Thursday, November 21, 2024

రాజకీయ అస్థిరతే జార్ఖండ్‌కు శాపం

- Advertisement -
- Advertisement -

కొత్త సహస్రాబ్ది తొలి సంవత్సరంలో సరికొత్త రాష్ట్రంగా అవతరించిన జార్ఖండ్ మరోసారి శాససనభ ఎన్నికలకు సిద్ధమైంది. రెండు విడతలుగా జరిగే ఎన్నికల్లో తొలి దఫా పోలింగ్‌కు బుధవారం తెర లేవనున్నది. ఐదేళ్ల క్రితం చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ఎన్‌డిఎ, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు జార్ఖండ్ ముక్తిమోర్చా హోరాహోరీ పోరాడుతున్నాయి. ఈసారి జార్ఖండ్‌లో పరిస్థితి కాస్త భిన్నంగా కనబడుతోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవకపోయినా ప్రధాన పార్టీలకు జార్ఖండ్ భాషా ఖటియాన్ సంఘర్ష్‌సమితి ముచ్చెమటలు పోయించింది. ఎనిమిది స్థానాల్లో పోటీ చేయగా, ఆరు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలబడటం ప్రధాన రాజకీయ పక్షాలను ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యావంతుడు, విద్యార్థి నాయకుడు అయిన శ్రీరామ్ మహతో ఇప్పుడు జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా పార్టీని ఏర్పాటు చేసి, అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపారు.

రాష్ట్రంలో గిరిజనుల తర్వాత జనాభాలో 15 శాతానికి పైగా ఉన్న కుర్మీ కులస్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహతో భాష నివాసం, ఉద్యోగాలు వంటి స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మహతో పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుందోనని రెండు కూటములూ ఆందోళన చెందుతున్నాయి. నెల రోజులపాటు నువ్వా నేనా అన్నరీతిలో సాగిన ప్రచారపర్వంలో బిజెపి తరఫున ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ‘ఇండియా’ కూటమి తరఫున రాహుల్ గాంధీ, ఖర్గే వంటి అగ్రనేతలు వీలైనన్ని హామీలు గుప్పించి, ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నించారు. అమిత్ షా ఒక అడుగు ముందుకువేసి, ఎన్‌డిఎ గెలిస్తే జార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామనడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌టి నియోజకవర్గాల్లో బిజెపి ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆదివాసీల ఓట్లను సాధించే దిశగా ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు.

బంగ్లా చొరబాటుదారులకు జెఎంఎం ఆశ్రయమిస్తూ రాష్ట్రాన్ని ధర్మసత్రంగా మార్చేస్తోందని, తాము అధికారంలోకి వస్తే చొరబాటుదారులు లాక్కున్న భూములను స్వాధీనం చేసుకుని ఆదివాసీలకు అప్పజెబుతామని నమ్మబలకడం ద్వారా గిరిజనుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు కమలనాథులు వేసిన ఎత్తుగడ ఎంతవరకూ ఫలిస్తుందో వేచిచూడాల్సిందే. ముఖ్యమంత్రి సోరెన్ జైలుకు వెళ్లాక అధికార పగ్గాలు చేపట్టిన చంపై సోరెన్‌కు బిజెపి గాలం వేసి తమ పార్టీలో చేర్చుకోవడం కూడా గిరిజనుల ఓట్ల కోసమే. ఆదివాసీలలో చంపైకి గల పలుకుబడితో జెఎంఎం ఓట్లకు గండి కొట్టాలన్నది బిజెపి ఎత్తుగడ. జార్ఖండ్‌లో మహిళా జనాభా కూడా తక్కువేం కాదు. ప్రస్తుత శాసనసభలో 81 స్థానాల్లో 10 చోట్ల మహిళలు అధికారంలో ఉన్నారు. జీవనోపాధి వెతుక్కుంటూ యువకులు ఇతర రాష్ట్రాలకు వలసపోవడం తో మహిళల ఓట్లే అధిక సంఖ్యలో పోలయ్యే అవకాశం ఉంది. దీనిని పసిగట్టిన బిజెపి, జెఎంఎం నేతలు మహిళల కోసం తమ మేనిఫెస్టోల్లో అనేక వరాలు కుమ్మరించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మహిళల ఖాతాలో నెలకు వెయ్యి రూపాయలు జమ అయ్యేలా ‘మయ్యా సమ్మాన్’ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాము గెలిస్తే ఈ మొత్తాన్ని రూ. 2100కు పెంచుతామని బిజెపి, రూ. 2500కు పెంచుతామని జెఎంఎం హామీ ఇస్తున్నాయి.

మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు కావడం తమకు కలసివస్తుందని బిజెపి పెద్దలు భావిస్తుండగా, అన్యాయంగా తనను అరెస్టు చేశారని చెబుతూ సానుభూతి పొందేందుకు సోరెన్ ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలే పరమావధిగా భావిస్తూ, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరిస్తున్న నేతల పుణ్యమాని జార్ఖండ్ ఇప్పటికీ వెనుకబడే ఉంది. మానవాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పరిపాలన వంటి అంశాలలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగున ఉంది. అపారమైన ఖనిజ సంపద ఉన్నా, దానిని వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న పట్టుదల రాజకీయ నేతల్లో కొరవడిన కారణంగా రాష్ట్రాభివృద్ధి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు చందంగా మారింది. అధికారం కోసం పార్టీల మధ్య కొట్లాటలు, రాజకీయ నాయకుల అవినీతి శాపంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో రాజకీయ సుస్థిరతను నెలకొల్పడంతోపాటు రాష్ట్రాన్ని ప్రగతిబాటలో నడిపించగల నేతలకు ఓటర్లు పట్టం గడితే రాష్ట్రం కొంత వరకూ తెరపినపడే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News