Monday, December 23, 2024

మునుగోడు కాక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక టెన్షన్ నెలకొంది. ఈ ఉపఎన్నిక కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతుండడంతో రాజకీయాలు క్రమంగా హీటెక్కుతున్నాయి. ఈ ఎన్నిక ఫలితం ప్రధాన రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపనుండడంతో మునుగోడులో మునిగేది ఎవరో? తేలేదో ఎవరో? అన్న అంశంపై వాడివేడి చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో విజయం సాధించడం పార్టీలకు అత్యంత కీలకంగా మారింది.
మునుగోడు ఫలితం ఏ మాత్రం వ్యతిరేకంగా వచ్చినా దాని ప్రభావం….రానున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర స్థాయిలో పడే అవకాశం ఉండడంతో మునుగోడు ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మూడు ఏ విధంగా ఉండబోతున్నదని చెప్పడానికి మునుగోడు నియోజకవర్గం ఫలితం నాంది పలికే అవకాశముందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే ప్రస్తుతం అన్ని పార్టీలను తీవ్ర స్థాయిలో కలవరపెడుతోంది. బయటకు గెలుస్తామని ధీమాగా చెబుతున్నప్పటికీ….లోన మాత్రం మునుగోడు ఉపఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలను బెంబేలెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఈ ఉప ఎన్నిక చాలా కీలకంగా కానుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా అందరి చూపును మునుగోడు ఉపఎన్నిక ప్రధానంగా ఆకర్శిస్తోంది. గులాబీ జెండాను ఎగురవేయాలని అధికార టిఆర్‌ఎస్, తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, మొదటిసారి ఈ నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి తహతహలాడుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) ఇటీవల ఆ పార్టీకి రాజీనామ చేయడమే కాకుండా అసెంబ్లీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. దీనిని నిర్దేశిత ఫార్మెట్‌లో స్పీకర్‌కు పంపడం…ఆయన వెనువెంటనే రాజకీనామాను ఆమోదించారు.దీంతో మునుగోడు నియోజకవర్గానికి ఆరు నెలల్లో ఏ సమయంలోనైనా ఉపఎన్నిక జరగడం ఖాయం. కాగా రాజ్‌గోపాల్‌రెడ్డి త్వరలో బిజెపి తీర్ధం పుచ్చుకుని ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. రాజ్‌గోపాల్‌రెడ్డి బిజెపిలో చేరనున్నప్పటికీ పూర్తిస్థాయి క్యాడర్‌ను తనతో పాటు తీసుకురావడంలో కొంత మేరకు విఫలమయ్యారని తెలుస్తోంది. ఆయన ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కునే అవకాశముందని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. కాగా రాజ్‌గోపాల్‌రెడ్డికి దీటుగా అభ్యర్ధులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహుల పేర్లను సేకరించడమే కాకుండా వారికి ప్రజల్లో ఉన్న ఆధారణపై దృష్టి సారించాయి. ఇది కాకుండా ఏ అభ్యర్ధిని బరిలో దించడం వల్ల ఎన్నికల్లో గెలిచే అవకాశముంటుందన్న అంశంపై కూడా ఆయా పార్టీలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి. సర్వేల నివేదికలు, పార్టీ పరంగా తెప్పించుకున్న నివేదికలను పోల్చుకుని అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా త్వరలో గుజరాత్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికతో పాటు మునుగోడు అసెంబ్లీకి ఉపఎన్నిక జరగనుందని భావిస్తున్నాయి. దీంతో మూడు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ప్రత్యర్ధులను చావు దెబ్బతీయడానికి అవసరమైన కసరత్తులు చేస్తున్నాయి. దీంతో మూడు పార్టీలు గెలుపు కోసం నువ్వా? నేనా? అన్న రీతిలో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఎన్నికల్లో తలపడనున్నాయి. ఈ సీటును రాజ్‌గోపాల్‌రెడ్డి ద్వారా గెలచుకుని రాష్ట్ర రాజకీయాల్లో తమ ఆధిపత్యం రాబోతోందని చెప్పేందుకు బిజెపి ప్రయత్నిస్తుండగా అధికార టిఆర్‌ఎస్ మాత్రం మునుగోడులో విజయం సాధించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా అటు బిజెపిని…ఇటు కాంగ్రెస్‌ను చావుదెబ్బతీసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించే కార్యక్రమంలో నిమగ్నమైంది. సమయంలో తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో మళ్లీ పుంజుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో సర్వశక్తులు ఒడ్డాలని చూస్తోంది. ఇలా మూడు పార్టీలు బై పోల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. సామాజిక, ఆర్ధిక, ఇతర అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. పార్టీ ప్రాబల్యానికి తోడు అభ్యర్థి అదనపు బలం కావాలని ఆశిస్తున్నాయి. అయితే సర్వేల్లో తమకు వందశాతం అనుకూలంగా రిపోర్ట్ వస్తే టికెట్ ఇవ్వాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలను అన్ని పార్టీలు బేరీజు వేసుకుని అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ప్రజల నాడిని తెలుసుకునేందుకు సర్వేల బాట
ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సర్వేల బాట పట్టాయి. ప్రజల్లో ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయాలతోపాటు ఎవరికి టికెట్ ఇస్తే… గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వివరాలను సేకరిస్తున్నాయి. నియోజకవర్గంలోని మండలాల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను ఆధారంగా సర్వే చేయిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో మండలంలో ఐదు వేల నుంచి 15 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు.. నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో సామాజిక ప్రధానం కాబోతుందా? పార్టీల వారీగా సంప్రదాయ ఓటింగ్ కే మొగ్గు చూపుతారా? అన్న వివరాలను తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పికె టీంతో పాటు పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల ను ఫలానా వారు అభ్యర్థులు అనుకుంటే అందులో ఒక్కొక్కరి పరిస్థితిపైనా ఆరా తీస్తున్నాయి. వారికి ఫాలోయింగ్ ఉందా? టికెట్ ఇస్తే గెలుస్తారా? అసలు అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఏ ప్రాతిపదికన గెలుస్తారని భావిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా కొనసాగిన రాజ్‌గోపాల్‌రెడ్డి పనితీరు ఎలా ఉంది? గ్రామాల్లో ఇంకా ఏయే సమస్యలు ఉన్నాయి? తదితర అంశాల వారిగా సర్వేలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు ప్రజలు తమకు సరైన అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారు? ఏ ప్రాతిపదికన గెలుస్తారని భావిస్తున్నారు? అన్న అంశాలపై కూడా ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు సర్వేలు తెప్పించుకుంటున్నాయని తెలుస్తోంది. మొత్తానికి మూడు పార్టీల్లోనూ మునుగోడు ఉపఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ఈ ఎన్నిక ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోవడం తథ్యమన్న ప్రచారం వినిపిస్తోంది.

Political heats up in Telangana with Munugodu by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News