Monday, December 23, 2024

పెరుగుతున్న ఎన్నికల వేడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వేసవి తాపంతో పాటుగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసిందని పలువురు సీనియర్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికార బిఆర్‌ఎస్ పార్టీ హోరెత్తిస్తుండగా, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తమతమ పార్టీలను సమాయత్తం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సమీక్షించే పనులను చేపట్టడమే కాకుండా ఉద్యోగులు, అధికారుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఆదేశించడం… వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసినట్లే ఉందని పరిశీలకులు అంటున్నారు. ఓటర్ల జబితాను సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక షెడ్యూలు, మార్గదర్శకాలను ఖరారు చేసింది కూడా. పనులు ప్రారంభించినట్లుగా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సిఈఓ) కార్యాలయం అధికారులు తెలిపారు.

అంతేగాక ఓటర్ల జాబితా సమీక్షకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఈఓ కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకే చోట మూడేళ్ళకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల దగ్గర్నుంచి కలెక్టర్లు, సీనియర్ ఐఎఎస్ అధికారులు, కానిస్టేబుల్ దగ్గర్నుంచి సీనియర్ ఐపిఎస్ అధికారుల వరకూ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసే పనిలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డిజిపిలు తలమునకలయ్యారు. ఇప్పటికే 90 శాతం పనులను పూర్తి చేశారు కూడా. సీఐ నుంచి డిఎస్పీ (ఎసిపి), డిఎస్పీల నుంచి అడిషినల్ ఎస్పీలుగా పదోన్నతుల ప్రక్రియను డిజిపి అంజనీకుమార్ పూర్తి చేయగా, ఆర్డీవో నుంచి జాయింట్ కలెక్టర్ పదోన్నతులు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ఐఎఎస్‌లుగా పదోన్నతులు కల్పించడం వంటి కీలకమైన కార్యక్రమాలను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పూర్తి చేశారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కమీషనర్లు, కార్యదర్శులకు పదోన్నతులు, పోస్టింగ్‌లను ఇచ్చే పనులను కూడా పూర్తి చేశారు.

మరికొన్ని బదిలీలు ఈనెలాఖరుకు పూర్తవుతాయని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ఇలా ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేసే పనులు చురుగ్గా జరుగుతుండగా రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సన్నద్ధం చేసుకొంటున్నాయి. అధికార బిఆర్‌ఎస్ పార్టీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్, బిజెపి, ఇతర వామపక్షపార్టీలు, బిఎస్‌పి, టిజెఎస్ చిన్న పార్టీలు కూడా తమతమ స్థాయిల్లో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేపట్టాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో జరుగుతున్న సభలు, సమావేశాల్లో కూడా అధికార పార్టీ అధిష్టానం కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూండటం, విపక్షాలు చేసిన ఆరోపణలకు ధీటుగా జవాబిస్తూ మంత్రులు గట్టిగానే కాంగ్రెస్, బిజెపిలను ఎండగడుతూనే ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ఓట్లే మళ్ళీ దగాకోరు, దళారీల రాజ్యమే వస్తుందని, అలాంటి దోపిడీ పార్టీల చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెడతారా? అని అధికార బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు,

ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు తదితర మంత్రులందరూ విపక్షాలపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే మరికొన్ని పథకాలను ప్రవేశపెడుతూ బిఆర్‌ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల్లో హోరెత్తిస్తోంది. వికలాంగులకు నెలకు పెన్షన్‌ను ఏకంగా 4,116 రూపాయలకు పెంచుతూ తీసుకొన్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అంతేగాక వెనుకబడిన వర్గాల కులవృత్తుల వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు, కులవృత్తులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ఒక్కో లబ్దిదారునికి ఒక లక్ష రూపాయలను ఆర్ధిక సహాయం చేసే పథకాన్ని ప్రవేశపెట్టిన అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఆ వర్గాల ప్రజల నీరాజనాలను అందుకుంటోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తీవ్రస్థాయిలో మేధోమధనం చేస్తోంది. పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నా, అగ్రనాయకత్వంలో ఒకరంటే ఒకరికి పడకపోయినా

అందరం కలిసికట్టుగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చేందుకే అష్టకష్టాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఇన్‌చార్జీలనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఇన్‌చార్జిలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసిసి కార్యదర్శిగా కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన పిసి విశ్వనాథ్ (కేరళ రాష్ట్ర ఎమ్మెల్యే)కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలను అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకొంది. అంతేగాక కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మన్సూర్ ఆలీఖాన్‌కు ఏఐసిసి కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చి మరీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో మండు వేసవిలో కూడా పాదయాత్ర చేస్తూ పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర ముగిసింది. ఇక జాతీయపార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనే పట్టుదలతో ఉంది.

అందుకే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలు వరుసగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే పనులు పెట్టుకొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణలో మెరుగైన వ్యూహాలతో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బిజెపి అధిష్టానం గట్టిపట్టుదలతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో బిజెపి రాష్ట్ర నాయకత్వంలో మూడువర్గాలుగా ఉన్నత నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం శ్రమిస్తూనే ఉంది.కానీ ఎలాంటి ప్రయోజనాలు లేకపోగా గ్రూపు రాజకీయాలు మరింతగా ముదిరాయని తెలియడంతోనే అధ్యక్షుడు బండి సంజయ్‌ను, ఈటల రాజేందర్, డికె అరుణ లాంటి సీనియర్ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మరీ క్లాస్‌లు తీసుకొంటూ స్పర్ధలను తొలగించే పనిలో అధిష్టానం తలమునకలయ్యిందని అంటున్నారు.

ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన భూమికను పోషించే సత్తా ఉన్న సిపిఐ, సిపిఎం వంటి వామపక్ష పార్టీలు కూడా తమతమ బలాలను పెంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకులను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఏ పార్టీతో పొత్తులు కుదుర్చుకోవాల్సి వచ్చినా తమ బలాన్ని నిరూపించుకొని తమ పార్టీలకు అనుకూలమైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వామపక్ష పార్టీలు కష్టపడుతున్నాయని అంటున్నారు. ఇలా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ ఎన్నికల మూడ్‌లోకి వచ్చాయని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News