రాజకీయ వేడి సంతరించుకుంటుంది. అటు రాష్ట్రంలో, ఇటు జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో మరోమారు భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) జెండాను ఎగురవేస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టం కడుతారన్నారు.

బిజెపి, కాంగ్రెస్ నేతలు బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు తిప్పికొడుతూ.. బిఆర్‌ఎస్ రైతు ప్రభుత్వమని, రైతుల కోసం నిరంతరాయంగా ఉచిత విద్యుత్,పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలు అందుతున్నాయని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదో రూపంలో అందుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు వివరించి గులాబీ జెండాను అటు రాష్ట్రంలో, ఇటు గద్వాల జిల్లాలో మరోమారు రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం
బిజెపి కేంద్ర ప్రభుత్వ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ… బిజెపి పార్టీ నాయకులు ఓటర్లకు చేరువవుతున్నారు. గత ప్రభుత్వ హాయంలో నడిగడ్డలో చేసిన అభివృద్దే తప్పా, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజలు బిజెపి వైపే మొగ్గు చూపుతున్నారని ఆపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతువేధిక, స్మశానవాటిక, స్వచ్చభారత్, పార్కులు, జాతీయ ఉపాధి హామీ పథకం, రేషన్ బియ్యం, అనేకమైన సంక్షేమ పథకాలు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అందిస్తుండగా

, ప్రచారం మాత్రం అన్నీ తామే చేసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం హాస్యస్పదంగా ఉందాన్నరు. ప్రధాని నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వాని టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంతో పాటు, తెలంగాణలో కూడా బిజెపి పార్టీ అధికారంలో రావడానికి వ్యూహత్మకంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ పావులు కదుపుతున్నారు.

కాంగ్రెస్‌లోకి వలసలు…
బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులతో పాటు బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కట్టడంతో ఎన్నికల హాడావుడి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసంతృప్తితో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ జడ్పీ చైర్‌పర్సన్ సరితతిరుపతయ్యా ఇవాళ్లో.. రేపో ఢిల్లీలోని ఏఐసీసీ ముఖ్య నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీలో చక్రం తిప్పిన బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోకున్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో నడిగడ్డలో రాజకీయం ఊపందుకుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారు. ఒక పక్కా గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తూ మరో పక్క వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో మంతనాలు జరిపి ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

బిసి నినాదమే ఎజెండా….
ఇది ఇలా ఉండగా గద్వాల నియోజకవర్గంలో బిసి నినాదంతో నడిగడ్డ హక్కుల పోరాట సమితి పార్టీ నాయకులు బిసి జెండా ఎగురవేసేందకు రాష్ట్రంలోని సీడెడ్ బౌల్‌గా పేరొందిన జోగుళాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి రైతుల పక్షాన నిలబడి అనేక కార్యక్రమాలు చేపట్టారు. పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు, సీడ్ ఆర్గనైజర్ వ్యవస్థపై ఉద్యమించి రైతులకు న్యాయం చేశారు. ప్రధాన, ప్రతిపక్ష పార్టీ నాయకులతో పోటీగా గ్రామాల్లో విస్తారంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక విదానాలపై పోరాటాలు చేస్తున్నారు. ఎస్‌సి, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల మద్దతుతో రానున్న ఎన్నికల్లో గద్వాలలో బిసి జెండాను ఎగురవేసేందుకు సిద్దమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాబోవు అసెంబ్లీ ఎన్నికలల్లో ప్రజలు ఎవరి పక్షాన నిలబడి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News