Monday, December 23, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేడెక్కిన రాజకీయం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరునెలల గడువు ఉంది.. ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.. అయినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. నేతలు ఎవరెక్కడ పోటీచేస్తారు? ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారా? లేదంటే ఎంపిగా వెళతారా? ఆయన ఆస్థానం నుండే చేస్తారా? పక్క నియోజకవర్గంలో పాగా వేస్తారా? అసలు ఎవరెవరికి టిక్కెట్ వస్తుంది? ఇలా పలురకాలుగా జనం చర్చోపచర్చలు మొదలుపెట్టారు. ఇంతకంటే ముందు బిఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి.. కాంగ్రెస్ నుండి బిఆర్‌ఎస్‌లోకి.. బిజెపి నుండి కాంగ్రెస్‌లోకి జంప్ జిలానీలపై చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆయన వెంట ఎవరు నడుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీఎమ్మెల్యే వేముల వీరేశంల మధ్య బిఆర్‌ఎస్‌లో వార్ జరుగుతుంది.

సిట్టింగ్ అయిన లింగయ్యకు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో వీరేశం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ఆయన అనుచరులు చెపుతున్నారు. ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సఖ్యతగా ఉండి వీరేశం పొంగులేటి వెంట నడిచి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే కొన్నినియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారు. ఇవన్నీ ఇలాఉంటే కాంగ్రెస్ కురువృద్ధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చక్రం తిప్పిన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి కుందూరు జానారెడ్డిలు కాంగ్రెస్‌ను వీడుతున్నారనే వార్తలొస్తున్నాయి. వీరిరువురు బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే వార్త ఉమ్మడి జిల్లాలో గుప్పుమంది. శుక్రవారం రోజంతా ప్రజలు ఇదే విషయంపై పెద్దఎత్తున చర్చ పెట్టారు. అయితే ఉత్తమ్ కూడా సాయంత్రం వరకు ఫోన్ స్విచ్చాప్ ఉండటంతో నిజంగా వెళుతున్నారేమోననే చర్చ జరిగింది. కానీ ఉత్తమ్ మాత్రం నాది కాంగ్రెస్ పార్టీ.. నేనేందుకు కాంగ్రెస్‌ను వీడతానన్నారు.

పార్టీమార్పు ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవన్నీ ఇలాఉంటే మునుగోడు మాజీఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఆయన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఆయన బిజెపిలో ఇమడలేకపోతున్నారని, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి కూడా ఆయన వెళ్ళడంలేదు. ఎక్కడ కూడా పాల్గొనలేదు. దీంతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి స్వంత గూటికి చేరుతారని అంటున్నారు. పొంగులేటితో వెళ్ళేవారు ఎవరు? ఉత్తమ్, జానాలు బిఆర్‌ఎస్‌లోకి వెళతారా? రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? అనే చర్చలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరందుకున్నాయని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలల సమయం ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కడమే కాకుండా ప్రతిఒక్కరూ చర్చించుకోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News